యునైటెడ్ స్టేట్స్‌లోని కొలరాడో విశ్వవిద్యాలయానికి చెందిన ఓ పరిశోధకుడు 1969 నుంచి 2013 వరకు ప్రపంచవ్యాప్తంగా 180 దేశాల్లోని వ్యవసాయ కమతాల సంఖ్య, వాటి విస్తీర్ణం విశ్లేషించారు. ఈ సమాచారం ఆధారంగా 2100 నాటికి పరిస్థితి ఎట్లా ఉంటుందో అంచనా వేశారు. దాని ప్రకారం 2100 నాటికి ప్రపంచంలోని కమతాల సంఖ్య సగానికి తగ్గుతుంది. అమెరికాలో, ఐరోపా ఖండంలో ఈ రకం మార్పు
ఎప్పటి నుంచో చూస్తున్నాం.
అమెరికా వ్యవసాయ శాఖ పరిశోధన ప్రకారం..20వ శతాబ్దపు తొలినాళ్లలో వ్యవసాయం శ్రమతో కూడుకున్నది. గ్రామీణ ప్రాంతాల్లో వివిధ రకాల పంటలను పండించే అనేక చిన్న-పరిమాణ కమతాలలో ఇది జరిగింది. మరోవైపు 21వ శతాబ్దంలో వ్యవసాయోత్పత్తి, తక్కువ కమతాలలో పెద్ద-పరిమాణం, ఏకపంట పద్ధతిలో కేంద్రీకృతమై ఉన్నది. అమెరికా జనాభాలో నాలుగో వంతు కంటే తక్కువ జనాభా గ్రామీణ ప్రాంతాలలో ఉన్నారు. అమెరికాలో వ్యవసాయ క్షేత్రాల సంఖ్య 1982 నుంచి తగ్గుతూ వస్తున్నది. - 2007లో 2.20 మిలియన్ల నుంచి 2022 నాటికి రెండు మిలియన్లకు తగ్గింది. నిజానికి, 15 ఏండ్లలో పొలాల సంఖ్యలో భారీ తగ్గింపుగా కొందరు భావిస్తున్నా, అది అంత భారీ తగ్గింపు కానే కాదు. కమతాల సంఖ్య తగ్గడంతో, సగటు పొలం పరిమాణం 1970లలో 176 హెక్టార్ల నుంచి 2022 నాటికి 178 హెక్టార్లకు పెరిగింది. ‘పారిశ్రామిక’ వ్యవసాయం ప్రోత్సహించడానికి అమెరికా ప్రభుత్వం వేల కోట్ల రూపాయల రాయితీలు అందించింది. ఇప్పటికీ అందిస్తున్నది. ఐరోపా ఖండంలో కూడా ఇదే పరిస్థితి. అన్ని కమతాలు కూడా పండించే పంటను బట్టి ఆయా కంపెనీల గుత్తాధిపత్యానికి దాసోహం కావలసి వచ్చింది. విత్తనాల దగ్గర నుంచి, పంట రక్షణ చర్యల వరకు అన్నింటా పంట కొనుగోలు చేసే కంపెనీల మాటనే చెల్లుబాటు అవుతోంది.
తెలంగాణలో పర్యటించిన బ్రిటన్ రైతుల బృందం
16 ఏండ్ల క్రితం బ్రిటన్ దేశం నుంచి ఒక రైతుల బృందం తెలంగాణాలో వరంగల్ ప్రాంతాన్ని సందర్శించింది. అందులో ఉన్నవారందరూ పెద్ద కమతాల భూస్వాములే. వారిలో ఒక్కొక్కరికి 200 హెక్టార్ల కంటే తక్కువగా లేదు. అయితే, అందరూ నష్టపోతున్నారు. వారు మన వ్యవసాయం చూసి, సగటు క్షేత్ర పరిమాణం చూసి ఆశ్చర్యపోయారు. ఇక్కడి పరిస్థితులు చూసి చిన్న క్షేత్రాల వ్యవసాయమే అన్నివిధాల మంచిది అనే అభిప్రాయానికి వచ్చారు. తేయాకు, కాఫీ తోటలు ఇదివరకు పెద్ద కంపెనీలు నిర్వహించేవి. ఈ మధ్య తమ తోటలను ఆయా కంపెనీలు