చనిపోయిన వ్యక్తి ఖాతా నుంచి డబ్బులు డ్రా

  •    చనిపోయిన వ్యక్తి ఖాతా నుంచి డబ్బులు డ్రా
  •     ఫోర్జరీ సంతకం చేసి నగదు స్వాహా చేసిన ఐఓబీ సిబ్బంది
  •     స్టాఫ్​ తీరుపై రైతులతో కలిసి మృతుడి కొడుకు నిరసన


లింగంపేట, వెలుగు : చనిపోయిన వ్యక్తి ఖాతా నుంచి ఇండియన్   ఓవర్సీస్  బ్యాంక్  సిబ్బంది డబ్బులు డ్రా చేశారు. మృతుడి సంతకం ఫోర్జరీ చేసి రూ.4900 విత్ డ్రా చేసుకున్నారు. దీంతో మేనేజర్, సిబ్బంది తీరుపై మృతుడి కొడుకు నిరసన తెలుపుతూ బ్యాంకు ఎదుట బైఠాయించాడు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలో గురువారం ఈ ఘటన జరిగింది. బాధితుడు సాయిబాబా తెలిపిన వివరాల ప్రకారం.. లింగంపేట మండల కేంద్రంలోని ఇండియన్​ ఓవర్సీస్ బ్యాంక్​లో  పొల్కంపేట గ్రామానికి చెందిన తలారి కిష్టయ్య అనే రైతుకు అకౌంట్  ఉంది. బ్యాంకులో ఆయన రూ.36 వేల  క్రాప్​లోన్​ తీసుకున్నాడు. 2023 మార్చి 3న కిష్టయ్య తన అప్పును వన్​టైం సెటిల్​మెంట్​ (ఓటీఎస్) లో చెల్లించాడు. 

సదరు బ్యాంక్  మేనేజర్​ ఆర్యరాజ్.. కిష్టయ్యకు బ్యాంకులో ఎలాంటి అప్పులేదని ఎన్ఓసీ కూడా జారీ చేశాడు. ​ఆగస్టు 10న కిష్టయ్య అనారోగ్యంతో చనిపోయాడు.  అప్పటికీ ఆయన ఖాతాలో రూ.39091 నగదు నిల్వ ఉంది. కాగా, అక్టోబర్​ 12న రూ.26,970ను బ్యాంకు​ఆఫీసర్లు లోన్​ పేరిట డ్రా చేసుకున్నారు. అనంతరం కిసాన్​ బీమా పథకం కింద రూ.2 వేలు, నెఫ్ట్  ద్వారా రూ.2,875 ఆయన ఖాతాలో జమయ్యాయి. ఈనెల 26న రూ.4900ను మరోసారి  బ్యాంకు​సిబ్బంది ఫోర్జరీ సంతకంతో కిష్టయ్య డబ్బును డ్రా చేసుకున్నారు. తన తండ్రి ఖాతా నుంచి డబ్బులు డ్రా అయినట్లు  మెసేజ్​ రావడంతో హైదరాబాద్​లో ఉంటున్న కిష్టయ్య కొడుకు సాయిబాబా స్థానిక బ్యాంకుకు చేరుకుని స్టేట్ మెంట్​ తీసుకున్నాడు. 

తన తండ్రి మార్చిలో క్రాప్​లోన్​ డబ్బులు చెల్లించి నోడ్యూ సర్టిఫికెట్​ తీసుకున్నారని, అయినా లోన్​ పేరిట అక్టోబర్​లో రూ.26,970 ఎందుకు డ్రా చేసుకున్నారని మేనేజర్, సిబ్బందిని ఆయన నిలదీశారు. దీంతో అక్కడున్న రైతులు కూడా ఆయనకు మద్దతు తెలిపారు. బ్యాంకు​ ఎదుట రెండుగంటల పాటు ఆందోళన చేశారు. సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై​ప్రభాకర్  అక్కడికి చేరుకుని​రైతులతో మాట్లాడారు. బ్యాంక్​ మేనేజర్​ తీరుపై సాయిబాబా ఫిర్యాదు చేశారు. రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి మేనేజర్​పై చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనంతరం మేనేజర్​పై సాయిబాబా ఫిర్యాదు చేశాడు. 

రూల్స్  ప్రకారమే నడుచుకున్నం: మేనేజర్

చనిపోయిన వ్యక్తి ఖాతా నుంచి డబ్బులను  డ్రా చేయడం, రైతుల రుణమాఫీ సొమ్మును రైతులు ఇవ్వకపోవడంపై మేనేజర్​ ఆర్యరాజ్​ను వివరణ కోరగా బ్యాంక్​ నిబంధనల ప్రకారమే తాము వ్యవహరిస్తున్నామని చెప్పారు. చనిపోయిన వ్యక్తి ఖాతా నుంచి ఫోర్జరీ సంతకం ద్వారా డబ్బులను డ్రా చేయడంపై ప్రశ్నించగా సమాధానం దాటవేశారు.