మోడీ 1.0 బాగుంది.. 2.0 మామూలే.. గుత్తాధిపత్యం దిశగా బ్యాంకింగ్ వ్యవస్థ: ప్రముఖ ఎకనామిస్ట్

మోడీ 1.0 బాగుందని, మోడీ 2.0 మామూలేనని ప్రముఖ ఆర్థికవేత్త, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) ప్రొఫెసర్ ప్రసన్న తంత్రి అన్నారు. మోడీ 1.0 కు తాను పెద్ద ఫ్యాన్ అని.. 2.0 గురించి చెప్పుకోవడానికి అంతగా ఏం లేదని అనడం చర్చనీయాంశంగా మారింది. బ్యాంకింగ్ వ్యవస్థలో వస్తున్న మార్పులు బ్యాంకుల ఏక గుత్తాధిపత్యం దిశగా తీసుకెళ్తు్న్నాయని ఆయన అన్నారు. 

చిన్న బ్యాంకులను పెద్ద బ్యాంకులలో విలీనం చేయాలనే ఆలోచన సరైంది కాదన్నారు. దీని వలన ప్రజలకు సేవలు తగ్గిపోతాయని, అదే విధంగా బ్యాంకుల మోనోపొలీ పెరిగి పోతుందని అన్నారు. పొదుపు (సేవింగ్స్) విషయంలో బ్యాంకులు అవలంభిస్తున్న విధానం బాగుందని.. కానీ రుణాల విషయంలో బ్యాంకుల తీరు ఆందోళనకరంగా ఉందని అన్నారు. 

రుణ పరపతి వ్యవస్థ బాగాలేదు:

మోడీ ప్రభుత్వ విధానం రుణాలను తగ్గించి, అంకుర పరిశ్రమలను, ఆంత్రప్రెన్యూర్షిప్ ను తగ్గించే విధంగా ఉందని తెలిపారు. మోడీ 2.0 కు తాను పెద్ద ఫ్యాన్ ని కాదని అన్నారు. 

పొదుపు విషయంలో ప్రజల నమ్మకాన్ని బ్యాంకులు నిలబెట్టుకున్నాయని, దీనికి వ్యతిరేకంగా రుణ పరపతి విషయంలో నమ్మకం కోల్పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్బీఐ (SBI) లాంటి పెద్ద బ్యాంకులే ఉండాలంటే.. అవి ప్రజల, కొత్త పారిశ్రామిక వేత్తల సమస్యలు, లక్ష్యాలను పట్టించుకోవని అన్నారు. ‘నువ్వెవరు.. నీ లక్ష్యమేంటి.. నీ బిజినెస్ ప్లాన్ ఎలా ఉంది అనే కోణంలో ఆలోచించలేవు’ అని అన్నారు. అందుకే చిన్న బ్యాంకులను ప్రోత్సహించి.. క్యాష్ ఫ్లో ఆధారంగా రుణాలు మంజూరు చేసే వ్యవస్థను ప్రోత్సహించాలని సూచించారు. 

కేంద్ర ప్రభుత్వం రుణాల విషయంలో ప్రభుత్వం స్పాన్సర్ చేసే స్కీమ్స్ పైనే ఆధారపడటం సరికాదని, అదొక్కటే పరిష్కారం కాదన్నారు. ముద్ర లోన్ల విషయంలో ఏం జరుగుతుందో తనకు అర్థం కావటం లేదని, రుణాల విషయంలో బ్యాంకర్లు ఒక విధానం తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు. 

ఆర్బీఐలో పనిచేస్తున్న వారికి ఆ విషయం అర్థం కావటం లేదు:

ఆర్బీఐలో పనిచేస్తున్న వారికి అసలైన విషయం అర్థం కావటం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇతర బ్యాంకర్లు లేదా పారిశ్రామిక వేత్తలు ఉదాహరణకు 100 రూపాయల సెక్యూరిటీ ఇస్తున్నారు. సెక్యూరిటీ ఆధారంగా రూ.80 రుణాలు ఇచ్చాం అనుకుంటున్నారు. కానీ కంపెనీలు డీఫాల్ట్ అయినపుడు ఆ 100 రూపాయల సెక్యూరిటీని 100కు అమ్మలేం. కనీసం 80 కి కూడా అమ్మలేం. అది రూ.40 లేదా 30 కి మాత్రమే అమ్ముకోగలం. దాని వలన ఎకానమీకి చాలా నష్టం కలుగుతుంది. ఈ విషయాన్ని ఆర్బీఐ అధికారులు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారోనని విమర్శించారు. 

ఇలాగైతే కొన్నాళ్లకు మోనోపొలీలే మిగులుతాయి:

 NBFC లను మూసివేయడం.. చిన్న బ్యాంకులను విలీనం చేయడంపైనే ప్రభుత్వం దృష్టి పెట్టిందని విమర్శించారు. దీని వలన రుణ సదుపాయానికి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని అన్నారు. ఈ వ్యవస్థను మార్చకపోతే మన అభివృద్ధి క్షీణిస్తుందని, అప్పుడు చెప్పుకోవడానికి కేవలం మోనొపొలీలు మాత్రమే ఉంటాయని అన్నారు.