- చైనా అనుకూల పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్‌కే ప్రజల పట్టం
మాలె: మాల్దీవుల ఎన్నికల్లో ప్రజలు చైనా అనుకూలిడిగా పేరొందిన మహ్మద్ మొయిజ్జుకే మరోసారి పట్టం కట్టారు. పార్లమెంటరీ ఎన్నికల్లో మొయిజ్జుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (పీఎన్సీ) పార్టీ ఘన విజయం సాధించింది. మాల్దీవుల పార్లమెంట్‌లోని 93 నియోజకవర్గాలకు ఆదివారం పోలింగ్ నిర్వహించారు. ఎన్నికల ఫలితాలను ప్రకటించగా.. 93 స్థానాలకుగానూ మొయిజ్జు నేతృత్వంలోని సంకీర్ణ కూటమి 71 సీట్లలో విజయం సాధించింది.
పీఎన్సీ 68 సీట్లు కైవసం చేసుకోగా, సంకీర్ణ భాగస్వాములైన మాల్దీవ్స్ నేషనల్ పార్టీ (ఎంఎన్‌పీ)కి ఒకటి, మాల్దీవ్స్ డెవలప్మెంట్ అలయన్స్ (ఎండీఏ) రెండు స్థానాల్లో విజయం సాధించాయి. భారత్‌కు అనుకూలంగా ఉండే ఆ దేశ మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం మహ్మద్ సోలెహ్ నేతృత్వంలోని మాల్దీవియన్ డెమొక్రటిక్ పార్టీ (ఎండీపీ) 15 సీట్లకే పరిమితమైంది.