సర్పంచ్ ఎన్నికల్లో కోతుల పంచాది

సర్పంచ్ ఎన్నికల్లో కోతుల పంచాది
  • ఎన్నికల ఎజెండాగా మారిన మంకీ సమస్య
  • వాటి బెడద నివారిస్తేనే ఓట్లు వేస్తామంటున్న జనం
  • ఇప్పటికే పలు గ్రామాల్లో తీర్మానాలు  
  • గతంలో కోతులను పట్టిస్తామని హామీలిచ్చి సర్పంచులుగా గెలిచిన కొందరు 
  • ఈసారి కూడా అలాంటి ముందస్తు హామీలిస్తున్న ఆశావహులు 
  • కోతులను పట్టించే పనిలో ఇప్పటికే పలువురు బిజీ

హైదరాబాద్, వెలుగు : ఈసారి పంచాయతీ​ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ‘కోతుల తిప్పలు’ తప్పేలా లేవు.  గ్రామాల్లో సీసీ రోడ్లు వేస్తామని, డ్రైనేజీలు కడ్తామని, డ్రింకింగ్​వాటర్ ఇస్తామని.. గతంలో ఓట్లు అడిగేవారు. జనం సైతం ఇలాంటి హామీలే కోరుకునేవారు. కానీ ఈసారి గ్రామాల్లో సీన్​మరోలా ఉంది. రోడ్లు, డ్రైనేజీల సంగతేమో గానీ.. కోతుల బెడదను తీర్చే వారికే ఓట్లేస్తామని జనం అంటున్నారు. గ్రామాల్లో మనుషులపై దాడులు చేస్తూ, పొలాల్లో పంటలను ధ్వంసం చేస్తూ నరకం చూపుతున్న  కోతుల సమస్యను పరిష్కరించినవాళ్లనే సర్పంచ్​లుగా, ఎంపీటీసీలుగా గెలిపిస్తామంటున్నారు. 

దీంతో పలువురు ఆశావహులు తమను గెలిపిస్తే కోతులన్నింటినీ పట్టించి అడవుల్లో వదలుతామని హామీ ఇస్తున్నారు. మరికొందరైతే ఇప్పటికే రంగంలోకి దిగి కోతులను పట్టే పనిలో బిజీ అయ్యారు. ఇంకొందరు ఆశావహులైతే ఇప్పటికే కోతులను పట్టించి, ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎదురుచూస్తున్నారు. మొత్తమ్మీద ఈసారి కోతుల అంశం సర్పంచ్​ఎన్నికల ఎజెండాగా మారడం విశేషం. గతంలోనూ ఇలా కోతుల బెడద నివారిస్తామని హామీ ఇచ్చినవాళ్లు భారీ మెజారిటీతో గెలుపొందారు. 

రాష్ట్రంలో 35 లక్షలకు పైగా కోతులు.. 

రాష్ట్రంలో 35 లక్షలకు పైగా కోతులు ఉన్నాయి. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా జనావాసాల్లో ఎటుచూసినా కోతులే కనిపిస్తున్నాయి. ఒక్కో గ్రామంలో వందలాదిగా తిష్టవేసి పిల్లలు, మహిళలపై దాడులు చేస్తున్నాయి. ఇండ్లను లూటీ చేస్తున్నాయి. అటు పంట పొలాలనూ నాశనం చేసి, రైతులను ఆర్థికంగా దెబ్బతీస్తున్నాయి.  పండ్లు, కూరగాయలు, వరి, మక్క, జొన్న, గోధుమ, పత్తి, పల్లి, కంది, సోయా, శనగ.. ఇలా పంటలన్నింటినీ  ధ్వంసం చేస్తున్నాయి. పండ్లు, కూరగాయల తోటల్లో భారీ గాలివాన ద్వారా వచ్చే నష్టం కంటే కోతుల మంద పడ్తే కలిగే నష్టమే ఎక్కువని రైతులు వాపోతున్నారు. 

