ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

రుణ ఉపశమన కమిషన్ ఏర్పాటు చేయాలి

జనగామ అర్బన్, వెలుగు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయానికి బడ్జెట్ పెంచాలని రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మోకు కనకారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం జనగామ పట్టణంలో రైతు సంఘం మండల మహాసభను ఉరుసు కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మోకు కనకారెడ్డి మాట్లాడుతూ.. ఎరువులు, మందులు, విత్తనాలు, వ్యవసాయ పరికరాల ధరలు బాగా పెరిగాయని.. వచ్చిన దిగుబడితో పెట్టుబడి ఖర్చు కూడా వెళ్లడం లేదన్నారు. దీంతో రైతులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేరళ తరహాలో రుణ ఉపశమన కమిషన్ ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం మండల రైతు కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడుగా ఉరుసు కుమార్, పట్టణ కార్యదర్శిగా మంగ బీరయ్య, కమిటీ సభ్యలుగా కర్రె రాములు, కోయల్​ కార్​ శివ, బండ శ్రీశైలం, ఎల్లయ్య, కర్రె సత్తయ్య, ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

కార్యకర్త కుటుంబానికి రూ.2లక్షల బీమా

ఏటూరునాగారం, వెలుగు : రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీఆర్ఎస్ కార్యకర్తకు అధిష్టానం రూ.2లక్షల బీమా అందజేసింది. వివరాల్లోకి వెళితే.. ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి జీపీ పరిధిలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన సోడి ఇరుమయ్య(35) ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అతనికి టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉన్నందున.. బీమా కింద అధిష్టానం రూ.2లక్షల చెక్కు మంజూరు చేసింది. ఈమేరకు సోమవారం టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గడదాసు సునీల్ కుమార్ బాధిత కుటుంబానికి చెక్కు అందజేశారు. టీఆర్ఎస్ కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కోఆప్షన్ మెంబర్ ఎండీ వలియాబీ -సలీం, వైస్ ఎంపీపీ తుమ్మ సంజీవరెడ్డి, సీనియర్ నాయకులు తుమ్మ మల్లారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కూనూరు అశోక్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు ఎండీ ఖాజాపాషా తదితరులున్నారు.

మార్కెట్ కు కొత్త పత్తి

వరంగల్ సిటీ, వెలుగు : మార్కెట్లకు కొత్త పత్తి రాక ప్రారంభమైంది. సోమవారం వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్​కు 878 బస్తాల పత్తి వచ్చింది. అత్యధికంగా క్వింటాల్​కు రూ. 8,350 ధర పలికింది. ఇక దేశీ రకం మిర్చి దసరా ముందు రూ.90వేలు పలకగా.. ఇప్పుడు రూ.80వేలు పలుకుతోంది.

వర్ధన్నపేటలో ‘స్వచ్ఛ’ ర్యాలీ

వర్ధన్నపేట, వెలుగు : వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో సోమవారం స్వచ్ఛ్ భారత్ ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్ నిషేధంపై పట్టణ ప్రజలకు అవగాహన కల్పించారు. నిషేదిత ప్లాస్టిక్​ను వినియోగిస్తే చర్యలు తీసుకుంటామని చైర్ పర్సన్ అంగోతు అరుణ హెచ్చరించారు. వీధుల్లో ఇష్టానుసారంగా చెత్త పడేయవద్దని సూచించారు. కమిషనర్ రవీందర్, వైస్ చైర్మన్ కొమాండ్ల ఎలేందర్ రెడ్డి ఉన్నారు.

చేప పిల్లల పంపిణీ

వెంకటాపూర్(రామప్ప), వెలుగు : ఉచిత చేప పిల్లలను సంరక్షించుకొని, మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలని రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు పల్లా బుచ్చయ్య అన్నారు. సోమవారం వెంకటాపూర్ మండలకేంద్రంలో ఎంపీపీ బుర్ర రజిత సమ్మయ్య, జడ్పీటీసీ రుద్రమదేవి చేతుల మీదుగా మండలంలోని మత్స్య సహకార సంఘాలకు చేప పిల్లలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పల్లా బుచ్చయ్య మాట్లాడుతూ.. మండలంలో 28 చెరువుల్లో 6, 37,500 చేప పిల్లలను పంపిణీ చేశామన్నారు. దీనివల్ల సుమారు 500 కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు.

