- భీమారంలో కోతుల బెడదకు చెక్
- ఒక్కో కోతిని పట్టేందుకు రూ.500 ఖర్చు
- రూ.లక్షన్నర రిలీజ్ చేసిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
జైపూర్, వెలుగు: మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలో కొన్నేండ్లుగా కోతులు స్వైరవిహారం చేస్తున్నాయి. గుంపులుగా ఇండ్లలోకి చొరబడి బీభత్సం సృష్టిస్తున్నాయి. అడ్డొచ్చినవారిపై దాడి చేసి కరుస్తున్నాయి. దీంతో కోతులను కంట్రోల్ చేయాలని స్థానికులు అధికారులకు మొరపెట్టుకున్నారు. పలుమార్లు ఆందోళనలకు దిగారు. చెన్నూర్ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి దృష్టికి తీసుకెళ్లగా.. కోతులను పట్టేందుకు ఆయన డీఎంఎఫ్టీ నుంచి రూ.లక్షన్నర రిలీజ్ చేయించినట్టు కాంగ్రెస్లీడర్ చేకుర్తి సత్యనారాయణరెడ్డి తెలిపారు. అలాగే స్థానికులు తలా కొంత వేసుకొన్నారు. కోతులు పట్టే వారిని తిరుపతి నుంచి పిలిపించారు. బోన్లలో దాన ఉంచి కోతులను అందులో బంధిస్తున్నారు. దూరంగా ఫారెస్ట్‌లోకి తీసుకెళ్లి వదిలేస్తున్నారు. భీమారంలో 500లకు పైగా కోతులు ఉండగా.. వారం రోజుల్లో 170 కోతులను పట్టుకున్నట్టు మంకీ క్యాచర్ దినేశ్తెలిపాడు. ఒక్కో కోతికి రూ.500 వసూలు చేస్తున్నాడు.