పాఠశాల విద్యావ్యవస్థలో పర్యవేక్షణ సంక్షోభం

పాఠశాల విద్యావ్యవస్థలో పర్యవేక్షణ సంక్షోభం

నిజాం పాలనలోని హైదరాబాద్ రాష్ట్రంలో  తెలంగాణలోని పాఠశాలలన్నీ ప్రభుత్వ అధీనంలో విద్యాశాఖ నిర్వహణలో ఉండేవి.  ఉపాధ్యాయుల వేతనాల చెల్లింపులు, పాఠశాలల నిర్వహణ, అధ్యాపకుల పదోన్నతులు, బదిలీలు, నియామకాలు అన్ని ప్రభుత్వమే నేరుగా నిర్వహించేది . 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత బల్వంతరాయ్ మెహతా కమిటీ సిఫార్సుల మేరకు స్థానిక సంస్థలకు పాఠశాలల నిర్వహణను అప్పగించడంతో.. అప్పటివరకు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న తెలంగాణ ఉపాధ్యాయులు స్థానిక సంస్థల ఉద్యోగులు అయ్యారు.  ప్రభుత్వ ఉద్యోగులకున్న వసతులు, సర్వీసు నిబంధనలు, వేతన వ్యవస్థ స్థానిక సంస్థలైన జిల్లా పరిషత్ / పంచాయతీ సమితి ఉపాధ్యాయులకు వర్తించకపోవడంతో తెలంగాణ ఉపాధ్యాయులలో అసంతృప్తి పెరిగింది. 

ఈ రకమైన వివక్షకు వ్యతిరేకంగా ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఉద్యమించి ఆందోళన చేశారు. ఆ నేపథ్యంలోనే 1981లో ఆనాటి శాసనసభలో పంచాయతీరాజ్ శాఖలోని ఇతర ఉద్యోగులతో పాటు, స్థానిక సంస్థల ఉపాధ్యాయులను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా  గుర్తిస్తూ  ప్రావిన్షియలైజేషన్ చేస్తూ  రాష్ట్ర ప్రభుత్వం ఒక చట్టం చేసింది. ఈ చట్టం ప్రకారం 1981 నుంచి పంచాయతీరాజ్ ఉపాధ్యాయులు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా గుర్తింపుపొంది రాజ్యాంగ నిబంధనలు, క్రమశిక్షణ నియమావళి, సెలవు నిబంధనలు, పెన్షన్ నిబంధనలు వర్తింపజేయబడ్డాయి. ఆనాటి నుంచి రాజ్యాంగంలోని 309 ఆర్టికల్ ద్వారా ఒకే  డీఎస్సీ ద్వారా నియామకాలు జరుపుతోంది. 

ఇవన్నీ వర్తింపచేసినప్పటికీ విద్యాపాలనలోని పర్యవేక్షణ పోస్టులైన ఆనాడు ఉన్న డిప్యూటీ ఇన్​స్పెక్టర్​ ఆఫ్ స్కూల్స్, సమితి స్థాయి విద్యాధికారి, నేటి మండల విద్యాధికారి (ఎంఈఓ),  డిప్యూటీ విద్యాధికారి (డివైఇవో ),  డిఇఓ, కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లెక్చరర్లు , డైట్ కళాశాల లెక్చరర్లుగా పదోన్నతులకు జిల్లా పరిషత్ ఉపాధ్యాయులకు అర్హత కల్పించాలని డిమాండ్ ముందుకు వచ్చింది. ఉపాధ్యాయుల హక్కులు పునరుద్ధరించాలిప్రభుత్వం 1992లో పదోన్నతుల కోసం కామన్ సర్వీసు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ న్యాయస్థానసూచనలతో ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకున్నది. 1992లో  సుందరేశన్ ఏకసభ్య కమిటీ విద్యాశాఖలోని విద్యార్థుల బోధనకు సంబంధం ఉండే పర్యవేక్షణ,  పాలనా సంబంధమైన పోస్టులను బోధనలో అనుభవం ఉన్న ఉపాధ్యాయులకు అర్హత కల్పించాలని, కార్యాలయ సంబంధమైన పాలనా పోస్టులకు  బోధనేతర సిబ్బందికి అవకాశం కల్పించాలని సిఫార్సులు చేసింది.  

ఆ మేరకు 1998లో  కామన్ సర్వీస్ రూల్స్ విడుదలయ్యాయి. తర్వాత 2005లో  మరోసారి ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్ రూల్స్ కోసం ఉత్తర్వులు ఇచ్చినప్పుడు న్యాయవివాదంతో అమలుకాలేదు. 2015లో  ఏకీకృత సర్వీసు రూల్స్​పై సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ‘జిల్లా పరిషత్ ఉపాధ్యాయులు కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులైనందున లోకల్ కేడర్ గా ఆర్గనైజ్ చేయడానికి రాష్ట్రపతి ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపించే స్వేచ్ఛ కలిగి ఉందని,  ఆ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని’ ఆదేశాలిచ్చింది.  ఆమేరకు 2017లో రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణలు జరిగాయి. అయితే, ఈ సవరణలను 2018లో హైకోర్టు కొట్టివేస్తూ రాష్ట్రపతికి లోకల్ కేడర్ గా ఆర్గనైజేషన్ చేయు అధికారమే ఉందని, ఏకీకృతం చేయు అధికారం లేదని ఆదేశాలిచ్చింది.  అంటే ఈ ఆదేశాల ప్రకారం మండల / జిల్లా పరిషత్ పాఠశాలలకు ఉపాధ్యాయ పోస్టులను లోకల్ కేడర్లుగా ఆర్గనైజ్ చేయుటకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రపతి అనుమతి పొంది, ఆ తరువాత ఆర్టికల్ 309 ప్రకారం ఉపాధ్యాయుల సర్వీసు నిబంధనలను జారీ చేస్తూ వారి సేవలను ఏకీకృతం చేయవచ్చు.  లోకల్ కేడర్ గా ఆర్గనైజ్ చేయడంవరకు ఆర్టికల్ 371(డి)కి సంబంధం ఉంటే, సర్వీసుల ఏకీకృతం చేయడం ఆర్టికల్ 309 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధిలోకి వస్తుంది . ఇట్లా తెలంగాణ ఉపాధ్యాయులకు ఆంధ్రప్రదేశ్ ఏర్పడక పూర్వం ఉన్న హక్కులను పునరుద్ధరించడానికి రాష్ట్ర ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది.

