వాటర్ ట్యాంకులో కోతులు కళేబరాలు

హాలియా, వెలుగు : నల్గొండ జిల్లా నాగార్జునసాగర్​(నందికొండ) మున్సిపాలిటీ పరిధిలోని వాటర్ ​ట్యాంక్ లో బుధవారం 40 కోతుల కళేబరాలు కనిపించాయి. ఒకటో వార్డు పరిధిలోని విజయ విహార్ పక్కన ఉన్న వాటర్ ట్యాంకుపై పెట్టిన మూత తెరిచి ఉండడంతో కొద్ది రోజుల కింద అందులో దిగిన 40 కోతులు బయటికి రాలేక చనిపోయాయి.

అప్పటి నుంచి కళేబరాలు నీళ్లలోనే ఉన్నాయి. మూడు  రోజుల కింద నీటి సరఫరా బంద్​ కావడంతో అధికారులు వెళ్లి చూడగా నీళ్లలో కోతుల కళేబరాలు కనిపించాయి. మున్సిపల్​ సిబ్బంది బయటకు తీసేందుకు యత్నించగా అక్కడే ఉన్న మరికొన్ని కోతులు ఎగబడ్డాయి. చివరకు వాటిని తరిమికొట్టి కళేబరాలు బయటకు తీశారు. నీటి సరఫరాను ఆపేసి ట్యాంకు ఖాళీ చేశారు. మూత సరిగ్గా పెట్టకపోవడం వల్లే ఇలా జరిగిందని, కొన్ని రోజులుగా కోతుల కళేబరాలు పడిన నీళ్లను తాగాల్సి వచ్చిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే, నాగార్జునసాగర్​ ప్రాజెక్ట్​ ఎస్​ఈ నాగేశ్వర్​ రావు మాట్లాడుతూ ఈ వాటర్​ ట్యాంకు నుంచి మూడు రోజులుగా నీటి సరఫరా చేయడం లేదని, జనాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. విషయం తెలిసిన తర్వాత వేరే రెండు ట్యాంకుల నుంచి నీటిని వదులుతున్నట్టు చెప్పారు.  ట్యాంకును పూర్తి స్థాయిలో క్లోరినేట్​ చేసిన తర్వాతే నీటిని వదులుతామన్నారు. అప్పటివరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామన్నారు.