నా డబ్బునే పట్టిస్తావా..ఓనర్ బెదిరింపు.. యువకుడు సూసైడ్

నా డబ్బునే పట్టిస్తావా..ఓనర్ బెదిరింపు.. యువకుడు సూసైడ్
  •     రూ.25లక్షలు పట్టుకుని రూ.6.50లక్షలు నొక్కేసిన ఇద్దరు పోలీసులు
  •     విచారించిన ఉన్నతాధికారులు
  •     నిజమని తేలడంతో సస్పెండ్ చేసిన రాచకొండ సీపీ
  •     పోలీసులకు సమాచారం ఇచ్చిన రంజిత్
  •     ఓనర్ వార్నింగ్​తో ఉరేసుకుని ఆత్మహత్య

మేడిపల్లి, వెలుగు: పోలీసుల తనిఖీల్లో దొరికిన డబ్బు వ్యవహారం.. ఓ యువకుడి ఆత్మహత్యకు దారితీసింది. పట్టుబడిన డబ్బులోంచి కొంత దాచిపెట్టిన కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్​ను రాచకొండ సీపీ తరుణ్ జోషి సస్పెండ్ చేశారు. యువకుడి సూసైడ్​తో పాటు ఆ డబ్బు ఎవరిదనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్నది. ఈ నెల 11న సాయంత్రం 4 గంటల టైమ్​లో మేడ్చల్ – మల్కాజ్​గిరి జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని కరీంగూడ చౌరస్తాలో కానిస్టేబుల్ శ్రీకాంత్, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ కృష్ణ ముందస్తు ప్లాన్​లో భాగంగా వెహికల్స్ చెక్ చేస్తున్నారు. 

అప్పుడే సాయికుమార్, కార్తీక్ బైక్​పై ఓ బ్యాగ్​తో వస్తున్నారు. వారిని ఆపి తనిఖీ చేయగా.. బ్యాగ్​లో రూ.25లక్షల నగదు గుర్తించారు. డబ్బుతో పాటు సాయికుమార్, కార్తీక్​ను అదుపులోకి తీసుకున్నారు. రెండు గంటల తర్వాత రూ.25 లక్షల నుంచి శ్రీకాంత్, కృష్ణ కలిసి రూ.6.50 లక్షలు దాచిపెట్టారు. చెకింగ్​లో రూ.18.50 లక్షలే దొరికినట్టు సాయికుమార్, కార్తీక్​ను తీసుకెళ్లి కీసర ఇన్​స్పెక్టర్ వెంకటయ్యకు అప్పగించారు. 

బ్యాగులో రూ.25 లక్షలు ఉండాలని, అందులోని రూ.6.50 లక్షలను శ్రీకాంత్, కృష్ణ దాచిపెట్టారని సాయికుమార్, కార్తీక్​ సీఐకు చెప్పారు. ఈ విషయాన్ని సీఐ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.  విచారించిన ఆఫీసర్లు.. కానిస్టేబుల్ శ్రీకాంత్, హెడ్ కానిస్టేబుల్ కృష్ణ కలిసి రూ.6.50లక్షలు దాచిపెట్టింది నిజమేనని తేల్చారు. దీంతో రాచకొండ సీపీ తరుణ్ జోషి ఇద్దరిని సస్పెండ్ చేశారు. 

డబ్బు ఎవరిదనే దానిపై పోలీసుల దర్యాప్తు

డబ్బు తరలింపు న్యూస్ ఎలా లీక్ అయ్యిందని సాయికుమార్​, కార్తీక్​ ఆరా తీశారు. తమతో కలిసి పని చేసే రంజిత్ (24)పై వారికి అనుమానం వచ్చింది. ఈ ముగ్గురు ఒకే దగ్గర పని చేస్తున్నారు.సాయికుమార్, కార్తీక్​ రూ.25 లక్షలు తీసుకొస్తున్నారని, వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తే డబ్బులు వదిలేసి పారిపోతారని కానిస్టేబుల్ శ్రీకాంత్, హెడ్ కానిస్టేబుల్ కృష్ణకు చెంగిచర్లలో నివాసం ఉండే రంజిత్ చెప్పాడు. వచ్చిన దాంట్లో తనకూ వాటా ఇవ్వాలని రంజిత్ కోరినట్టు దర్యాప్తులో తేలింది. ఈ విషయం తెలుసుకున్న సాయికుమార్, కార్తీక్.. తమ ఓనర్​కు చెప్పారు. 

డబ్బుల గురించి రంజితే పోలీసులకు సమాచారం ఇచ్చాడని వివరించారు. మా డబ్బునే పట్టిస్తావా అంటూ రంజిత్​ను ఓనర్ బెదిరించాడు. భయపడిపోయిన రంజిత్ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదంతా తెలియని రంజిత్ తల్లి.. తన కొడుకుకు ఉద్యోగం దొరక్కపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులకు చెప్పింది. దీంతో మేడిపల్లి పోలీసులు సూసైడ్​గా కేసు రిజిస్టర్ చేసుకున్నారు. కానీ.. రంజిత్ సూసైడ్​కు అసలు కారణం డబ్బు తరలింపు వ్యవహారమని పోలీసుల దర్యాప్తులో తేలింది. రంజిత్ ఆత్మహత్య కేసులో శ్రీకాంత్, కృష్ణతో పాటు బెదిరించిన ఓనర్​ను అరెస్ట్ చేయాల్సి ఉందని పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ఆ డబ్బు ఎవరిదనే విషయం ఇంకా తేలలేదని సమాచారం.