హుజూరాబాద్ ఉపఎన్నిక రోజురోజుకు రసవత్తరంగా మారుతోంది. మరో రెండు రోజుల్లో ఎన్నిక ఉండనుండటంతో.. ఓటర్ల కొనుగోలుకు పార్టీలు తెరలేపాయి. అయితే తమకు డబ్బులు రాలేదని కొంతమంది రోడ్లెక్కుతున్నారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం గంగారంలో డబ్బుల కోసం స్థానికులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. డబ్బుల కోసం గొడవలు చేస్తే కేసులు పెడ్తామని పోలీసులు బెదిరిస్తున్నారని మహిళలు అన్నారు. మమ్మల్ని బెదిరించడం కాదు.. డబ్బులు పంపిణీ చేసే వాళ్లను ఎందుకు అడ్డుకోవడం లేదని పోలీసుల్ని ప్రశ్నించారు. అసలు డబ్బులు ఎవరు పంచమన్నారని మహిళలు నిలదీశారు. దాంతో మహిళలు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. డబ్బులు ఇస్తే అందరికీ ఇవ్వాలని, కొందరికి ఇచ్చి మరికొందరికి ఇవ్వకపోతే సర్పంచ్ ఇంటిని ముట్టడిస్తామన్నారు. మహిళల ధర్నాతో కొద్దిసేపు ట్రాఫీక్ జాం అయ్యింది.
డబ్బులు తమకు అందలేదని హుజురాబాద్ మండలం కాట్రపల్లి, రాంపూర్‌లోని గ్రామ సర్పంచ్ల ఇళ్ల ముందు గ్రామస్ధులు ధర్నా చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో పోలీసులు గ్రామస్థులకు నచ్చజేప్పే ప్రయత్నం చేశారు. పెద్దపాపయ్య పల్లిలో కొంతమందికే డబ్బులు ఇచ్చి.. మిగతా వారికి ఇవ్వడం లేదని స్థానికులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. గ్రామంలోని 8వందల కుటుంబాలకి డబ్బులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు. గ్రామ సర్పంచ్ వచ్చి సమాధానం చెప్పేదాక ఆందోళన విరమించేలేదని మహిళలు హెచ్చరించారు. హనుమకొండ జిల్లా కమలాపూర్‌లోనూ స్థానిక మహిళలు ఆందోళనకి దిగారు. కొంతమందికే డబ్బులు ఇచ్చి.. మిగతా వారికి ఇవ్వడం లేదంటూ తహసీల్దార్ ఆఫీసు ముందు నిరసన చేపట్టారు. అందరికి డబ్బులిచ్చే వరకు ఆందోళన విరమించమని భీష్మించుకొని కూర్చున్నారు.
For More News..