అమ్మేస్తున్నాయి. వ్యక్తిగత రైతులు చిన్న కమతాలలో తేయాకు, కాఫీ తోటలను నిర్వహిస్తున్న ధోరణి భారత్‌లో పెరుగుతున్నది. ఆఫ్రికాలో రైతులు చిన్న తోటలలోనే పామాయిల్ పండించి తామే గానుగ ఆడించి మార్కెట్లో అమ్మే వ్యవస్థ ఉన్నది. ఇంకోవైపు, అడవులను నిర్మూలించి వేస్తున్న పామ్ ఆయిల్ తోటలు ఇండోనేసియా, మలేషియా దేశాలలో వేల ఎకరాలను ఆక్రమించాయి. లాటిన్ అమెరికాలో పశువుల మాంసం కోసం అమెజాన్ అడవులను నరికివేసి వేల ఎకరాలలో లక్షల పశువులను ‘బోనులలో’ పెంచుతున్నారు. ఆఫ్రికా ఖండంలో సోమాలియా, ఇథియోపియా వంటి దేశాలలో కూడా ‘వలస’ వచ్చిన పెట్టుబడిదారీ కంపెనీలకు స్థానిక రైతులను స్థానభ్రంశం చేసి మరీ, అక్కడి ప్రభుత్వాలు వేల ఎకరాలను అప్పజెప్పుతున్నాయి. ఆసియా, ఆఫ్రికా ఖండాలలో చిన్న కమతాల సంఖ్య అధికం. ఇక్కడ సగటు వ్యవసాయ క్షేత్రాల పరిమాణాలు 2 హెక్టార్ల కంటే తక్కువగా ఉంటాయి.
చిన్న రైతులను, కమతాలను కాపాడుకోవాలి
పెద్ద కమతాలను అభివృద్ధి చెందిన దేశాల ప్రభుత్వాలు ప్రోత్సహించడానికి మూడు ప్రధాన కారణాలు కనపడుతున్నాయి. కొన్ని కంపెనీలకు గుత్తాధిపత్యం, పండించిన పంటను ప్రాసెస్ చేసే పరిశ్రమల సాంకేతిక సామర్థ్యం, వ్యాపార లక్ష్యాలకు అనువుగా ఎగుమతులు సులభతరానికి ప్రోత్సహిస్తున్నాయి. రైతుల పట్ల ప్రభుత్వాలు విధిగా స్పందించాల్సిన ‘సంక్షేమం’ విషయంలో లక్షల మందితో బదులు కొన్ని కంపెనీలు ఉంటే అన్ని రకాలుగా ప్రభుత్వానికి సులువు అవుతుంది. బ్రిటన్‌లో, ఐరోపా ఖండంలో, అమెరికా దేశంలో పెద్ద కమతాలకు ఇచ్చే ‘సబ్సిడీలు’ అందరికి తెలిసే అవకాశం లేదు. మన దేశం స్పష్టంగా ఎక్కడా ప్రకటించకపోయినా పెద్ద కమతాలు మాత్రమే ఉండే విధంగా వివిధ విధానాలను మారుస్తున్నది. ఒకప్పుడు మన దేశంలో రైసు మిల్లులు ప్రతి గ్రామంలో ఉండేవి. ఈ మధ్య ఎక్కువగా ఈ దశాబ్ద కాలంలో రైసు మిల్లులు ఆధునీకరిస్తూ వాటి సాంకేతిక సామర్థ్యం పెంచుతున్నారు. ఇంకొక వైపు పాత మిల్లులు మూతపడుతు
న్నాయి. చిన్న రైతు ఇచ్చే వడ్ల పరిమాణం ఈ ఆధునిక రైసు మిల్లులకు అస్సలు ఆనదు. ఇదే పరిస్థితి వేరుశనగ, పప్పులు, పత్తి వంటి పంటలకు కూడా దాపురించింది. ఆధునిక వ్యవసాయం వల్ల పెద్ద కమతాలు దాపురిస్తే మనం కోల్పోయే కనపడని విషయాలు అనేకం ఉన్నాయి. మనం జాగ్రత్త పడకుంటే, చిన్న రైతులను, కమతాలను కాపాడుకోకుంటే జరిగే అనర్థాలు చాలా లోతుగా ఉంటాయి. ఆఫ్రికా ఖండంలో ఉన్న పరిస్థితికి మన దేశం కూడా దిగజారవచ్చు.
