
- అమెరికాలోని 15 మంది మహిళల అకౌంట్ల నుంచి ఇండియాకు డబ్బు
- ముగ్గురిని అరెస్ట్ చేసిన టీజీ న్యాబ్
- అదుపులో ఎనిమిది మంది
హైదరాబాద్, వెలుగు: డ్రగ్స్ దందాలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. పోలీసులకు పట్టుబడిన నైజీరియన్ మహిళా పెడ్లర్‌ను విచారించగా ఇంటర్నేషనల్ మనీలాండరింగ్ గుట్టు రట్టయింది. అమెరికా నుంచి మన దేశానికి.. ఇక్కడి నుంచి నైజీరియాకు జరుపుతున్న హవాలా రాకెట్ బయటపడింది. ఈ గ్యాంగ్‌లో ముగ్గురిని టీజీ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో(టీన్యాబ్) అరెస్ట్ చేసింది. వీరి వద్ద 15 గ్రాముల కొకైన్, 50 గ్రాముల ఎండీఎంఏ, రూ.45 వేల నగదును సీజ్ చేసింది. డ్రగ్స్ హవాలా దందాలో ఐదేండ్లుగా దాదాపు రూ.127 కోట్లు చేతులు మారినట్లు టీ న్యాబ్ ప్రాథమికంగా అంచనా వేసింది.
రాష్ట్రంలో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ మనీలాండరింగ్ వివరాలను టీజీ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్యా శనివారం వెల్లడించారు. నైజీరియాకు చెందిన డివైన్ ఎబుకాసుజీ గతంలో హైదరాబాద్ టోలిచౌకీలో నివాసం ఉండేవాడు. హైదరాబాద్, బెంగళూరు సహా ఆన్‌లైన్‌లో అమెరికా కస్టమర్లకు కొకైన్, ఎండీఎంఏ సప్లయ్ చేసేవాడు. ఈ క్రమంలో ఇంటర్నేషనల్ డ్రగ్స్ నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకున్నాడు. గతంలో పలుమార్లు అరెస్ట్ అయ్యాడు.
తనపై పోలీసుల నిఘా పెరగ డంతో 2023లో నైజీరియాకు షిఫ్ట్ అయ్యాడు. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ ఉప్పరపల్లిలో నివాసం ఉండే నైజీరియన్ ఇకెచుక్వు అలియాస్ ఎమ్మా(39).. హైదరాబాద్‌లోనే ఉండే తన దేశానికి చెందిన బ్లెస్సింగ్ (39) అనే మహిళతో కలిసి కొకైన్ సప్లయ్ చేసేవాడు. ఈ ఇద్దరికి నైజీరియా నుంచి ఎబుకాసుజీ డైరెక్షన్స్ ఇచ్చేవాడు. అక్కడి నుంచే అంతా మానిటరింగ్ చేసేవాడు. నిరుడు జూలైలో 200 గ్రాముల కొకైన్‌తో బ్లెస్సింగ్ టీజీ న్యాబ్‌కు పట్టుబడింది.
ఆ తర్వాత అసలు గుట్టును విప్పేందుకు టీజీ న్యాబ్ సిబ్బందే కస్టమర్లుగా ఆర్డర్లు చేస్తూ డ్రగ్స్ సప్లయర్లు, కస్టమర్లు, డబ్బులు చేతులు మారుతున్న విధానాన్ని పరిశీలించారు. మూడు నెలల పాటు డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించారు. డెడ్ డ్రాప్ విధానంలో ఒక ప్రదేశంలో డ్రగ్స్‌ను వదిలి.. ఫొటో, లొకేషన్‌ను కస్టమర్‌కు పంపించడం.. ఆ తర్వాత ఆన్‌లైన్ పేమెంట్స్ జరుగుతున్నట్లు గుర్తించారు.
బ్లెస్సింగ్ ఇచ్చిన సమాచారంతో!
