మొయినాబాద్ ఫాంహౌస్ ఇష్యూ గంట గంటకో మలుపు తిరుగుతోంది. ముగ్గురు వ్యక్తులు పార్టీ మారేందుకు లంచం ఇవ్వచూపారంటూ తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా పోలీసులు రామచంద్ర భారతీ అలియాస్ సతీశ్ శర్మ, హైదరాబాద్ కు చెందిన నంద కుమార్, సింహయాజులుపై ఐపీసీ సెక్షన్ 120-B, 171-B r/w 171-E 506 r/w 34 IPC & Sec 8 of Prevention of corruption Act-1988 section కింద ఎఫ్ఐఆర్ నమోదుచేశారు.
ఎఫ్ఐఆర్ కాపీలోని అంశాలను పరిశీలిస్తే.. బీజేపీతో సంబంధాలున్న సతీశ్ శర్మ, నంద కుమార్ అనే వ్యక్తులు టీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరితే రూ.100 కోట్లు, సెంట్రల్ గవర్నమెంట్ సివిల్ కాంట్రాక్టులతో పాటు కేంద్రంలో లాభదాయక పదవులు ఇస్తామని తనను ప్రలోభపెట్టారని రోహిత్ రెడ్డి కంప్లైంట్ లో పేర్కొన్నారు. ఒకవేళ తాను బీజేపీలో చేరని పక్షంలో ఈడీ, సీబీఐ దాడులు, క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సైతం కూలదోస్తామని హెచ్చరించినట్లు రోహిత్ రెడ్డి కంప్లైంట్లో ప్రస్తావించారు. ఓ రాజకీయ పార్టీ లంచం ఇవ్వజూపడం అనైతికమే కాకుండా అప్రజాస్వామికమని, ఈ చర్య అవినీతిని ప్రోత్సహించేలా ఉందని అన్నారు. ఇవి రాజకీయాలను కలుషితం చేస్తాయని ఇలాంటి చర్యలను ప్రోత్సహించవద్దని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.
అక్టోబర్ 26న సతీశ్ శర్మ, నంద కుమార్, సింహయాజులు తిరిగి తనను కాంటాక్ట్ చేసి మధ్యాహ్నం మొయినాబాద్ అజీజ్ నగర్ లోని ఫార్మ్ హౌస్ కు వచ్చి కలుస్తామన్నారని రోహిత్ రెడ్డి పోలీసులకు చెప్పారు. అంతే కాకుండా టీఆర్ఎస్కు చెందిన మరికొందరు ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్పిస్తే ఒక్కో ఎమ్మెల్యేకు రూ.50 కోట్ల చొప్పున చెల్లిస్తామని లంచం ఆఫర్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు తనతో పాటు ఇతర ఎమ్మెల్యేలు డబ్బు తీసుకుని తమ విధి నిర్వాహణ పట్ల నిర్లక్ష్యం, నిజాయితీ లేకుండా వ్యవహరించాలని సూచించారని చెప్పారు. టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరేందుకు డీల్ ఫైనల్ చేసేందుకు సతీష్ శర్మ, నంద కుమార్, సింహయాజీ స్వామి మధ్యాహ్నం ఫాంహౌస్ కు వస్తున్నట్లు సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో పార్టీ మారేందుకు లంచం ఇవ్వచూసిన సదరు వ్యక్తులతో పాటు కుట్ర వెనుక ఉన్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పైలెట్ రోహిత్ రెడ్డి కంప్లైట్ లో పోలీసులను కోరారు. రోహిత్ రెడ్డి ఫిర్యాదు ఆధారంగా రాజేంద్ర నగర్ ఏసీపీ గంగాధర్ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా, రామచంద్ర భారతి స్వామీజీ, దక్కన్ ప్రైడ్ హోటల్ ఓనర్ నందు, సతీష్ శర్మ లకు అధికారులు శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ లో వైద్య పరీక్షలు నిర్వహించారు.