రాష్ట్రంలోని వ్యవసాయ దిగుబడుల్లో 20 నుంచి 30శాతం పంటలను కేవలం కోతుల వల్లే కోల్పోతున్నామని అగ్రికల్చర్​ఆఫీసర్లు చెప్తున్నారు. వీటిని నియంత్రించకపోతే రాబోయే పదేండ్లలో 50శాతానికి పైగా పంటలకు గ్యారెంటీ ఉండదని హెచ్చరిస్తున్నారు. ఇక జనావాసాల్లో కోతులు సృష్టిస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా తలుపులు తీసుకొని ఇండ్లలోకి దూరుతున్నాయి. సంచులు, డబ్బాలు, అన్నం గిన్నెలు.. ఇలా ఏది దొరికితే అది ఎత్తుకెళ్తున్నాయి. వస్తువులను చిందరవందర చేస్తున్నాయి. వీటి కారణంగా ఊళ్లలో పెరటితోటలు క్రమంగా కనుమరుగయ్యాయి. 

కోతుల భయానికి కిరాణాలను ఐరన్​గ్రిల్స్ తో మూసేసి చిన్న కౌంటర్ ద్వారా సరుకులు అమ్మాల్సి వస్తోంది. లేదంటే దుకాణాలను లూటీ చేస్తున్నాయి. ఒంటరిగా ఉన్నప్పుడు కొండెంగకు సైతం భయపడే కోతులు, గుంపులో ఉన్నప్పుడు సింహాల్లా మనుషులపై ఎగబడ్తున్నాయి. తమపై మనుషులు దాడి చేస్తున్నప్పుడో, ఫుడ్​దక్కకుండా అడ్డుకుంటున్నప్పుడో అటాక్​చేస్తున్నాయి. ఇలా కోతుల దాడుల్లో రాష్ట్రంలో ఏటా వెయ్యి మందికి పైగా గాయపడ్తుండగా, పదులసంఖ్యలో మరణిస్తున్నారని అధికారులు చెప్తున్నారు. 

నియంత్రణపై దృష్టి పెట్టట్లేదు.. 

 ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న కోతులను నియంత్రించకపోతే రాబోయే పదేండ్లలో జనాభాను దాటేస్తాయని, అప్పుడు జరిగే నష్టం మాటలకందదని జువాలిస్టులు చెప్తున్నారు. యాదాద్రి లాంటి కొన్ని జిల్లాల్లో కోతులు ఇప్పటికే జనాభాలో సుమారు 50 నుంచి 70శాతానికి చేరుకోవడంతో తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయి. ఇంత జరుగుతున్నా  కోతుల నియంత్రణపై ప్రభుత్వాలు ఏమాత్రం దృష్టిపెట్టడం లేదు. కోతుల్లో సంతానోత్పత్తిని నియంత్రించే స్టెరిలైజేషన్​ప్రక్రియను ముందుకుతీసుకెళ్లడం లేదు. రాష్ట్రంలో 35 లక్షలకు పైగా కోతులుంటే గడిచిన నాలుగేళ్లలో కేవలం 1,500 కోతులకు మాత్రమే స్టెరిలైజేషన్ చేశారు. 

మదర్​కేర్ ఎక్కువగా ఉండే కోతుల్లో డెత్ రేట్ చాలా తక్కువ. అందుకే  కోతుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కోతుల ఫ్యామిలీ ప్లానింగ్​ఆపరేషన్ల కోసం 2020 డిసెంబర్​లో అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్మల్​లో మంకీ రెస్క్యూ, రిహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు.  సెంటర్​లో ఒక డాక్టర్, ఫార్మాసిస్టు, నలుగురు సిబ్బందిని నియమించి.. రాష్ట్రవ్యాప్తంగా పట్టితెచ్చే కోతులకు ఇక్కడ ఫ్యామిలీ ప్లానింగ్​ ఆపరేషన్​చేయించాలని నిర్ణయించారు. కోతులను పట్టి తెచ్చే బాధ్యతను ఆయా గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలకు అప్పగించారు. కానీ ఒక్కో కోతిని పట్టుకోవడానికి మంకీ క్యాచర్లు రూ.వెయ్యి దాకా డిమాండ్​ చేస్తున్నారు. 

100 కోతులను పట్టాలంటే తక్కువలో తక్కువ లక్ష కావాలి. దీంతో అసలే నిధుల కొరతతో అల్లాడుతున్న  పంచాయతీలు, బల్దియాలు చేతులెత్తేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో లోకల్​బాడీల పాలకవర్గాలకు గడువు ముగియడంతో త్వరలోనే  సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్​ ఎన్నికలు వరుసగా జరగనున్నాయి. దీంతో ఈసారి కోతుల బెడద నివారించేవారికే ఓట్లు వేస్తామని జనం అంటున్నారు. ఇందుకోసం కొన్ని గ్రామాల్లో తీర్మానాలు కూడా చేస్తున్నారు. 

