లక్సెట్టిపేట మున్సిపాలిటీలో బెంబేలెత్తుతున్న జనం

లక్సెట్టిపేట, వెలుగు:  మున్సిపాలిటీలో కోతులు, కుక్కలు హడలెత్తిస్తున్నాయి. పట్టణంలోని   అన్ని కాలనీల్లో  ఉదయం నుంచే కోతులు ఆహారం కోసం ఇండ్లలోకి చొరబడుతున్నాయి. అడ్డుకోబోయిన వారిపైకి దూకి  గాయపరుస్తున్నాయి. ఇక రాత్రయితే కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. బైక్​లపై వెళ్లే వారిని వెంటాడి కరుస్తున్నాయి. ఇంత జరుగుతున్నా మున్సిపల్​  ఆఫీసర్లు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో జనాలు  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గుంపులు గుంపులుగా తిరుగుతూ..

మున్సిపాలిటీలో ప్రజలు ఉదయం లేచింది మొదలు కోతులతో ఓ రకంగా యుద్ధమే చేస్తున్నారు. మరిచిపోయి ఏవైనా వస్తువులు ఇండ్ల బయట పెడితే క్షణాల్లో మాయం చేస్తున్నాయి. ఆహారం కోసం ఇండ్లలో దూరుతుండడంతో వాటిని బెదిరించాలని చూస్తే  మీదికి దుంకి దాడులు చేస్తున్నాయి. కాలనీల్లో గుంపులు గుంపులుగా తిరుగుతూ  మూకుమ్మడిగా దాడి చేస్తున్నాయి. దీంతో మహిళలు, చిన్నపిల్లలు కోతుల నుంచి తప్పించుకునే క్రమంలో కిందపడి గాయాలపాలవుతున్నారు.  

దుకాణదారులకు తిప్పలు..

పట్టణంలో దుకాణదారుల పరిస్థితి  ఇంకా దారుణం. షాపు ముందు పెట్టుకున్న సరుకులను ఎత్తుకెళ్లడమే కాకుండా  చిందరవందర చేస్తున్నాయి.  పలు వీధుల్లో చిన్న వ్యాపారులు కోతుల గుంపులను చూసి షాపులను మూసివేస్తున్నారు. కొంతమంది కోతుల భయానికి ఇళ్ల చుట్టూ జాలీలు కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. 

వెంటాడుతున్న కుక్కులు..

పట్టణంలో కుక్కల సంఖ్య భారీగా పెరగడంతో  కాలనీల్లో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి అయితే చాలు వీరవిహారం చేస్తున్నాయి. పట్టణంలో బస్టాండు సమీపంలో మరీ కుక్కలు గుంపులు ఎక్కువగా  ఉంటుంది. బస్సు దిగి  భయం.. భయంగా  వెళ్తున్నామని పలువురు వాపోతున్నారు. ఎటు నుంచి వచ్చి దాడి చేస్తాయోనని వణికిపోతున్నామని చెప్తున్నారు.  అంతే కాకుండా  వాహనదారుల మీదికి కూడా  వస్తుండడంతో భయంతో కిందపడి గాయాల పాలవుతున్నారు. రోడ్ల మీదే  కుక్కలు గుంపులు పడుకుంటున్నాయి. ఇటీవల చాలా మందిని కుక్కలు కరువడంతో  ఆస్పత్రికి వెళ్లి వ్యాక్సిన్లు, యాంటీ రేబీస్​ఇంజెక్షన్లు వేసుకున్నారు. ఇప్పటికైనా సంబంధిత మున్సిపల్​ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

3 నెలల్లో 176 మందికి యాంటీ రేబీస్​

గడిచిన మూడు నెలల్లో లక్సెట్టిపేట గవర్నమెంట్​హాస్పిటల్​తో పాటు వెంకట్రావుపేట ప్రైమరీ హెల్త్​సెంటర్​తో కలిపి కుక్కలు, కోతుల దాడిలో గాయపడిన 176 మందికి యాంటీ రేబీస్​ఇంజెక్షన్లు వేసినట్లు ఆస్పత్రి డాక్టర్లు తెలిపారు. రోజు రోజుకూ కోతుల,  కుక్కల దాడిలో గాయపడి ఆస్పత్రులకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందన్నారు. ఇక్కడే కాకుండా  కాకుండా మంచిర్యాల, కరీంనగర్​ లాంటి  పెద్ద పట్టణాలకు కూడా బాధితులు వెళ్లినట్లు సమాచారం ఉంది. 

జాగ్రత్తలు  తీసుకోవాలి 

మున్సిపాలిటీలో కోతులు, కుక్కలు దాడులు చేసి గాయపరుస్తుండడంతో ప్రజలు అలర్ట్​గా ఉండాలి. ఈ రెండింటిలో ఏది కరిచినా ప్రమాదమే. కోతి, కుక్క కరిచిన వెంటనే శుభ్రంగా కడగాలి. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి  యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేయించుకోవాలి. -  డాక్టర్​ సతీశ్,  పీహెచ్సీ, వెంకట్రావుపేట