పాఠశాల విద్యావ్యవస్థలో.. పడకేసిన పర్యవేక్షణ

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 612 మండలాలకుగాను 596 మండలాల్లో ఎంఈఓ పోస్టులు ఖాళీగా ఉండగా, 33 జిల్లాలకు గాను 26 డీఈవో పోస్టులు ఖాళీలు ఉండి విద్యాపాలన నత్తనడకన కొనసాగుతోంది. అదేవిధంగా  పాఠశాల విద్యా వ్యవస్థలో  పర్యవేక్షణ పడకేసింది.  ఫలితంగా ఉపాధ్యాయుల పనితీరు, బోధన, హాజరు, మధ్యాహ్న భోజనం , యూనిఫాంల వంటి అంశాలను పర్యవేక్షించే అవకాశం లేకుండాపోయింది.  కోర్టు పరిధిలో ఉన్నదనే కారణంగా  కేసీఆర్​ సారథ్యంలోని గత బీఆర్ఎస్​ ప్రభుత్వం క్రియాశీలకంగా వ్యవహరించి తీసుకోవాల్సిన చర్యలను  తీసుకోకుండా నిర్లిప్తంగా వ్యవహరించింది.  ప్రస్తుతం సీఎం రేవంత్​రెడ్డి సారథ్యంలో కొనసాగుతున్న కాంగ్రెస్​ ప్రభుత్వమైనా  ఈ దశలో చర్యలు తీసుకోవాలి.  కామన్ సర్వీస్ రూల్స్ విడుదల చేసి పదోన్నతులు ఇచ్చి పర్యవేక్షణ సంక్షోభాన్ని నివారించాల్సిన అవసరం ఉంది. దీంతో  గత నాలుగు దశాబ్దాల వివాదాన్ని ముగించే సదవకాశం కలుగుతుంది. అంతేకాకుండా ఉమ్మడి సర్వీస్ రూల్స్ తో  రాష్ట్ర విద్యా పరిశోధనా సంస్థ (ఎస్సీఈఆర్టీ )లోని 44 ప్రొఫెసర్ పోస్టులను, 33 అధ్యాపక పోస్టులను, బీఈడీ కళాశాలలు,  డైట్ కళాశాలలోని అధ్యాపక పోస్టులను భర్తీ చేయడం ద్వారా భావి ఉపాధ్యాయులను రూపొందించే సంస్థలను పటిష్టం చేసే చారిత్రక బాధ్యత కూడా నిర్వర్తించినట్లు అవుతుంది. ఈ దిశలో చర్యలు తీసుకొని రాష్ట్రంలో  సీఎం రేవంత్​రెడ్డి  సర్కారు పాఠశాల విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తుందని ఆశిద్దాం. 

రెండు కేడర్లను ఏకీకృతం చేయాలి

తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా 33 జిల్లాలతో కూడిన రాష్ట్రపతి ఉత్తర్వులు 2018లో అమల్లోకి వచ్చాయి. ఈ ఉత్తర్వులలో పేరా 3(3) లో పంచాయతీరాజ్,  ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల ఏకీకృతం గురించి సవరణపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై  సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఈ నేపథ్యంలో 2021లో పంచాయతీరాజ్ శాఖలోని వివిధ పోస్టులను లోకల్ కేడర్లుగా వర్గీకరిస్తూ 204 జీవోను 2021లో ఇచ్చారు. విద్యాశాఖలోని పోస్టులను జీవో 158 ద్వారా  ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులను జీవో 245 ద్వారా, మండల,  జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయులను జీవోలు 256 , 257 ద్వారా లోకల్ కేడర్లుగా వర్గీకరించారు., దీని ఫలితంగా సుప్రీంకోర్టు / హైకోర్టు వివిధ సందర్భాల్లో ఇచ్చిన ఆదేశాల ప్రకారం వేరువేరు లోకల్ కేడర్లుగా ప్రభుత్వ పాఠశాల, జిల్లా పరిషత్ మండల పరిషత్ పాఠశాల ఉపాధ్యాయులు వర్గీకరింపబడినట్లు అయింది.  కనుక న్యాయవివాదాలేమీ లేనందున అవసరమైతే న్యాయ సలహాలను కూడా స్వీకరించి రాష్ట్ర ప్రభుత్వం ఆర్టికల్ 309 ప్రకారం తనకు సంక్రమించిన అధికారాలను ఉపయోగించి రెండు కేడర్లను ఏకీకృతం చేస్తూ సర్వీస్ రూల్స్ రూపొందించే అధికారం ఉంది.

- కె. వేణుగోపాల్,
పూర్వ అధ్యక్షుడు, ఏపీటీఎఫ్