రంగరాజన్​పై దాడి చేయడం తప్పే..అందుకు చింతిస్తున్నా : వీరరాఘవ రెడ్డి

రంగరాజన్​పై దాడి చేయడం తప్పే..అందుకు చింతిస్తున్నా :  వీరరాఘవ రెడ్డి
  • వాగ్వాదమే దాడికి దారి తీసింది
  • ఇకపై శాంతియుతంగా రామరాజ్యాన్ని కొనసాగిస్తా
  • కస్టడీలో వీరరాఘవ రెడ్డి వెల్లడి

చేవెళ్ల, వెలుగు : తమ మధ్య వాగ్వాదమే చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై దాడికి దారి తీసిందని ఆయనపై దాడిచేసిన రామరాజ్యం ఫౌండర్  వీరరాఘవ రెడ్డి తెలిపాడు. రంగరాజన్ పై దాడి చేసినందుకు చింతిస్తున్నానని, ఇకపై శాంతియుతంగా రామరాజ్యం సంస్థను కొనసాగిస్తానని అతను పేర్కొన్నాడు. రంగరాజన్​పై దాడి ఘటనలో రెండో రోజు బుధవారం మొయినాబాద్  పోలీసులు వీరరాఘవ రెడ్డిని ప్రశ్నించారు. రామరాజ్యం సంస్థను ఎందుకు స్థాపించారు? రంగరాజన్ పై దాడి ఎందుకు చేశారు? అని సీఐ పవన్​కుమార్​ రెడ్డి ప్రశ్నించగా.. వీరరాఘవరెడ్డి సమాధానం చెప్పాడు.  

2014-– 15 విద్యా సంవత్సరంలో తన బిడ్డ రెండో తరగతి చదువుతున్నప్పుడు పాఠశాల యాజమాన్యం పైతరగతులకు ప్రమోట్  చేయకుండా డీటెయిన్  చేసిందని, జిల్లా విద్యా శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా యాజమాన్యంపై చర్యలు తీసుకోలేదని తెలిపాడు. హైకోర్టును ఆశ్రయించినా న్యాయం జరగలేదని, దాంతో సుప్రీంకోర్టుకు ఆశ్రయించానని చెప్పాడు. అక్కడా న్యాయం జరగకపోవడంతో దేశంలోని వ్యవస్థలపై పూర్తిగా నమ్మకం పోయిందని వెల్లడించాడు. అందుకే సొంతంగా రామరాజ్యం ఏర్పాటు చేశామని, తమకు మద్దతు ఇవ్వాలని రంగరాజన్ ను కోరగా.. ఆయన అంగీకరించలేదని చెప్పాడు. దీంతో తమ మధ్య వాగ్వాదం మొదలైందని,  తన వెంట వచ్చిన సైన్యం ముందు చులకన కాకూడదనే  రంగరాజన్ పై దాడికి దిగానని వెల్లడించాడు. 

పది చదివి అన్నింటి మీద పట్టు పెంచుకున్నాడు

పదో తరగతి వరకు మాత్రమే చదువుకున్నానని వీరరాఘవ రెడ్డి పోలీసులకు తెలిపాడు. మత గ్రంథాలపై, కొన్ని చట్టాలపై అవగాహన పెంచుకున్నానని చెప్పాడు. హిందూ ధర్మాన్ని కాపాడాలనే అన్ని దేవాలయాలకు  వెళ్లి రామరాజ్యంకు మద్దతివ్వాలని  కోరానని తెలిపాడు.