
మహబూబాబాద్, వెలుగు: ఊళ్లల్లో ఇండ్లు, పంట చేలపై కోతులు దండయాత్ర చేస్తున్నాయి. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా కోతుల దాడులతో జనం భయపడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా లో ఏటా కోతుల సంఖ్య రెట్టింపవుతోంది.దీంతో పంటలను కాపాడుకోవడానికి రైతులు, ఇండ్లు, కిరాణా షాపుల్లో వస్తువులను కాపాడుకోవడానికి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
పంట చేతికి వచ్చే పరిస్థితి లేదు
రైతులు సాగు చేస్తున్న పంటలను కోతుల గుంపులు ఆగమాగం చేస్తున్నాయి. వరి పొట్ట దశ మొదలుకొని కంకులు పెట్టే వరకు పీకి పడేస్తున్నాయి. మొక్క జొన్న కంకి దశ నుంచి కంకులు విరిచే వరకు, చివరకు పంట చేతికి వచ్చి ఆరబోసిన దశలోనూ కోతుల గుంపులు ఎగపడుతున్నాయి. పత్తి చేనులో చొరబడి కాయలు పీకడం, చేనులో విధ్వంసం సృష్టిస్తున్నాయి. కోతుల దెబ్బకు గ్రామాల్లో వేరుశనగ, పెసలు, కందులు తదితర పంటలను రైతులు వేయడం లేదు. రైతులు కూరగాయల సాగు జోలికే వెళ్లడం లేదు. మామిడి, సపోటా, జామ తోటలను కూడా రైతులు తొలగించుకున్నారు. మహబూబాబాద్, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో గతంలో కూరగాయలు, పప్పుధాన్యాల పంటలు అధికంగా పండేవి. గత 10 ఏళ్లుగా కోతుల దెబ్బకు ఆయా పంటలు సాగుచేయడం లేదు. దీంతో గ్రామాల్లో కూరగాయలు, పండ్లు, పప్పుల కొరత ఏర్పడుతోంది. గ్రామాల్లో గతంలో ప్రతిఇంట్లో వివిధ రకాల చెట్లు ఉండేవి. ప్రస్తుతం కోతుల బెడదతో చింత, వేప, సీతాఫలాలు.. తదితర చెట్లను నరికేస్తున్నారు.
మహిళలు, చిన్నారులపై దాడులు
ఇండ్లల్లోకి చొరబడి విధ్వంసం చేస్తున్నాయి. అడ్డుకోబోయిన మహిళలు, చిన్నారులు, వృద్ధులపై దాడులు చేస్తున్నాయి. ఇంట్లోని వస్తువులు, తినుబండారాలను ఎత్తుకెళ్తున్నాయి. కిరాణా షాపుల నిర్వాహకులు కోతుల దాడికి తట్టుకోలేక షాపులకు జాలీలను ఏర్పాటు చేసుకుంటున్నారు. పట్టణ కేంద్రాల్లో ప్రూట్స్అమ్మేవారు సైతం జాలీలు ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి.
కోతుల బెడదను నివారించాలి
ప్రభుత్వం స్పందించి తక్షణం కోతులను నివారించాలి. కోతుల సంతతిని తగ్గించేలా చర్యలు చేపట్టాలి. అడవుల పెంపకం మూలంగా కోతులన్నీ వాపస్ పోతాయని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఉమ్మడి జిల్లా పరిధిలో వివిధ గ్రామాల్లో కోతుల బెడద వెంటాడుతూనే ఉంది.
- మేకల కుమార్, రైతు, సోమారం గ్రామం