మహిళా పెడ్లర్ బ్లెస్సింగ్ (39) ఇచ్చిన సమాచారం మేరకు నైజీరియాకు చెందిన ఇకెచుక్వు అలియాస్ ఎమ్మా, చుక్వా ఓగ్బోనాతోపాటు హైదరాబాద్‌కు చెందిన మతిన్ సిద్దిఖీని ఈ నెల 3న టీజీ న్యాబ్ ఆఫీసర్లు అరెస్టు చేశారు. అదేవిధంగా.. ఫారెక్స్ ట్రేడింగ్‌లో సహకరించిన సయ్యద్ సోహిల్ అబ్దుల్ అజీజ్, నసీర్ అహ్మద్, మహ్మద్ అవైజ్, మహ్మద్ మతీన్, సయ్యద్ యూసుఫ్ హక్, ఆనంద్‌జైన్, శాంతిలాల్ సురేశ్‌కుమార్‌జైన్, ఉత్తమ్ జైన్‌ను అదుపులోకి తీసుకున్నట్లు టీజీ న్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్యా తెలిపారు. చదువుల కోసం నైజీరియా సహా పలు దేశాల నుంచి వచ్చే యువత డ్రగ్స్ దందాలో దిగి చెడిపోతున్నారని ఆయన అన్నారు.
2020 నుంచి ఇప్పటి వరకు 260 డ్రగ్ పెడ్లర్లను అరెస్టు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలోని 18,298 మంది విదేశీ విద్యార్థుల వివరాలు ఫారిన్ స్టూడెంట్స్ ఇన్‌ఫార్మేషన్ సిస్టమ్ (ఎఫ్‌ఎస్‌ఐఎస్)లో అదృశ్యం అయ్యాయని తెలిపారు. వీసా గడువు ముగిసినా ఇక్కడే ఉన్న 371 మంది ఫారిన్ స్టూడెంట్లను గుర్తించినట్లు సందీప్ శాండిల్యా వెల్లడించారు. కాగా, 2020 నుంచి ఇప్పటి వరకు డ్రగ్స్ దందాలో రూ. 127 కోట్లు చేతులు మారినట్లు అంచనా వేశారు. దీనిపై మరింత లోతుగా ఎంక్వైరీ చేస్తున్నారు.
అమెరికా మహిళల అకౌంట్ల నుంచి!
ప్రధాన డ్రగ్ సప్లయర్ ఎబుకాసుజీ నైజీరియాలోనే ఉంటూ తన డ్రగ్స్ దందాను ఇండియా, అమెరికాలో నిర్వహిస్తున్నాడు. నైజీరియా నుంచి టూరిస్ట్ వీసాపై హైదరాబాద్‌కు వచ్చిన ఇకెచుక్వు అలియాస్ ఎమ్మా.. ఎబుకాసుజీ ఆధ్వర్యంలో డ్రగ్ సప్లయ్ చేసేవాడు. అమెరికాలో డ్రగ్స్ దందా కోసం ఫేక్ ప్రొఫైల్స్‌తో అమెరికన్ మహిళలను హైదరాబాద్ నుంచి ఎమ్మా ట్రాప్ చేసేవాడు. తను కూడా అమెరికా సిటిజన్‌గా నమ్మించేవాడు. ఇలా 15 మంది అమెరికా మహిళలకు చెందిన బ్యాంక్ అకౌంట్లు, క్రెడిట్ కార్డులను సేకరించాడు. అమెరికాలోని డ్రగ్ కస్టమర్లకు డ్రగ్ డెలివరీ అయిన తర్వాత అక్కడి మహిళల అకౌంట్లలో డిపాజిట్లు చేయించేవారు.
వారికి ట్రాన్సాక్షన్ల వారీగా కమీషన్లు ఇచ్చేవాడు. అమెరికా మహిళల అకౌంట్ల నుంచి ఇండియాకు డబ్బు తరలించేవారు. ఇందుకోసం హైదరాబాద్ ఓల్డ్ మలక్‌పేటకు చెందిన మహ్మద్ మతిన్ సిద్దిఖీ నిర్వహించే వెస్ట్రన్ యూనియన్, రియా మనీ, మనీగ్రామ్ ద్వారా మనీలాండరింగ్ చేసేవారు.
మతిన్ సిద్దిఖీతోపాటు ఆనంద్ జైన్, నజీర్ మరికొందరు ఈ ట్రాన్సాక్షన్స్‌ను దగ్గరుండి చూసుకునేవారు. ఇట్ల అమెరికా మహిళల అకౌంట్ల నుంచి ఇక్కడికి వచ్చిన డబ్బులను.. ముంబైకి వస్త్ర వ్యాపారం కోసం వచ్చే నైజీరియన్ వ్యాపారులు డానియల్, మాలిక్, స్టాన్లీ ద్వారా నైజీరియాకు తరలించేవారు. ఇలా ప్రతిదశలోనూ ఎవరికి వారు 25 శాతం నుంచి 40 శాతం వరకు కమీషన్లు తీసుకునేవారు.