ఆస్తులు జప్తు చేస్తుండ్రు.. అడ్డగోలు వడ్డీతో దగా చేస్తున్న వ్యాపారులు

  • ఒక్కరోజు లేటైనా బాధితులకు బెదిరింపులు
  • ఉమ్మడి వరంగల్ జిల్లాలో యథేచ్ఛగా సాగుతున్న దందా
  • కొన్నిచోట్ల ఆఫీసర్ల సహకారం
  • తాజాగా పరకాల కిడ్నాప్​ ఘటనతో కలకలం

హనుమకొండ, వెలుగు: ఉమ్మడి వరంగల్ జిల్లాలో వడ్డీ వ్యాపారుల ఆగడాలు శ్రుతిమించిపోతున్నాయి. వడ్డీకి చక్రవడ్డీ లెక్కలు కడుతూ కొంతమంది వ్యాపారులు జనాలను దగా చేస్తున్నారు. ప్రజల అవసరాలను బట్టి ఇంట్రెస్ట్ వసూలు చేస్తుండగా, వడ్డీ వ్యాపారుల ధన దాహానికి ఎంతోమంది అమాయకులు ఆస్తులు అమ్ముకుని రోడ్డున పడుతున్నారు. అక్రమంగా సాగుతున్న ఆ దందాకు చెక్​ పెట్టాల్సిన అధికారులే కొన్నిచోట్ల వ్యాపారులకు వత్తాసు పలుకుతున్నారు.  తాజాగా పరకాలలో ఓ వడ్డీ వ్యాపారి రూ.40 వేల వడ్డీ కోసం బాధితుడిని కిడ్నాప్ చేసి, ఏకంగా రూ.28 లక్షలు అప్పు తీసుకున్నట్లు ప్రామిసరీ నోట్లపై సంతకాలు చేయించుకోవడం కలకలం రేపగా, పోలీస్ అధికారులు కూడా వడ్డీ జలగలకే సపోర్ట్ చేయడం వివాదాస్పదమైంది.

కార్లు, బైకులు, టీవీలు జప్తు..

ఉమ్మడి వరంగల్ జిల్లాలో వడ్డీ వ్యాపారం పేరుతో కొంతమంది అక్రమార్జనకు తెరలేపారు. జనాల అవసరాలను ఆసరాగా చేసుకుని భారీగా ఇంట్రెస్ట్ వసూలు చేస్తున్నారు. వరంగల్ నగరంలో అవతలి వ్యక్తి అవసరాన్ని బట్టి రోజు చొప్పున ఇంట్రెస్ట్ కు ఇచ్చే వ్యాపారులున్నారు. పోస్టాఫీస్​ ఏరియాతో పాటు శివనగర్​, లేబర్​ కాలనీ, కాశీబుగ్గ, హనుమకొండ పెద్దమ్మగడ్డ, గోపాలపురం, కాజీపేట తదితర ప్రాంతాల్లో ఒక్కరోజు అవసరానికి 15 నుంచి 20 శాతం ఇంట్రెస్ట్ వసూలు చేస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో వడ్డీ వసూలు చేస్తున్న వ్యాపారులు ఒక్కరోజు లేటైనా కార్లు, బైకులు, టీవీలు జప్తు చేస్తున్నారు. హనుమకొండ లష్కర్​ సింగారం ప్రాంతంలో ఓ కానిస్టేబుల్ అక్కడి ఓ వ్యక్తికి అవసరానికి అప్పు ఇచ్చి, ఆ తర్వాత బాధితుల ఇంటినే సొంతం చేసుకున్న ఘటన ఆశ్చర్యానికి గురిచేస్తున్నది.  

పరకాల ఘటనతో కలకలం..

హనుమకొండ జిల్లాలో  కొందరు ఆఫీసర్లు వడ్డీ వ్యాపారులకే వత్తాసు పలుకుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా పరకాలలో జరిగిన ఘటనే ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది. పట్టణానికి చెందిన చెనుమల్ల సమ్మయ్య అనే వ్యాపారి గతంలో వలిపిరెడ్డి సుగుణ-మధుసూదన్​ దంపతులకు ఇంటి పేపర్లు, కొంత బంగారాన్ని తాకట్టు పెట్టుకుని రూ.2 లక్షలు అప్పుగా ఇచ్చాడు. కొంత కాలానికి అసలు చెల్లించిన బాధితులు రూ.40 వేల మిత్తి చెల్లించడానికి సమయం అడిగారు. దీంతో మిత్తి చెల్లించేందుకు సమయం ఇస్తూ ఖాళీ పేపర్ పై సంతకం చేయించుకున్న సదరు వ్యాపారి తనకు రూ.10 లక్షలు రావాల్సిందిగా పేపర్లు సృష్టించాడు. ఈ విషయంలో ఇరువర్గాల మధ్య వివాదం నడుస్తుండగా, ఏప్రిల్ 22న బాధితుడిని కిడ్నాప్ చేశారు. రెండు గంటలపాటు కారులో తిప్పి,  బెదిరించి తమకు రూ.28 లక్షలు బాకీ ఉన్నట్లుగా ప్రామిసరీ నోట్లు రాయించుకుని వదిలిపెట్టారు. 

వ్యాపారులకే వత్తాసు..

అక్రమ వడ్డీ దందా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సాగుతోంది. తాజాగా జయశంకర్​ భూపాలపల్లి జిల్లాలో వడ్డీ వ్యాపారులు బరి తెగించి వేధింపులకు పాల్పడటంతో పోలీసులకు పెద్ద ఎత్తున కంప్లైంట్స్ వచ్చాయి. దీంతోనే గత నెలలో అక్కడి పోలీసులు 12 మంది వడ్డీ వ్యాపారుల ఇండ్లలో సోదాలు చేసి వందల సంఖ్యల ప్రామిసరీ నోట్లు, సంతకాలు చేసి ఉన్న చెక్కులు, బాండ్ పేపర్లు స్వాధీనం చేసుకున్నారు. ఓ వైపు భూపాలపల్లి జిల్లాలో పోలీస్ ఆఫీసర్లు కేసులు నమోదు చేస్తుంటే, వరంగల్ కమిషనరేట్ లో మాత్రం పోలీసులు వ్యాపారులకే వత్తాసు పలుకుతున్నారనే ఆరోపణలున్నాయి. 

తాజాగా పరకాల ఇష్యూలో తన భర్త కిడ్నాప్ గురించి బాధితురాలు ఏసీపీని కలిస్తే, ఆ విషయం పక్కన పెట్టి సదరు అధికారి సెటిల్​మెంట్​చేసే ప్రయత్నం చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. రూ.40 వేల మిత్తికి రూ.10 లక్షలు కట్టమంటున్నారని బాధితులు వాపోతుంటే, రూ.7 లక్షలు కట్టమంటూ వ్యాపారులకే సపోర్టు చేసే ప్రయత్నం చేయడంతో బాధితులు సీపీ ఆఫీస్ గడప తొక్కారు. దీంతో అప్పటి వరకు కేసు నమోదు చేయని అధికారులు సీపీ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి ఐదుగురిని రిమాండ్​కు తరలించాల్సి వచ్చింది. ఇలాంటి అక్రమ దందాకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.