ములుగు, వెలుగు : అకౌంట్ హోల్డర్ ప్రమేయం లేకుండానే అకౌంట్ నుంచి డబ్బులు డెబిట్ అయ్యాయి. ములుగుకు చెందిన యాసం రాజ్‌కుమార్ వ్యక్తిగత పనిమీద మంగళవారం హైదరాబాద్‌కు వెళ్లాడు. పనులు ముగించుకొని కారులో తిరిగి వస్తుండగా రాత్రి 8 గంటల టైంలో ములుగుకు వస్తున్నాడు. ఇదే టైంలో తన ఎస్‌బీఐ అకౌంట్‌కు సంబంధించి ఆధార్ బేస్డ్ ట్రాన్జాక్షన్ నుంచి బ్యాలెన్స్ ఎంక్వైరీ సక్సెల్ ఫుల్ అని ఒకటి, రూ. 10 వేలు విత్ డ్రా అయినట్లు మరో మెసేజ్ వచ్చింది.
దీంతో ఆందోళనకు గురైన రాజ్‌కుమార్ వెంటనే నెట్ బ్యాంకింగ్ ద్వారా అకౌంట్ చెక్ చేయగా డబ్బులు డ్రా అయినట్లు కనిపించింది. వెంటనే ఎస్‌బీఐ కస్టమర్ కేర్ సెంటర్‌కు ఫోన్ చేసి ఏటీఎం, నెట్ బ్యాంకింగ్, యూపీఐని బ్లాక్ చేశాడు. బుధవారం ఉదయం బ్యాంక్ వెళ్లి ఫిర్యాదు చేయడంతో సైబర్ క్రైం టోల్ ఫ్రీ నంబర్ 1930కు కాల్ చేయాలని సూచించారు. దీంతో వెంటనే ఆ నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయడంతో పాటు, ములుగులోని సైబర్ క్రైం పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు. ఇలాంటి కేసు నమోదు కావడం ములుగు ఏరియాలో ఇదే మొదటిసారి అని ఆఫీసర్లు తెలిపారు.