కచేరిలో పెను విషాదం.. భవనం పై కప్పు కూలి 66 మంది మృతి

కచేరిలో పెను విషాదం.. భవనం పై కప్పు కూలి 66 మంది మృతి

డొమినికన్ రిపబ్లిక్‌లో ఘోర ప్రమాదం జరిగింది. శాంటో డొమింగో నగరంలోని ప్రఖ్యాత జెట్ సెట్ నైట్‌క్లబ్‎లో మెరెంగ్యూ (సంగీత కచేరి) లైవ్ ఈవెంట్‎ జరుగుతుండగా నైట్ క్లబ్ పై కప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో ఈవెంట్‎కు హాజరైన 66 మంది మరణించగా.. మరో 160 మందికి పైగా గాయపడ్డారు. మరణించిన వారిలో ప్రముఖులు ఉన్నట్లు తెలుస్తోంది. 

నైట్‌క్లబ్‎ ఈవెంట్‎ దుర్ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న వెంటనే ఎమర్జెన్సీ రెస్య్కూ బృందాలు, ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రెస్క్యూ చేస్తున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలంలో ఇంకా సహయక చర్యలు కొనసాగుతున్నాయి. నైట్ క్లబ్ పై కప్పు కూలిపోవడానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

జెట్ సెట్ నైట్‌క్లబ్ దుర్ఘటనపై ఆ దేశ అత్యవసర కార్యకలాపాల కేంద్రం డైరెక్టర్ జువాన్ మాన్యుయెల్ మెండెజ్ మాట్లాడుతూ.. ఘటన స్థలంలో సహయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిలో ఇంకా చాలా మంది బతికే ఉన్నారు. ప్రతి వ్యక్తిని బయటకు తీసే వరకు రెస్య్కూ ఆపరేషన్ కొనసాగిస్తాం’’ అని పేర్కొన్నారు. 

డొమినికన్ రిపబ్లిక్‌‎లోని జెట్ సెట్ నైట్‌క్లబ్ కల్చరల్ ఈవెంట్స్‎కు ఫేమస్. క్రమం తప్పకుండా ఇక్కడ ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమం జరుగుతుంటుంది. ఇందులో భాగంగానే మంగళవారం (ఏప్రిల్ 8) రాత్రి కూడా సంగీత కచేరి జరిగింది. ఈ ఈవెంట్ కు దాదాపు 600 మంది హాజరైనట్లు సమాచారం. పలువురు క్రీడా, సినీ, రాజకీయ ప్రముఖులు సంగీత కచేరీకి అటెండ్ అయ్యారు. 

సంగీత కచేరి ఉత్సాహంగా జరుగుతోన్న క్రమంలో ఒక్కసారిగా జెట్ సెట్ నైట్‌క్లబ్ పై కప్పు కూలింది. దీంతో చాలా మంది చనిపోగా.. పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు.  మాంటెక్రిస్టి ప్రావిన్స్ గవర్నర్, మేజర్ లీగ్ బేస్ బాల్ స్టార్ నెల్సన్ క్రజ్ సోదరి నెల్సీ క్రూజ్,  మేజర్ లీగ్ బేస్ బాల్ పిచర్ ఆక్టావియో డోటెల్,  మాజీ బేస్ బాల్ స్టార్ టోనీ ఎన్రిక్ బ్లాంకో కాబ్రెరా వంటి ప్రముఖులు ఈ విషాద  ఘటనలో కన్నుమూసినట్లు అధికారులు వెల్లడించారు.

 ఈవెంట్ ఆర్గనైజర్ మెరెంగ్యూ గాయకుడు రూబీ పెరెజ్ తప్పిపోయాడని.. అతడి కోసం రెస్క్యూ బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు. 
నైట్ క్లబ్‎లో ప్రమాదం జరగడానికి నిమిషాల ముందు తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది. ఈ వీడియోలో.. సంగీత కచేరికి వచ్చిన ప్రేక్షకులు ఎంతో ఉత్సాహంగా కనిపించారు. కానీ నిమిషాల వ్యవధిలోనే ఈ విషాదం చోటు చేసుంది.  

జెట్ సెట్ నైట్‌క్లబ్ దుర్ఘటనలో మరణించిన వారి మృతిపట్ల అధ్యక్షుడు లూయిస్ అబినాదర్ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఘటన స్థలంలో యుద్ధ ప్రాతిపదిక సహయక చర్యలు కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహయం అందించాలని వైద్యులకు సూచించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.