మార్కెట్లో డిమాండ్‌కు అనుగుణంగా మార్పులు
వ్యవసాయ క్షేత్ర పరిమాణం ఉత్పాదకతతో సంక్లిష్ట సంబంధాన్ని కలిగి ఉంటుంది. రుణం, సాంకేతిక పరికరాల వల్ల, కార్మికుల వల్ల పెద్ద క్షేత్రాలు ప్రారంభంలో అధిక ఉత్పాదకతను ప్రదర్శించవచ్చు. అయినప్పటికీ, వ్యవసాయ క్షేత్ర పరిమాణం పెరిగే కొద్దీ, నిర్వహణ, రవాణాలో ఉండే ఒడుదుడుకుల వల్ల ఉత్పాదకత చివరికి తగ్గుతుంది. చిన్న క్షేత్రాలకు ఆవిష్కరణలకు ఆస్కారం ఇస్తూ, మార్కెట్లో డిమాండ్లకు అనుగుణంగా మార్పులు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. వనరులను సమర్థవంతంగా ఉపయోగించడం ద్వారా అధిక ప్రయోజనాన్ని చిన్న క్షేత్రాల ద్వారానే పొందవచ్చు. ఆధునిక వ్యవసాయానికి, దానితో పాటు పెంచుతున్న ‘శుద్ధి’ పరిశ్రమలకు చిన్న వ్యవసాయ క్షేత్రాలతో అస్సలు పొసగదు. ఆధునిక వ్యవసాయ పరిశోధనలు కూడా పెద్ద కమతాలకు అనుగుణంగానే ఉంటాయి. ఆధునిక వ్యవసాయంలో ప్రవేశపెట్టిన అధిక దిగుబడి, సంకర, హైబ్రిడ్ విత్తనాలు, ఎరువులు, క్రిమికీటక నాశన రసాయనాలు, జన్యుమార్పిడి విత్తనాలు వగైరా చిన్న రైతులకు, చిన్న కమతాలకు అనుగుణంగా రాలేదు. వ్యవసాయ క్షేత్ర పరిమాణం రసాయనాల వినియోగాన్ని ప్రభావితం చేస్తుంది. పెద్ద కమతాలలో పెట్టిన పెట్టుబడులకు అనుగుణంగా విష రసాయనాల వాడకం ఎక్కువ అవుతున్నది.
భారత్‌లో పెరుగుతున్న వ్యవసాయ క్షేత్రాలు
2 హెక్టార్ల కంటే పెద్ద వ్యవసాయ పరిమాణాలు అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలలో పొలాలు సంఖ్యలో సాపేక్షంగా చిన్న వాటాను కలిగి ఉంటాయి. ఇంకొక వైపు, భారతదేశంలో క్షేత్రాల సంఖ్య1971లో 71 మిలియన్ల నుంచి 2015 -2016 నాటికి 146.5 మిలియన్లకు పెరిగింది. వ్యవసాయ క్షేత్రాల సంఖ్య ఇంకా పెరుగుతోంది. భారతదేశంలో వ్యవసాయ క్షేత్ర పరిమాణాలు చిన్నవి, విభిన్నమైనవి. డేటా ప్రకారం.. భారతదేశంలో సగటు కమత పరిమాణం దాదాపు 1.5 హెక్టార్లు (3.7 ఎకరాలు). అయితే ఇది ప్రాంతాన్నిబట్టి గణనీయంగా మారవచ్చు. ఆధునిక వ్యవసాయ ఆర్థిక నమూనాలో పంటల ఉత్పాదకత/ దిగుబడి, ఉత్పత్తి సామర్థ్యం, లాభం వంటి వివిధ ఆర్థిక అంశాలతో వ్యవసాయ క్షేత్ర విస్తీర్ణం ముడిపెడతారు. ఆధునిక వ్యవసాయం మీద నమ్మకం ఉన్న వ్యవసాయ ఆర్థికవేత్తలు. మార్కెట్లో ఎంత వ్యవసాయ ఉత్పత్తి తీసుకువస్తే ఆ మేరకు ధర నిర్ధారించే అవకాశం వస్తుందని కూడా ఆధునిక వ్యవసాయ ఆర్థిక శాస్త్రం చెబుతోంది. ఆధునిక యంత్రాలతో పనిచేస్తూ, మా వ్యవసాయం ఆదర్శంగా తీసుకోండి అని అమెరికా ఇతర దేశాలకు నూరి పోస్తూ ఉంటుంది. ఈ నాణెం ఇంకొక వైపు కథ చాలా మందికి తెలియదు. టన్నుల కొద్దీ ఉత్పత్తి చేసి అవి అమ్ముకోలేక ఇతర దేశాలకు వ్యవసాయ ఉత్పత్తులను ‘ఆహార’ సహాయం పేరు మీద సబ్సిడీలతో ఎగుమతి చేయడం అమెరికా దేశానికి నిత్యకృత్యం.
- డా. దొంతి నర్సింహారెడ్డి,పాలసీ ఎనలిస్ట్