పరిచయం : ప్రతిసారి కొత్త పాత్ర చేయాలన్నదే నా కోరిక : దీక్షిత్ శెట్టి

పరిచయం :  ప్రతిసారి కొత్త పాత్ర చేయాలన్నదే నా కోరిక : దీక్షిత్ శెట్టి

తాను చేసే ప్రతి పాత్ర కొత్తగా ఉండాలని పరితపించే నటుల్లో ఇతనొకరు. వరుసగా టాలీవుడ్​లో ప్రాజెక్ట్స్​ చేస్తోన్న ఈ నటుడు ఇప్పటికే కన్నడ, తెలుగుతోపాటు మలయాళంలో నటించాడు. త్వరలో తమిళంలో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. లేటెస్ట్​గా ​‘టచ్​ మీ నాట్​’ అనే తెలుగు సిరీస్​తో మరోసారి ఓటీటీ ఆడియెన్స్​ను పలకరించబోతున్నాడు. ఈసారి కూడా మరో కొత్త అవతారంలో కనిపించబోతున్నాడు. ఈ సందర్భంగా మెస్మరైజింగ్​ యాక్టర్ దీక్షిత్​ జర్నీలో ఇంట్రెస్టింగ్​ సంగతులివి.

దీక్షిత్ శెట్టి సొంతూరు కర్నాటకలోని కుందాపూర్‌‌‌‌. బెంగళూరులో ఎల్​ఎల్​బీ పూర్తి చేశాడు. ఇండస్ట్రీకి రాకముందు ఎన్​సీసీలో పనిచేశాడు. ప్రొఫెషనల్ యక్షగాన డాన్సర్ కూడా. మరి నటన ఎలా అబ్బిందంటే.. ఎల్​ఎల్​బీ సెకండియర్ చదివేటప్పుడే థియేటర్​ ఆర్టిస్ట్​గా నటన మొదలుపెట్టాడు. ఆ టైంలో నటనతోపాటు తెలుగు, మలయాళం భాషలు కూడా నేర్చుకున్నాడు. దీక్షిత్​కి పెంపుడు జంతువులంటే చాలా ఇష్టం. పెట్‌‌‌‌ అడాప్షన్​ సెంటర్స్​కి సపోర్ట్ చేస్తుంటాడు.
వీలున్నప్పుడల్లా ‘సౌత్ బెంగళూరు కేర్స్’ అనే సెంటర్ తరఫున క్యాంపెయిన్స్​లో పాల్గొంటున్నాడు. 

షూటింగ్స్ లేనప్పుడు 

ఓ వైపు నటిస్తూనే మరోవైపు యాక్టింగ్ ఇన్​స్టిట్యూట్​లో పనిచేస్తున్నాడు. అనుపమ్​ ఖేర్​ ‘యాన్ యాక్టర్ ప్రిపేర్స్ (ఎఎపి)’ ఇన్​స్టిట్యూట్​లో అసోసియేట్ అయ్యాడు. షూటింగ్స్ లేనప్పుడు స్క్రిప్ట్స్​ రివ్యూ చేయడం, నాటకాల్లో నటించడం చేస్తుంటాడు. దానివల్ల నటన ఇంకా ఇంప్రూవ్ అవుతుందని నమ్ముతాడు. ప్రస్తుతం థియేటర్​ ట్రూప్​కి ఫ్యాకల్టీగా కూడా ఉన్నాడు. స్క్రిప్ట్​ సెలక్షన్ విషయానికొస్తే.. ‘‘ఏదైనా స్క్రిప్ట్ లేదా రోల్ నా దగ్గరకి వచ్చినప్పుడు అది ఇంతకుముందు చేసినట్లు ఉండకూడదు అనుకుంటా. ఎగ్జయిటింగ్​గా అనిపిస్తే చేస్తా” అంటున్నాడు దీక్షిత్. 

టెలివిజన్​ నుంచి.. 

సినిమాల కంటే ముందు బుల్లితెర ఆడియెన్స్​కు దగ్గరయ్యాడు. ఒకేసారి మూడు ప్రాజెక్ట్​లతో టెలివిజన్​ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ‘ప్రీతి ఎండరెను’ సీరియల్​తో టెలివిజన్​ డెబ్యూ చేశాడు. తర్వాత ‘సాక్షి’ సీరియల్​లో నటించా డు. అయితే 2016 నుంచి 2020 వరకు కొనసాగిన ‘నాగిణి’ సీరియల్​తో గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత మళ్లీ సీరియల్స్​లో నటించలేదు. కానీ, టీవీలో ఒక డాన్స్​ రియాలిటీ షోలో పార్టిసిపేట్​ చేసి, విన్నర్​గా నిలిచాడు. 

ఆ సినిమా కోసం..

2021లో కన్నడ సినిమా‘కేటీఎమ్​’లో  లీడ్​ రోల్ చేశాడు. అందులో నాలుగు రకాల లుక్స్​లో కనిపించాడు. టీనేజీ నుంచి 20 ఏండ్లు పైబడిన వయసుల్లో కనిపించాడు. టీనేజీ లుక్​లో కనిపించడం కోసం 7 కిలోలు బరువు తగ్గాడట. ఈ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘సీరియల్ ఆర్టిస్ట్​ ఎవరికైనా వెండితెర మీద తమను తాము చూసుకోవాలనే కల ఉంటుంది. నిజానికి సినిమాల్లో నటించాలనే తపనతోనే చాలామంది ఇండస్ట్రీకి వస్తారు. అటు వెళ్లడానికి నేరుగా దారిలేక, బుల్లితెర అవకాశాల కోసం ఎదురుచూస్తాం. కన్నడలో నేను రెండు సినిమాలు చేయడానికి మధ్య నాలుగేండ్లు గ్యాప్​ వచ్చింది. ఆ టైంలో ఇండస్ట్రీలో నేను నిలదొక్కుకోగలనా? అనే ఆలోచన, ప్రశ్నలు తలెత్తాయి. అయినా ఎప్పుడూ కాన్ఫిడెంట్​గానే ఉన్నా. మంచి స్క్రిప్ట్​ కోసం ఎదురుచూశానంతే’ అన్నారు.  