కోతులను పట్టిస్తానంటే భారీ మెజారిటీతో గెలిపించిన్రు.. 

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన ఏలేటి మమత.. తనను సర్పంచ్​గా గెలిపిస్తే గ్రామంలో కోతుల బెడద లేకుండా చేస్తానని గత ఎన్నికల్లో హామీ ఇచ్చారు. గ్రామంలో 4 వేల నుంచి 5 వేల కోతులు ఉండడంతో వాటి వల్ల ఎన్నో ఏండ్లుగా ఇబ్బందులు పడ్తున్న జనం.. మరో ఆలోచన లేకుండా మమతను భారీ మెజారిటీతో గెలిపించారు. సర్పంచ్ గా మమత గెలిచిన వెంటనే బిహార్ నుంచి ఓ స్పెషల్ టీమ్​ను రప్పించి.. రెండు నెలలు కష్టపడి సుమారు 3 వేల కోతులను పట్టించి ఉట్నూరు అడవుల్లో వదిలివేశారు. గడిచిన రెండేళ్లలో కోతుల సంతతి భారీగా పెరగడంతో మళ్లీ అదే సమస్య మొదలైంది. దీంతో ఈసారి కూడా కోతులను పట్టించేవారికే ఓటు వేస్తామని జనం చెప్తున్నారు.

కోతులను పట్టించి సర్పంచ్​ రేసులో.. 

మెదక్ జిల్లా నిజాంపేట్ మండల కేంద్రంలో కోతుల బెడద ఎక్కువగా ఉండేది. ప్రజలు, రైతుల ఇబ్బందులను గమనించిన గ్రామస్తుడు, కాంగ్రెస్ నాయకుడు పంజా మహేందర్ ఒక్కో కోతికి రూ.500 చొప్పున చెల్లించి ఏకంగా 600 కోతులను పట్టించి.. దూర ప్రాంతాల్లో వదిలేయించాడు. ఇందుకోసం రూ.3.5 లక్షలు ఖర్చు చేశాడు. ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి. రిజర్వేషన్ అనుకూలంగా వచ్చి గ్రామ పెద్దలు, కాంగ్రెస్ నాయకులు సహకరిస్తే సర్పంచ్ బరిలో ఉంటానని చెబుతున్నాడు పంజా మహేందర్. 

అలాగే మహబూబాబాద్ జిల్లా గూడూరుకు చెందిన వాంకుడోత్ కొమ్మలు నాయక్ కోతుల బెడద నివారించేందుకు రూ.8 లక్షలు ఖర్చు చేశాడు. ఏపీలోని చిత్తూరు నుంచి కోతులను పట్టేవారిని రప్పించి, సుమారు 200 కోతులకు పైగా పట్టించి, దూరప్రాంతాల్లో వదిలేసి వచ్చాడు. ప్రస్తుతం రిజర్వేషన్​కలిసి వస్తే ఆయన సర్పంచ్​ఎన్నికల్లో పోటీచేసే ప్రయత్నాల్లో ఉన్నారు.  

కోతులను పట్టించినోళ్లకే మా ఓటు..

రోజూ కోతులతో నరకం చూస్తున్నం. పొలాల్లో పంటలను నాశనం చేస్తున్నయ్. ఇండ్లలోకి చొరబడి అన్ని చిందరవందర చేస్తున్నయ్. వాటిని ఆపడానికి ప్రయత్నిస్తే దాడి చేస్తున్నయ్. అధికారులు సమస్యను పరిష్కరిస్తలేరు. ఈసారి కోతులను పట్టిస్తామని ముందుకొచ్చే వాళ్లకే ఓటు వేసి గెలిపిస్తం.

- బాలే జయశ్రీ, మల్యాల, జగిత్యాల జిల్లా

ఎవరు వచ్చినా కోతుల గురించే అడుగుతం..  

మా ఊరిలో కోతుల సమస్య ఎక్కువ. ఇంట్లోకి వచ్చి సామాన్లు ఎత్తుకెళ్తున్నయ్. కోతుల దాడిలో ఇప్పటికే 50 మందికి పైగా గాయపడ్డరు. పెరట్లో కూరగాయలు, పండ్లు ఒక్కటి కూడా దక్కనిస్తలేవు. ఆఫీసర్లు పట్టించుకుంటలేరు. అందుకే ఈసారి సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల కోసం ఎవరు ప్రచారానికి వచ్చినా కోతుల గురించే అడుగుతం.

