- నిర్మల్ జిల్లా ఖానాపూర్ టౌన్ లో ఘటన
ఖానాపూర్, వెలుగు : కోతులు ఇంట్లోకి వెళ్లి వెంటపడడంతో భయంతో పరుగులు తీసిన మహిళ కిందపడి మృతిచెందిన ఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు.. ఖానాపూర్ టౌన్ విద్యానగర్ లో ఉండే బొంగోని లక్ష్మి(58) ఇంట్లోకి సోమవారం కోతులు వెళ్లడంతో భయంతో పరుగులు తీయగా కింద పడడంతో తల, వెనక భాగంలో దెబ్బలు తగిలాయి. ఆమెను వెంటనే కుటుంబసభ్యులు స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా.. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే చనిపోయినట్టు తెలిపారు. లక్ష్మికి ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నారు. మృతురాలి భర్త గంగా గౌడ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ గైక్వాడ్ రాహుల్ తెలిపారు.
బాధిత కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలి
కోతుల కారణంగా ప్రాణాలు కోల్పోయిన లక్ష్మి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని ఖానాపూర్ టౌన్ కు చెందిన పలు రాజకీయ పార్టీల నేతలు, ప్రజలు డిమాండ్ చేశారు. సోమవారం రాత్రి స్థానిక ఎన్టీఆర్ చౌరస్తా వద్ద డెడ్ బాడీతో ఆందోళనకు దిగారు. టౌన్ లో కోతుల బెడద ఎక్కువగా ఉందని పలుమార్లు మున్సిపల్ అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని, వారి నిర్లక్ష్యం కారణంగా నిండు ప్రాణం పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. మున్సిపల్ చైర్మన్ చిన్నం సత్యం, సీఐ సైదారావు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.