వాతావరణంలో పెరిగిన తేమ..పత్తి రైతుల్లో ఆందోళన

ఆదిలాబాద్, వెలుగు: పత్తి కొనుగోళ్లకు ముహూర్తం కుదిరింది. వారం రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో రైతులు టెన్షన్ పడుతున్నారు. ఆఫీసర్లు, ట్రేడర్లు తేమ పేరుతో ఇబ్బంది పెడతారని ఆందోళన చెందుతున్నారు. మంగళవారం కలెక్టరేట్​లో జరిగిన మీటింగ్​లో తేమ శాతం 12 మించరాదని ఆఫీసర్లు నిర్ణయించారు. వాతావరణ మార్పులు.. తేమ శాతం పెరిగితే ఏంచేస్తారనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. మద్దతు ధరా ప్రకటించలేదు. శుక్రవారం నుంచి కొనుగోళ్లకు రెడీ అవుతున్నారు.

వర్షంతో తేమ శాతం పెరిగే అవకాశం...

ఏటా వ్యాపారులు తేమ సాకుతో రైతులను ముంచుతున్నారు. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి  తప్పేలాలేదు. వారం రోజులుగా వాతావరణం చల్లబడడం.. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో  పత్తిలో తేమ శాతం 18 నుంచి 20 శాతం వరకు ఉండే అవకాశం ఉంది. వ్యాపారులు మాత్రం 8 నుంచి 12 శాతం ఉన్న పత్తినే కొనుగోలు చేస్తామని చెబుతున్నారు. తేమ శాతంపై మినహాయింపు ఇవ్వాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నా.. వ్యాపారులు పట్టించుకోవడంలేదు. దీంతో శుక్రవారం వేలం పాటలో వ్యాపారులు ఏ విధంగా స్పందిస్తారనే విషయం అయోమయం ఏర్పడింది. ఈక్రమంలో సీసీఐని రంగంలో ఉంచాలని రైతు సంఘాల లీడర్లు కోరుతున్నారు. 

గిట్టుబాటు అయ్యేనా..?

వ్యవసాయ పెట్టుబడి డబులైంది. రైతులు పత్తి సాగు కోసం ఒక్కో ఎకరానికి రూ.30 వేలు ఖర్చు చేశారు. వర్షాలు.. వరదలతో నష్టపోయిన రైతులకు పత్తి క్వింటాలుకు రూ.12 వేలు చెల్లిస్తే గిట్టుబాటుకానుంది. కానీ.. వ్యాపారులు మాత్రం గతేడాది ధరతోనే కొనుగోళ్లు చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. వ్యాపారులు సిండికేట్ గా మారి రైతులను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని రైతు సంఘాల లీడర్లు 
మండిపడుతున్నారు. 

క్వింటాకు 12 వేలు ఇవ్వాలి 

ఎకరానికి మూడు క్వింటాళ్ల  దిగుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు.  వ్యాపారులు తేమ శాతం పేరుతో కోత విధిస్తారు. క్వింటాలుకు రూ.12 వేలు ఉంటేనే గిట్టుబాటు అయితది. పత్తి ఏరే టైంలో వర్షాలు పడుతున్నాయి. ధర తగ్గిస్తే నష్టపోతాం. 

- గంగన్న, మామిడిగూడ రైతు 

సీసీఐ కొనుగోలు చేయాలి

తేమ శాతంతో సంబంధం లేకుండా కొనాలి. సీసీఐ కొనుగోళ్లు చేపట్టాలి. ఏటా తేమ శాతం పేరుతో కోతలు విధించి రైతులను ముంచుతున్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి. తేమ 20 శాతం వరకు ఉంటే అవకాశం ఉంది. కలెక్టర్ మీటింగ్​లో దీనిపై  క్లారిటీ ఇవ్వలేదు.
- బండి దత్తాత్రి, రైతు సంఘం లీడర్