టచ్ మీ నాట్​ గురించి..

ఈ సిరీస్​లో నవదీప్​, దీక్షిత్​ లీడ్ రోల్స్​ చేశారు. ​ఇది 2019లో వచ్చిన ‘హి ఈజ్ సైకోమెట్రిక్​’ అనే కొరియన్ డ్రామా నుంచి తీసుకున్నారు. ఇందులో మరోసారి దీక్షిత్​ టీనేజీ కుర్రాడిలా కనిపించాడు. ఇది క్రైమ్​ థ్రిల్లర్​ జానర్​లో వచ్చిన సిరీస్​ కావడంతో ఆ కేటగిరీ ఆడియెన్స్​కి నచ్చుతుంది.  

అనుకోకుండా తెలుగులో.. 

‘ది రోజ్ విల్లా’ అనే సినిమా కన్నడలో చేయాల్సింది. కానీ ఆ ప్రొడ్యూసర్​ కొంచెం వెనక్కి తగ్గడంతో తెలుగులో ఒక ప్రొడ్యూసర్​ ముందుకొచ్చారు. దాంతో ఆ సినిమా తెలుగులో వచ్చింది. అనుకోకుండా అది తెలుగులో దీక్షిత్​కి మొదటి సినిమా అయింది. అయితే అప్పటికే ‘దియా’ డబ్బింగ్​లో చూశారు. ‘ముగ్గురు మొనగాళ్లు’ అనే కామెడీ సినిమాలో నటించాడు. అదే ఏడాది ‘ది రోజ్​ విల్లా’ కూడా వచ్చింది. ఆ తర్వాత తెలుగులో ‘మీట్ క్యూట్​’ సిరీస్​లో నటించాడు. నాని నటించిన దసరాలో సూరి అనే పాత్రలో నటించాడు. రష్మిక లీడ్​రోల్​లో నటిస్తోన్న ‘ది గర్ల్​ఫ్రెండ్’ సినిమాలో బాయ్​ఫ్రెండ్​ పాత్రలో కనిపించబోతున్నాడు దీక్షిత్​.

దసరాలో చాన్స్​ అలా..

హీరో నాని వాళ్ల అక్క దీప్తి నిర్మాతగా ‘మీట్​ క్యూట్’​ అనే వెబ్​ సిరీస్​ తీసింది. అదొక ఆంథాలజీ జానర్​ సిరీస్​. అందులో ఒక సెగ్మెంట్​లో దీక్షిత్​ లీడ్​ రోల్ చేశాడు. ఆ సిరీస్​ తెలుగులో రిలీజ్​ అయి మంచి టాక్ తెచ్చుకుంది. దాంతో అది తర్వాత ఇతర భాషల్లోకి డబ్ అయింది. అయితే ‘మీట్​ క్యూట్​ షూటింగ్’​ అయిపోయాక ఐదు నెలలు ఒక్క సినిమా ఆఫర్ కూడా దీక్షిత్​కి రాలేదు. ఆ టైంలో థియేటర్​లో నాటకాలు వేయడం వంటివి చేశాడు. ఆ తర్వాత ‘దసరా’లో ఆఫర్ వచ్చింది. అదెలా వచ్చిందంటే.. ‘మీట్ క్యూట్​’ సిరీస్​లో అసిస్టెంట్ డైరెక్టర్​గా చేసిన వినయ్ ‘దసరా’కు కూడా పనిచేశాడు. అతని రిఫరెన్స్​తో ‘దసరా’లో జాయిన్ అయ్యాడు. 

►ALSO READ | స్టార్టప్​: మనసున్న మష్రూమ్​ లేడీ!

మొదట్లో ఈ పాత్రకు మలయాళం యాక్టర్ రోషన్​ మ్యాథ్యూని అనుకున్నారట. అయితే అతనికి షెడ్యూల్స్ కుదరకపోవడంతో ఆ అవకాశం దీక్షిత్​కి వచ్చింది. అప్పటికే నాని మీట్​ క్యూట్​లో దీక్షిత్ పర్ఫార్మెన్స్ చూసినప్పటికీ, దసరాలో తన లుక్​ సరిపోతుందా? లేదా? అనుకున్నారట. దాంతో ‘కేటీఎమ్’ సినిమాకు సంబంధించిన కొన్ని ఫొటోలు దసరా టీంకి పంపాడట దీక్షిత్​. అవి చూసి లుక్ సరిపోతుందని నమ్మి, ఆ పాత్ర ఇచ్చారని, ‘దసరా’ సినిమా ఎక్స్​పీరియెన్స్​ గురించి అడిగిన ప్రతిసారీ ‘యాక్టింగ్ విషయంలో నాని దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నా’ అని, అలాగే ఆ సినిమాలో డైలాగ్స్​ కోసం తాను చాలా ఇష్టంతో కష్టపడి నేర్చుకున్నట్లు చెప్పాడు. ఈ సినిమాకు గానూ బెస్ట్​ సపోర్టింగ్ యాక్టర్ తెలుగు కేటగిరీలో12వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్​ సొంతం చేసుకున్నాడు.

‘దియా’ అనే సినిమాతో వెండితెరకు పరిచయమై.. మీట్​ క్యూట్​’తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరై..  దసరా’తో తనదైన మార్క్​ చూపించాడు ఈ కన్నడ యాక్టర్.. దీక్షిత్ శెట్టి.