పోడు రైతులకు త్వరలో హక్కు పత్రాలు

నర్సంపేట, వెలుగు: అర్హులైన పోడు రైతులందరికీ త్వరలో పోడు హక్కు పత్రాలు ఇవ్వనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్​రెడ్డి వెల్లడించారు. నర్సంపేటలో సోమవారం ఎఫ్​ఆర్​సీ కమిటీ మెంబర్లు, ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2005కు ముందు అటవీ భూములను సాగు చేసుకుని కాస్తులో ఉన్న వారికి హక్కు పత్రాలు ఇచ్చేందుకు సర్వే ప్రారంభమైందని చెప్పారు. పోడు హక్కు పత్రాల కోసం 7711 మంది నియోజకవర్గ వ్యాప్తంగా దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. త్వరలో 22వేల ఎకరాల పోడు భూమి సమస్య పరిష్కారం కానుందని వివరించారు. అడిషినల్​ కలెక్టర్​ హరిసింగ్​, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఆఫీసర్లు పాల్గొన్నారు.

ఘనంగా కంఠమహేశ్వరస్వామి కల్యాణం

పర్వతగిరి, వెలుగు : వరంగల్​ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడలో సురమాంబదేవి, కంఠమహేశ్వర స్వామి కల్యాణాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. మహిళలు జలబిందలు, మంగళహారతులతో ఆలయంలోకి వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా జలాభిషేకం, గణపతి పూజ, కలిశ పూజలు చేశారు. అనంతరం స్వామి వారికి నైవేద్యం సమర్పించారు.

బీజేపీ గెలవాలని పూజలు

మహబూబాబాద్ అర్బన్, వెలుగు : మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ గెలవాలని కోరుతూ.. ఆ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి, మానుకోట వైస్ ఎంపీపీ ఎల్ది మల్లయ్య గౌడ్ స్థానిక ముత్యాలమ్మ గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మునుగోడులో డబ్బు, మద్యంతో టీఆర్ఎస్ గెలవాలని చూస్తోందని ఆరోపించారు. గులాబీ నాయకులు ఎన్ని కుట్రలు చేసినా బీజేపీ గెలుపు ఖాయమన్నారు. బీజేపీ లీడర్లు ముల్లంగి ప్రతాప్ రెడ్డి,  ఆకుల శ్రీనివాస్, మల్లం యశ్వంత్,  శ్యాం సుందర్ శర్మ,  తేల్ల యాకన్న,  వెంకన్న తదితరులు ఉన్నారు. 

డయాలసిస్ పేషెంట్లకు పింఛన్లు

జనగామ అర్బన్, వరంగల్ సిటీ, వెలుగు : జనగామ జిల్లాలోని డయాలసిస్ పేషెంట్లకు సోమవారం కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య పింఛన్ కార్డులు అందజేశారు. స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ పి. సుగుణాకర్ రాజు ఆధ్వర్యంలో ఐదుగురు డయాలసిస్ పేషెంట్లకు వీటిని పంపిణీ చేశారు. డయాలసిస్ పేషెంట్లకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. వరంగల్ లోనూ అడిషనల్ కలెక్టర్ శ్రీవాత్సవ డయాలసిస్ పేషెంట్లకు పింఛన్లు అందజేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్​వో వెంకటరమణ , ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ కమల్ చందు నాయక్ తదితరులున్నారు.

గ్రామ సమస్యలపై పోరు బాట

వేలేరు, వెలుగు : స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలపై ఎమ్మెల్యే రాజయ్యకు పట్టింపులేదని బీజేపీ రాష్ట్ర నాయకుడు బొజ్జపల్లి సుభాష్​ఆరోపించారు. సోమవారం హనుమకొండ జిల్లా వేలేరు మండలం శాలపల్లిలో గ్రామ సమస్యలపై ‘బీజేపీ పోరుబాట’ ప్రోగ్రాం చేపట్టారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి సొంత మండలమైనప్పటికీ.. ఏనాడూ పట్టించుకోలేదన్నారు. కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షుడు కాట్రేవుల రాజు యాదవ్, అసెంబ్లీ కన్వీనర్ అంజిరెడ్డి, బూత్ అధ్యక్షుడు మండల రవి తదితరులున్నారు.

