ఫాంహౌస్లో కోడి పందేలు..బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి నోటీసులు

ఫాంహౌస్లో కోడి పందేలు..బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి నోటీసులు

ఫామ్ హౌస్ లో కోడిపందాల నిర్వహణ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి  శ్రీనివాస్ రెడ్డికి పోలీసులు నోటీసులిచ్చారు. ఈ మేరకు  ఫిబ్రవరి 13న ఇవాళ ఉదయం ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఇంటికి వెళ్లిన మొయినాబాద్ పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు.  విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో తెలిపారు.

ఫిబ్రవరి 11 మంగళవారం రాత్రి రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం తోలుకట్ట గ్రామ పరిధిలోని వ్యవసాయ భూమిలో భారీ ఎత్తున కోడి పందేలు నిర్వహిస్తున్నట్లు ఎస్ఓటీ పోలీసులకు సమాచారం అందింది.  రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్, చేవెళ్ల ఏసీపీ ఐ.కిషన్, మొయినాబాద్ సీఐ పవన్ కుమారెడ్డి 50 మంది సిబ్బందితో కలిసి పందేల శిబిరంపై దాడి చేశారు. ఏపీకి చెందిన నిర్వాహకుడు శివకుమార్, పందెం రాయుళ్లను చుట్టుముట్టి మొత్తం 64 మందిని అదుపులోకి తీసుకున్నారు.  84 పందెం కోళ్లు, రూ.30 లక్షల క్యాష్, 50 కార్లను స్వాధీనం చేసుకున్నారు. 64 మందిని మొయినాబాద్ పీఎస్​కు తరలించారు. తెలంగాణ, ఏపీకి చెందిన వ్యక్తులు పెద్ద ఎత్తున కోడి పందేలు ప్లాన్​చేసినట్లు తెలిసింది. 

కోడి పందేలా నిర్వహణలో పట్టుబడ్డ వారందరికీ పోలీసులు నోటీసులిచ్చారు.  ఫామ్ హౌస్ ను ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి.. శివకుమార్ అనే వ్యక్తికి లీజుకు ఇచ్చినట్లు తెలుస్తోంది.  ఈ క్రమంలోనే ఇవాళ ఫామ్ హౌస్ ఓనర్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు.