- ఇప్పచెట్టుకు ఆదివాసీలకు విడదీయలేని బంధం
- కానీ భద్రాచలం ఏజెన్సీలో తగ్గిపోతున్న ఇప్ప పువ్వు సేకరణ
భద్రాచలం, వెలుగు : ఇప్పచెట్టుకు, ఆదివాసీ బిడ్డలకు విడదీయలేని బంధం ఉంది. ఇప్ప కాయలు, ఇప్ప పువ్వులు ఆదివాసీలకు ఆదాయవనరు. కానీ రోజురోజుకు భద్రాచలం ఏజెన్సీలో ఇప్ప పువ్వు సేకరణ తగ్గిపోతోంది. అడవుల నరికివేత, పోడు వ్యవసాయం తదితర కారణాలతో ఈ చెట్టు కన్పించడం లేదు. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి భద్రాచలం ఐటీడీఏ పీవో ప్రతీక్‌జైన్ ఇప్ప మొక్కల పెంపకానికి శ్రీకారం చుట్టారు. ‘ఇంటికో ఇప్ప మొక్క’ పేరుతో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు.
పొలంగట్లపై.. ఇంటి ఆవరణలో..
అటవీశాఖ ద్వారా ఇప్ప మొక్కలను నర్సరీల ద్వారా సేకరించి ప్రతి ఇంటికీ పంపిణీ చేయనున్నారు. పొలం గట్లు, ఇండ్ల ఆవరణలో వీటిని పెంచనున్నారు. స్వయంగా ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్ భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలో ఇప్ప మొక్కలు నాటారు. వాటి సంరక్షణకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించారు. పూర్వం గిరిజన ప్రాంతాల్లో ప్రతీ వ్యవసాయ భూమిలో గట్లపై ఇప్ప చెట్లు ఉండేవి.
వీటి నుంచే ఇప్ప నూనె, ఇప్పసారా తయారు చేసుకుంటారు. భద్రాద్రి రాముడి ప్రత్యేక ప్రసాదంగా కూడా ఆలయ పరిసరాల్లో అమ్ముతుంటారు. రక్తహీనత నుంచి రక్షించే ప్రత్యేక ఔషధం ఇప్ప పువ్వు. గోధుమ పిండితో కలిపి ఇప్ప లడ్డూలను తయారు చేసి ఆదిలాబాద్ ఏజెన్సీలో గిరిజనులకు పంపిణీ చేస్తున్నారు. ఈ తరుణంలో ఇప్ప ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇప్ప చెట్ల పెంపకానికి ఐటీడీఏ నడుంబిగించింది.
అవగాహన కల్పిస్తాం
ఐటీడీఏ ఉద్యమంలో అందరం చేయి చేయి కలిపి ముందుకు సాగుదాం. ఊరూరా ఇప్ప మొక్కల పెంపకంపై అవగాహన పెంచి ఈ కార్యక్రమానికి బాసటగా నిలుస్తాం. ప్రజాసంఘాలు కూడా తోడుగా నిలబడాలి. గిరిజనుల జీవనంతో ముడిపడి ఉన్న చెట్లు అంతరించిపోకుండా కాపాడుకోవాల్సిన సామాజిక బాధ్యత
అందరిపై ఉంది. - గోళ్ల భూపతిరావు, పర్యావరణ ప్రేమికుడు
2,500 మొక్కలు సేకరించాం
ఇప్ప చెట్టు ప్రయోజనాలు అనేకం. ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాల్లో భాగమైన ఇప్ప మొక్కలను పెంచేందుకు పూనుకున్నాం. అటవీశాఖ నుంచి 2,500 వరకు మొక్కలు సేకరించాం. నర్సరీల్లో ఇంకా ఎక్కువగా పెంచి వచ్చే వర్షాకాలం నుంచి ఉద్యమంగా ఇప్ప మొక్కల పెంపకం చేపడతాం. వ్యవసాయంతో పాటు సీజనల్‌గా వచ్చే ఈ పంట ద్వారా ఆదివాసీల ఆర్థిక పరిస్థితులను మెరుగుపర్చడమే మా లక్ష్యం. - ప్రతీక్ జైన్, ఐటీడీఏ పీవో