హైదరాబాద్: జన్వాడ ఫామ్ హౌస్లో రేవ్ అండ్ డ్రగ్ పార్టీలో ఏ1 నిందితుడిగా ఉన్న కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాలను మోకిల పోలీసులు విచారించారు. మోకిల పోలీస్ స్టేషన్లో రాజ్ పాకాల విచారణ ముగిసింది. 3 గంటల పాటు అతనిని పోలీసులు విచారించారు. ఫామ్ హౌస్లో పార్టీ జరిగిన తీరు, మాదక ద్రవ్యాల వినియోగంపై ఆరా తీశారు. మరింత లోతైన విచారణ కోసం రాజ్ పాకాలను జన్వాడ ఫామ్ హౌస్ వద్దకు తీసుకెళ్లి సీన్ టు సీన్ విచారించాలని మోకిల పోలీసులు నిర్ణయించారు.
ఎన్‌డీపీఎస్‌యాక్ట్, తెలంగాణ గేమింగ్ యాక్ట్ కింద కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల (50), విజయ్ మద్దూరి (55), ఫామ్‌హౌస్ మేనేజర్ కార్తీక్(30)పై మోకిలా పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఏ1గా రాజ్‌పాకాల, ఏ2గా విజయ్మద్దూరి, ఏ3గా కార్తీక్ను చేర్చారు. అనుమతి లేకుండా పార్టీ నిర్వహించినందుకు, ఫారిన్లిక్కర్వాడినందుకు ఎక్సైజ్ యాక్ట్ కింద కూడా కేసు ఫైల్‌చేశారు. ఫామ్‌హౌస్‌లో నిర్వహించిన సోదాల్లో 12 ఫారిన్ లిక్కర్ బాటిల్స్.. ఢిల్లీ, మహారాష్ట్రకు చెందిన రెండు నాన్ డ్యూటీ లిక్కర్ బాటిల్స్.. 11 కేఎఫ్ బీర్లు.. 7.35 లీటర్లు టీజీ ఐఎంఎఫ్‌ఎల్ బాటిల్స్ ను పోలీసులు పట్టుకున్నారు. వీటితో పాటు పెద్ద మొత్తంలో క్యాసినో కాయిన్స్, ప్లేయింగ్ కార్డ్స్ సీజ్ చేశారు.
Also Read :- సెక్రటేరియట్ సెక్యూరిటీ నుంచి టీజీఎస్పీ ఔట్
రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం జన్వాడ పరిధిలో కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాలకు 8 ఎకరాల్లో ఫామ్‌హౌస్ ఉంది. రాజ్ పాకాల రెండు ఐటీ కంపెనీలు నిర్వహిస్తున్నాడు. ఫామ్‌హౌస్‌లో వీకెండ్స్‌తో పాటు ఇతర సమయాల్లో ఈవెంట్స్ జరుగుతుంటాయి. గత శనివారం (అక్టోబర్ 26, 2024) రాత్రి ఆ ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీ జరుగుతున్నట్లు, భారీ శబ్దాలతో న్యూసెన్స్ చేస్తున్నట్లు రాత్రి 10.30 గంటల సమయంలో డయల్ 100కు కాల్ వచ్చింది. దీంతో సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులతో స్థానిక మోకిల పోలీసులు, ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రాత్రి 11.30 గంటల సమయంలో ఫామ్‌హౌస్కు చేరుకున్నారు.
పార్టీలో డ్రగ్స్ వాడుతున్నారనే సమాచారంతో డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. పోలీసులు చేరుకున్న వెంటనే అక్కడున్న వారంతా అప్రమత్తమయ్యారు. పారిపోయేందుకు ప్రయత్నించారు. పార్టీలో 22 మంది పురుషులు,18 మంది మహిళలతో పాటు ఐదుగురు పిల్లలున్నట్టు పోలీసులు గుర్తించారు. ఒక్కో టేబుల్దగ్గర నాలుగేసి కుర్చీల చొప్పున వేసి ఉన్నాయి. వాటి దగ్గర క్యాసినో కాయిన్స్, ప్లేయింగ్ కార్డ్స్ కనిపించాయి. ఒక దగ్గర బార్సెంటర్పై లిక్కర్బాటిల్స్కనిపించాయి. 22 మందికి డ్రగ్స్ర్యాపిడ్ టెస్ట్‌లు చేయగా ప్రముఖ వ్యాపారి విజయ్ మద్దూరి కొకైన్ తీసుకున్నట్లు నిర్ధారణయింది.