భారీ నష్టాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్ సోమవారం కుప్పకూలింది. సెన్సెక్స్‌ 2,200 పాయింట్లు, నిఫ్టీ 660 పాయింట్లకుపైగా నష్టపోయింది. అమెరికా, జపాన్‌, అమెరికా, తైవాన్‌ దేశాల్లో ఆర్థిక మాంద్యం భయంతో ఇండియన్ స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలాయని ఆర్థికవేత్తలు చెప్తున్నారు.  భారత్‌తో పాటు ప్రపంచ దేశాల్లోని మార్కెట్లు కూడా భారీగా పతనమయ్యాయి. మార్కెట్ల పతనంతో ఇవాళ ఒక్కరోజే దాదాపు 17లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సొమ్ము ఆవిరైంది. ఉదయం సెన్సెక్స్‌ 78,588.19 పాయింట్ల భారీ నష్టంతో మొదలైంది. ఆ తర్వాత ఎక్కడా కోలుకోలేదు. ఇంట్రాడేలో 79,780.61 పాయింట్ల గరిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్‌.. 78,295.86 పాయింట్ల కనిష్ఠానికి చేరుకున్నది. చివరకు 2,222.55 పాయింట్ల నష్టంతో 78,759.40 వద్ద ముగిసింది. 

ఇటీవలే 82వేల పాయింట్ల మార్క్‌ను దాటిన సెన్సెక్స్‌ మళ్లీ ఇవాళ 78వేల పాయింట్లకు పడిపోయింది. నిఫ్టీ సైతం 662.10 పాయింట్లు పతనమై.. 24,055.60 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో దాదాపు 471 షేర్లు లాభాల్లో కొనసాగగా.. 3,082 షేర్లు పతనమయ్యాయి. నిఫ్టీ అత్యధికంగా నష్టపోయిన వాటిలో టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్, ఓఎన్‌జీసీ, హిందాల్కో, టాటా స్టీల్ ఉన్నాయి. ఇక హెచ్‌యూఎల్‌, నెస్లే, టాటా కన్స్యూమర్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ లాభపడ్డాయి. ఆటో, మెటల్, క్యాపిటల్ గూడ్స్, ఆయిల్ అండ్‌ గ్యాస్, పవర్, మీడియా, రియల్టీ 4శాతం చొప్పున క్షీణించాయి. అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 3.6 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 4.2 శాతం పతనమయ్యాయి.