- చేవెళ్ల ఆర్డీవో సాయిరాంకు నివేదిక అందజేత
చేవెళ్ల, వెలుగు: మోకిలా – బుల్కాపూర్ ఫిరంగి నాలా సర్వేను రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు పూర్తి చేశారు. మొత్తం 22 కిలోమీటర్ల మేర సర్వే చేశారు. ఆ నివేదికను చేవెళ్ల ఆర్డీవో సాయిరాంకు గురువారం అందజేశారు. శంకర్పల్లి మండలం జన్వాడలో ఉన్న కేటీఆర్ ఫామ్ హౌస్ పై వివాదం నెలకొన్న నేపథ్యంలో సర్వే చేపట్టారు. ఈ క్రమంలో నాలా ఎక్కడెక్కడ కబ్జాకు గురైందన్న వివరాలు సేకరించారు. ఈ నాలా శంకర్పల్లి –హైదరాబాద్ ప్రధాన రహదారి పక్క నుంచి కేటీఆర్ ఫామ్ హౌస్ మీదుగా వెళ్లింది. దీనిపై ఆక్రమణలు జరిగిన ప్రాంతాలను గుర్తించిన అధికారులు... త్వరలోనే నోటీసులు ఇవ్వనున్నట్టు తెలిసింది.
కాగా, శంకర్ పల్లి మండలం బుల్కాపూర్ శివారు నుంచి గోపులారం, జన్వాడ, మణికొండ వరకు 22 కిలోమీటర్ల మేర నాలా సర్వే పూర్తి చేసినట్టు ఓ అధికారి తెలిపారు. నాలాను ఆక్రమించి ఫామ్ హౌస్ ల ప్రహరీ గోడలు, గేట్లు నిర్మించినట్టు అధికారులు గుర్తించారు. అయితే చేవెళ్ల డివిజన్‌కు సంబంధించిన సర్వే పూర్తి కాగా, రాజేంద్రనగర్ ఆర్డీవో పరిధిలోకి వచ్చే సర్వే ఎప్పుడు చేస్తారనేది తేలాల్సి ఉన్నది.