హైదరాబాద్ వీకెండ్ సంతలో.. మోమోస్ తిని మహిళ మృతి

హైదరాబాద్ వీకెండ్ సంతలో.. మోమోస్ తిని మహిళ మృతి

హైదరాబాద్: హైదరాబాద్ బస్తీల్లో సంతలు కామన్ అయిపోయాయి.. వారంలో ఒక రోజు.. ఆయా కాలనీల్లో సంతలు ఏర్పాటు చేస్తున్నారు. అమ్మకాలు కూడా జోరుగా సాగుతున్నాయి. ధరలు కూడా తక్కువగా ఉంటున్నాయనే ఉద్దేశంతో.. జనం కూడా బాగానే కొనుగోలు చేస్తున్నారు. మొన్నటి వరకు ఈ సంతల్లో కేవలం కూరగాయలు మాత్రమే ఉండేవి.. ఇప్పుడు లేటెస్ట్గా తిను బండారాలు వచ్చాయి. హైదరాబాద్ సిటీలోని బంజారాహిల్స్ నందినగర్.. సింగాడికుంటలో వీకెండ్ ఏర్పాటు చేసిన సంత విషాదంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

బంజారాహిల్స్లోని నందినగర్లో విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. మోమోస్ తిని మహిళ మృతి చెందిన ఘటన కలకలం రేపింది. వారం వారం జరిగే సంతలో ఏర్పాటు చేసిన మోమోస్ కౌంటర్ వద్ద మోమోస్ తిని ఒక మహిళ తీవ్ర అస్వస్థతకు లోనై చికిత్స పొందుతూ చనిపోయింది. మృతి చెందిన మహిళను సింగాడికుంటకు చెందిన 29 ఏళ్ల మహిళ రేష్మగా గుర్తించారు. ఈమెకు ముగ్గురు సంతనం.

Also Read:తెలంగాణలో చంపి..కర్నాటకలో శవాన్ని తగలబెట్టిన భార్య

మోమోస్ తిని ఫుడ్ పాయిజన్ కావడంతో బంజారాహిల్స్ నంది నగర్లో 20 మందికి పైగా అస్వస్థతకు లోనవడం స్థానికంగా కలకలం రేపింది. వివిధ ఆసుపత్రుల్లో బాధితులు చికిత్సలు పొందుతున్నారు. బాధితులు మరింత మంది పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఉదంతంపై బంజారాహిల్స్ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు.

అసలు శుక్రవారం(అక్టోబర్ 25, 2024)  సంతలో ఏం జరిగిందంటే..
బాధితుల కథనం ప్రకారం.. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నంది నగర్, సింగాడి బస్తి, గౌరీ శంకర్ కాలనీలో శుక్రవారం జరిగిన సంతల్లో మోమోస్ విక్రయించారు. సింగాడ కుంట బస్తీకి చెందిన రేష్మ బేగంతో(31) పాటు ఆమె పిల్లలు మోమోస్ తిన్నారు. వీరితో పాటు ఆయా బస్తీల్లోని దాదాపు 50 మందికి పైగా వీటిని తిన్నారు. వీరందరికీ శనివారం నుంచి వాంతులు, విరేచనాలు ప్రారంభం అయ్యాయి. ఈ క్రమంలోనే వీరంతా బంజారా హిల్స్ చుట్టూ పక్కల ప్రాంతాల్లో ఉన్న పలు ఆసుపత్రులలో చేరారు. వీరిలో కొందరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. దాదాపు పది మందికి పైగా మైనర్లు ఉన్నారు.

సింగారకుంట బస్తికి చెందిన రేష్మ బేగం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లే క్రమంలో ఆరోగ్య పరిస్థితి విషమించి మృతి చెందింది. పవన్ కుమార్, అతని తల్లి ఇద్దరూ ఆస్పత్రిలో ఉన్నారు. ఈ ఘటనపై ఇప్పటికే బాధితులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు దీంతో మోమోస్ విక్రయించిన ఇద్దరినీ బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మోమోస్ తో పాటు వాటిలోకి ఇచ్చే మయోనీజ్, మిర్చి చట్నీల కారణంగా ఈ సమస్య ఏర్పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.