తహసీల్దార్ ఆఫీసులకు తాళాలు

గత 78 రోజులుగా వీఆర్ఏలు ధర్నాలు, దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో సోమవారం తహసీల్దార్ ఆఫీసులకు వీఆర్ఏలు తాళాలు వేసి, నిరసన తెలిపారు. ప్రభుత్వం వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం.. పేస్కేల్, ప్రమోషన్లు, వారసత్వ ఉద్యోగాలు కల్పించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 40 మంది వీఆర్ఏలు మృతి చెందినా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. సర్కారు స్పందించకపోతే ఈనెల 15న యాదాద్రి నుంచి ప్రగతి భవన్ వరకు 23,000 మంది వీఆర్ఏలతో పాదయాత్ర చేస్తామని హెచ్చరించారు.
- వెలుగు నెట్ వర్క్

ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనం

మొగుళ్లపల్లి(టేకుమట్ల), వెలుగు : కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచి, అభివృద్ధి పేరుతో టీఆర్ఎస్ పార్టీలో చేరిన జయశంకర్ భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి దిష్టిబొమ్మను సోమవారం కాంగ్రెస్ లీడర్లు దహనం చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ యూత్ జిల్లా అధ్యక్షుడు బండ శ్రీకాంత్ మాట్లాడుతూ.. కుటుంబ లబ్ధి కోసమే గండ్ర వెంకటరమణారెడ్డి టీఆర్ఎస్ కు అమ్ముడుపోయారన్నారు. అభివృద్ధి చేతగాని ఎమ్మెల్యే.. తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ భవిష్యత్తు ఇస్తే.. కన్నతల్లిలాంటి పార్టీకి అన్యాయం చేశాడని మండిపడ్డారు.

టీఆర్ఎస్ లో చేరిన కార్పొరేటర్


హనుమకొండ సిటీ, వెలుగు : గ్రేటర్ వరంగల్ 31వ డివిజన్ ఇండిపెండెంట్ కార్పొరేటర్ మామిడ్ల రాజు యాదవ్ సోమవారం టీఆర్ఎస్​లో చేరారు. హైదరాబాద్​ లో మంత్రి కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. గత బల్దియా ఎన్నికల్లో మామిడ్ల రాజు స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేసి, టీఆర్ఎస్ అభ్యర్థి మాడిశెట్టి శివశంకర్ ను ఓడించారు. రాజుతో పాటు 20మంది అనుచరులు టీఆర్ఎస్​లో చేరారు.

నిట్ పూర్వ విద్యార్థులకు సత్కారం

ఒకే వేదికపై 50 ఏండ్ల జ్ఞాపకాలు
చీఫ్ గెస్టుగా హాజరైన రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి

కాజీపేట, వెలుగు : వరంగల్ నిట్ 64వ స్థాపనా దినోత్సవాన్ని పురస్కరించుకుని.. 1964 నుంచి 2014 మధ్యలో నిట్​లో చదివి ఉన్నత స్థాయికి ఎదిగిన పూర్వ విద్యార్థులను ఘనంగా సత్కరించారు. నిట్ పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించగా.. చీఫ్ గెస్టులుగా రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి, డీఆర్డీవో అడ్వాన్డ్స్ సిస్టం ల్యాబ్ డైరెక్టర్, ప్రముఖ శాస్త్రవేత్త డా.ఎం.రాంమనోహర్ బాబు, నిట్ డైరెక్టర్ ఎన్వీ రమణారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశేష సేవలు అందిస్తున్న 21మంది పూర్వ విద్యార్థులకు అలుమ్నీస్ లైఫ్ టైమ్ అవార్డ్, విశిష్ట పూర్వ విద్యార్థి, విశిష్ట యువ పూర్వ విద్యార్థి, అవార్డ్ ఫర్ ప్రొఫెషనల్ ఎక్సలెన్సీ, జీవితకాల సాఫల్య పురస్కారాలతో సత్కరించి, అవార్డులు ప్రదానం చేశారు. ముఖ్య అతిథి మనోహర్ బాబు మాట్లాడుతూ..  వరంగల్ నిట్​లో చదువుకున్న విద్యార్థులు ఉన్నత స్థాయిలో రాణించి, దేశం గర్వించేలా సేవలు అందిస్తున్నారని కొనియాడారు.

