
కోల్‌కతా: చివరి వరకు బాల్‌పై ఆధిపత్యం చూపెట్టిన మోహన్ బగాన్ సూపర్ జెయింట్స్.. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ట్రోఫీని సొంతం చేసుకుంది. శనివారం హోరాహోరీగా సాగిన ఫైనల్లో మోహన్ బగాన్ 2–1తో బెంగళూరు ఎఫ్‌సీపై నెగ్గింది. దీంతో లీగ్ షీల్డ్‌తో పాటు ఐఎస్‌ఎల్ కిరీటాన్ని కూడా దక్కించుకుంది. మోహన్ బగాన్ తరఫున జాసన్ కమింగ్స్ (72వ ని), జెమీ మెక్‌లారెన్ (96వ ని) గోల్స్ చేయగా, బెంగళూరు స్ట్రయికర్ అల్బెర్టో రొడ్రిగ్వేజ్ (49వ ని) గోల్ కొట్టాడు.
ఆరంభంలో ఇరుజట్లు పరస్పరం ఎదురుదాడులు చేసుకోవడంతో చాలా అవకాశాలు మిస్సయ్యాయి. పెనాల్టీ కార్నర్లను కూడా గోల్స్‌గా మల్చలేకపోయారు. అయితే లెఫ్ట్ వింగ్‌లో అల్బెర్టో కొట్టిన బాల్ గోల్ పోస్ట్‌లోకి దూసుకుపోవడంతో బెంగళూరు 1–0 లీడ్‌లో నిలిచింది. స్కోరును సమం చేసేందుకు మోహన్ బగాన్ స్ట్రయికర్లు తీవ్రంగా శ్రమించారు. చివరకు 72వ నిమిషంలో లభించిన పెనాల్టీని కమింగ్స్ గోల్‌గా మల్చడంతో ఇరుజట్ల స్కోరు 1–1తో సమమైంది.
నిర్ణీత టైమ్ వరకు ఇరు జట్లు రెండో గోల్ చేయడంలో విఫలమయ్యాయి. అయితే ఎక్స్‌ట్రా టైమ్‌లో మెక్‌లారెన్ మోహన్ బగాన్ కు రెండో గోల్ అందించడంతో చిరస్మరణీయ విజయం సొంతమైంది. మ్యాచ్ మొత్తంలో 20 షాట్స్ ఆడిన మోహన్ బగాన్ ఆరుసార్లు మాత్రమే టార్గెట్ వైపు వెళ్లింది. బెంగళూరు 18 షాట్లకు గాను నాలుగుసార్లు మాత్రమే లక్ష్యం వైపు దూసుకెళ్లాయి. 62 శాతం బాల్‌ను కంట్రోల్‌లో ఉంచుకున్న బెంగళూరు గోల్స్ కొట్టడంలో ఫెయిలైంది.