హైదరాబాద్ లో క్యాడ్బరీ డైరీ మిల్క్ చాక్లెట్ లో ఫంగస్ వచ్చిన ఘటనపై ఆ కంపెనీ ఇండియా ప్రతినిధి స్పందించారు. క్యాడ్బరీ చాక్లెట్లను ఎల్లప్పుడు కూల్ గా ఉండే చోట పెట్టాలని సూచించారు. చాక్లెట్ ఉత్పత్తులను నిల్వ చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ప్రతి క్యాడ్‌బరీ ఉత్పత్తులను స్టోర్ చేసేటప్పుడు రూల్స్ ఫాలో కావాలి.. క్యాడ్బరీ చాక్లెట్లను చల్లని, పరిశుభ్రమైన , పొడి ప్రదేశంలో స్టోర్ చేయాలి. తమ కంపెనీ ఉత్పత్తులకు అంతర్జాతీయంగా ఆమోదించబడిన HACCP (హాజర్డ్ అనాలిసిస్ & క్రిటికల్ కంట్రోల్ పాయింట్స్) నియమాలను ఫాలో అవుతున్నాం. ఇది అత్యంత సమగ్రమైన ఆహార భద్రతా సిస్టమ్ అని వెల్లడించారు.
చాక్లెట్ లో ఫంగస్ వచ్చిందని చెబుతున్న వినియోగదారుడు ఘటనపై పూర్తి వివరాలివ్వాలని కోరారు కంపెనీ ప్రతినిధి. క్యాడ్బరీ చాక్లెట్ ప్యాక్ వెనుక పేర్కొన్న తమ కంపెనీ ఇమెయిల్ ID లేదా టోల్ ఫ్రీ నంబర్ ద్వారా వారు పూర్తి వివరాలివ్వాలని వినియోగదారుడిని కోరారు.
ఏప్రిల్ 27న హైదరాబాదీ పిల్లా’ అనే పేరుతో ఎక్స్ ఖాతా కలిగివున్న ఓ నెటిజన్ అమీర్ పేట మెట్రో స్టేషన్ లో డైరీ మిల్క్ చాక్లెట్‌ను కోనుగోలు చేశారు. తీరా తిందామని కవర్ తెరిచి చూస్తే అందులో ఫంగస్ కనిపించింది. దీంతో ఒక్కసారిగా షాక్ అయిన యువతి.. వెంటనే దానిని నెట్టింట పోస్ట్ చేసింది. ‘డైరీ మిల్క్ చాక్లెట్ తయారీ తేదీ జనవరి 2024 ఉంది. 12 నెలల వరకు దాని ఎక్స్‌పైరీ డేట్ ఉంది. కానీ చాక్లెట్ తెరిచి చూస్తే ఇలా ఉంది. దీనిని చూడండి’ అంటూ చాక్లెట్ ఫొటోలను షేర్ చేసింది. ఈ ట్వీట్ వైరల్ కాగా.. తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులకు పలువురు ఫిర్యాదు చేశారు.