
తెలంగాణ వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. తొలి దశలో భాగంగా జనవరి 26న 71 వేల మందికి ప్రభుత్వం ఇండ్ల మంజూరు పత్రాలు అందించింది. రీ వెరిఫికేషన్ లో 6 వేల మందిని అధికారులు అనర్హులుగా తేల్చి తొలగించారు. చివరికి 65వేల మందిని అర్హులుగా గుర్తించారు. వీరిలో ఇప్పటి వరకు 12వేల మంది ఇండ్ల నిర్మాణానికి ముగ్గు పోశారు. బేస్ మెంట్ నిర్మాణంలో భాగంగా గుంతలు తీసి మట్టి, రాళ్లతో పూడ్చారు. మరో 1,200 మంది బేస్మెంట్ పూర్తి చేసుకున్నట్లు హౌసింగ్ డిపార్ట్మెంట్కు జిల్లా హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్లు నివేదిక ఇచ్చారు. ఉగాది పూర్తి కావడం, మంచి ముహుర్తాలు ఉండటం, వ్యవసాయ పనులు చివరి దశకు చేరుకోవడంతో ఇక ఇండ్ల నిర్మాణ పనులు మరింత ఊపందుకుంటాయని అధికారులు చెప్తున్నారు.
ఈ వారంలోనే డబ్బులు రిలీజ్!
ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం 4 దశల్లో రూ.5 లక్షలను లబ్ధిదారుడి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తుంది. తొలి దశలో బేస్ మెంట్ కంప్లీట్ అయ్యాక లక్ష రూపాయలు ఇవ్వాలి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 1,200 మంది బేస్మెంట్ పనులు పూర్తి చేసుకున్నారు. ఈ నెల చివరికల్లా మరో వెయ్యి మంది లబ్ధిదారులు పునాది పనులు పూర్తి చేస్తారని అధికారులు చెప్తున్నారు. బేస్మెంట్ కంప్లీట్ చేసిన అందరికి మొదటి విడతలో భాగంగా వెయ్యి కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ వారంలోనే డబ్బులు రిలీజ్ అవుతాయని ఉన్నతాధికారులు చెప్తున్నారు. ఈ నిధులన్నీ జిల్లాల ట్రెజరీల్లో ఉంటాయి.