  చంద్రగిరి తిరుపతి, కోత్మీర్, కుమ్రంభీం జిల్లా

కోతులను పట్టించినోళ్లకే ఓటు

మా గ్రామంలో కోతుల సమస్య తీవ్రంగా ఉంది. దీంతో కోతులను పట్టించిన వాళ్లకే స్థానిక ఎన్నికల్లో ఓట్లు వేస్తామని గ్రామస్తులమంతా తీర్మానం చేశాం. కానీ ఖర్చు ఎక్కువవుతుందని ఎవరూ ముందుకువస్తలేరు. కోతుల వల్ల రైతులు చాలా నష్టపోతున్నారు. కాపలాకి కనీసం కూలీలు కూడా దొరకట్లేదు. చేసేది లేక  రైతులంతా ఎకరానికి రూ.వెయ్యి చొప్పున చందాలు వేసుకుని కోతులను పట్టించి అడవికి తరలించాలని నిర్ణయించాం.

- నీలపాల నరసింహారావు, రైతు, కల్లూరుగూడెం, ఖమ్మం జిల్లా  

నన్ను గెలిపిస్తే.. కోతులను పట్టిస్త..

మా ఊరిని ఆనుకొని ఇనుపరాతి గుట్టలు ఉన్నాయి. అక్కడ కోతులకు సరైన ఆహారం దొరక్క ఊరి మీద పడుతున్నాయి. జనాలపై దాడులు చేస్తున్నాయి. గతంలో ఒకట్రెండు సార్లు  బోనులు ఏర్పాటు చేసి కోతులను పట్టించారు. కానీ మళ్లీ సంతతి పెరిగింది. ఈసారి నన్ను సర్పంచ్​గా గెలిపిస్తే సొంతంగా బోనులు తయారు చేయించి వాటిని పట్టుకుంటా. గ్రామ పంచాయతీ సిబ్బందికే శిక్షణ ఇప్పించి, కోతులను పట్టి దూర ప్రాంతాలకు తరలించాలనే ఆలోచన చేస్తున్న.

- సాతూరి రేఖ, దామెర, ఎల్కతుర్తి మండలం, హనుమకొండ జిల్లా  

నా హామీల్లో కోతులే ఫస్ట్.. 

నేను ఈసారి సర్పంచ్​ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నాను. మా గ్రామంలో కోతుల బెడద ఎక్కువుంది. అందుకే నన్ను గెలిపిస్తే కోతుల సమస్య పరిష్కరిస్తానని ఈ సారి హామీ ఇవ్వాలనుకుంటున్నా. మిగిలిన హామీల కన్నా ఈ హామీయే ఎక్కువ ఓట్లు తెస్తుంది. ఎందుకంటే గ్రామాల్లో జనం ఎక్కువ సఫర్ అవుతున్నది కోతుల వల్లే! అందుకే ఒక వేళ సర్పంచ్​గా గెలిపిస్తే మొదటిరోజే  బోన్లు తెప్పిస్తా. వాటి సాయంతో కోతులను పట్టుకుని నిర్మల్ అడవుల్లో వదిలి వేయిస్తా.

- గాజె శ్రీధర్, శనిగరం, సిద్దిపేట జిల్లా 

కోతులను తరిమినందుకు సర్పంచ్​ పదవి

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామంలో గతంలో కోతుల బెడద ఎక్కువగా ఉండేది. దీంతో గ్రామానికి చెందిన ఆర్టీసీ రిటైర్డ్ డ్రైవర్ దూడల సంపత్.. కోతుల బెడద తీర్చేందుకు ఓ ఆలోచన చేశాడు. గతంలో ఆయన కళాకారుడు కావడంతో రోజొక వేషం వేసుకొని కోతులను తరమడం ప్రారంభించాడు. గ్రామంలో దాదాపు రూ.లక్ష వరకు విరాళాలు సేకరించి ఏపీ నుంచి కోతులను పట్టే వాళ్లను రప్పించాడు. 

వారం పాటు వారికి ఇక్కడే మకాం ఏర్పాటు చేయించి కోతులను పట్టుకుని, అటవీ ప్రాంతానికి తరలించేలా కృషి చేశాడు. కోతుల బెడద తీర్చడంతో 2019లో జరిగిన ఎన్నికల్లో సంపత్ భార్య ప్రమీలను సర్పంచ్ గా భారీ మెజారిటీతో గ్రామస్తులు గెలిపించారు.