నిట్ అభివృద్ధిలో పూర్వ విద్యార్థులు ముఖ్య పాత్ర పోషించాలన్నారు. అలుమ్నీస్ లైఫ్ టైమ్ అచీవ్​మెంట్ అవార్డు అందుకున్న 1964 బ్యాచ్ కి చెందిన డా. వీఏ శాస్ర్తి వేదికపై తన అనుభవాలను పంచుకున్నారు. ప్రస్తుత నిట్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీగా ఉన్న సమయంలో ఇక్కడ చదువుకున్నానని, కాలేజీ ఫౌండేషన్ స్టోన్ వేయడానికి వచ్చిన అప్పటి ప్రధాని నెహ్రూని కూడా చూశానని తెలిపారు. అవార్డులు, సత్కారాలు అందుకున్న వారిలో ఐఏఎస్, ఐపీఎస్, ప్రొఫెషనల్ ఇంజనీర్లు ఉన్నారు. కార్యక్రమంలో డీన్ ప్రొఫెసర్ ఎన్.సుబ్రమణ్యం, అసోసియేట్ డీన్ ప్రొఫెసర్ అజీమ్, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు ఆలపాటి ప్రసాద్ తదితరులున్నారు.

బాధితుల సమస్యలపై స్పందించాలి


భూపాలపల్లి అర్బన్, వెలుగు : పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితుల సమస్యలపై వెంటనే స్పందించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సురేందర్ రెడ్డి ఆదేశించారు. సోమవారం తన ఆఫీసులో ప్రజాదివస్ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి  వచ్చిన 20 మంది బాధితులు ఎస్పీకి అర్జీలు ఇచ్చారు. వాటిని పరిశీలించిన ఎస్పీ.. సంబంధిత స్టేషన్లకు పంపించారు. తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పోలీసులు ఏ సమయంలోనైనా ప్రజా సమస్యలపై స్పందించాలన్నారు. ముఖ్యంగా మహిళలకు సంబంధించిన కేసులను వెంటనే పరిష్కరించాలన్నారు. బాధితులను పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పించుకోకుండా సకాలంలో న్యాయం చేయాలన్నారు.

 విలేకరిపై బీట్ ఆఫీసర్ దాడి

కొత్తగూడ, వెలుగు : మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం చింతగూడెం పరిధిలో ఓ బీట్ ఆఫీసర్ విలేకరిపై దాడి చేశాడు. బాధితుడు సురేశ్​ వివరాల ప్రకారం.. సోమవారం చింతగూడెంలో ఎఫ్ఆర్సీ కమిటీ పోడు భూములను సర్వే చేస్తుండగా రిపోర్టర్ సురేశ్.. తన భూమిని కూడా సర్వే చేయాలని కోరాడు. ఈక్రమంలో బీట్ ఆఫీసర్ దురుసుగా ప్రవర్తించడంతో పాటు అతనిపై చేయి చేసుకున్నారు. దీంతో సురేశ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీనిపై రేంజర్ చలపతిరావు మాట్లాడుతూ.. అతని పేరు మీద ఆన్ లైన్ దరఖాస్తు లేదని, తండ్రి పేరు మీద ఉందని తెలిపారు. తన పేరు మీద చేయాలని పట్టుబడితే పక్కకు నెట్టారని, కొట్టలేదని పేర్కొన్నారు.

జర్నలిస్టులకు ఇండ్లు ఇవ్వాలి

ములుగు, వెలుగు : జిల్లాలోని జర్నలిస్టులకు ఇండ్లు, ఇండ్ల జాగలు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ములుగు కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. తమకు సొంతిల్లు లేక ఇబ్బందులు పడుతున్నామని, జర్నలిస్టులకు సైతం రూ.10లక్షల ఆర్థిక సాయం చేయాలన్నారు. రైల్వే పాస్ లను పునరుద్ధరించాలని, టోల్ గేట్ల నుంచి ఫీజు మినహాయించాలని కోరారు. రూ.5వేల పెన్షన్ తో పాటు ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం కలెక్టర్ కృష్ణ ఆదిత్యకు వినతిపత్రం ఇచ్చారు. ప్రోగ్రాంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జాతీయ కౌన్సిల్ సభ్యుడు పిట్టల మధుసూదన్, ఇతర సభ్యులు, జర్నలిస్టులు ఉన్నారు.