- మొత్తం 3.76 లక్షల ఎకరాల్లో సాగవుతుందని ఆఫీసర్ల అంచనా
- 1.90 లక్షల ఎకరాల్లో వరి సాగు చేసే చాన్స్
- 84,741 టన్నుల ఎరువులకు ప్రపోజల్స్
- నకిలీ విత్తన అమ్మకాలపై స్పెషల్ ఫోకస్
జనగామ, వెలుగు : జనగామ జిల్లాలో వానాకాలం పంటల సాగుకు సంబంధించిన యాక్షన్ ప్లాన్‌ను ఆఫీసర్లు రెడీ చేశారు. ఈ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 3.76 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేయనున్నట్లు అంచనా వేశారు. యాసంగి వడ్ల కొనుగోళ్లను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. మరో వైపు అకాల వర్షాలతో యాసంగి పంట నష్టపోయిన రైతులు వానాకాలం సీజన్‌పైనే ఆశలు పెట్టుకున్నారు. రోహిణి కార్తె మొదలుకానుండడంతో దుక్కులు దున్నే పనిలో నిమగ్నం అయ్యారు.
1.90 లక్షల ఎకరాల్లో వరి, 1.70 లక్షల ఎకరాల్లో పత్తి
వచ్చే నెలలో మొదలయ్యే వానాకాలం సీజన్‌లో మొత్తంగా 3,76,625 ఎకరాల్లో వివిధ పంటలను సాగు చేయనున్నారు. 1.90 లక్షల ఎకరాల్లో వరి, 1.70 లక్షల ఎకరాల్లో పత్తి, 11 వేల ఎకరాల్లో కంది, 4 వేల ఎకరాల్లో మక్కజొన్న, 250 ఎకరాల్లో వేరుశనగ, 1100 ఎకరాల్లో పెసరతో పాటు, మరికొన్ని ఎకరాల్లో వివిధ రకాల కూరగాయలు సాగు కానున్నట్లు ఆఫీసర్లు అంచనా వేశారు. కానీ పంటల సాగుకు సంబంధించి ప్రతీ సీజన్‌లో ఆఫీసర్ల అంచనాలు తప్పుతున్నాయి. గత వానాకాలం సీజన్‌లో 1,67,639 ఎకరాల్లో వరి సాగవుతుందని అంచనా వేస్తే ఏకంగా 2,12,769 ఎకరాల్లో వరి సాగు జరిగింది. నీటి లభ్యత ఎక్కువగా ఉండడంతో రైతులు వరి సాగు విస్తీర్ణం బాగా పెంచేశారు. అలాగే పత్తి 1.68 లక్షల ఎకరాల్లో సాగవుతుందని అంచనా వేయగా 1,40,740 ఎకరాలకే పరిమితమైంది. మక్కజొన్న 4,073 ఎకరాలను అంచనా వేయగా 3,521 ఎకరాల్లోనే సాగైంది. వరికి బదులు ప్రత్యామ్నాయ పంటల సాగు పెంచాలని అగ్రికల్చర్ ఆఫీసర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కాగా వానాకాలం సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 84,741 టన్నుల ఎరువులు అవసరమని ఆఫీసర్లు సర్కారుకు ప్రపోజల్స్ పంపించారు. ఇందులో యూరియా 43,312 టన్నులు, డీఏపీ 18,831 టన్నులు, కాంప్లెక్స్ 15,065, పొటాష్ 7,533 టన్నులు అవసరం అవుతాయని ప్రతిపాదనలు పంపించారు.
నకిలీ విత్తనాలపై స్పెషల్ ఫోకస్
నకిలీ విత్తన అమ్మకాలు జరగకుండా ఆఫీసర్లు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇదే విషయంపై ఇటీవల ఆఫీసర్లతో మీటింగ్ నిర్వహించారు. నకిలీ విత్తనాలు అమ్ముతున్నట్లు తెలిస్తే డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ 99634 02109 కు ఫిర్యాదు చేయాలని సూచించారు. గడువు ముగిసిన విత్తనాలు, లైసెన్స్ లేకుండా విత్తనాలు అమ్మిన, నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫర్టిలైజర్ షాపుల ఓనర్లు తప్పనిసరిగా బిల్లులు ఇవ్వాలని, స్టాక్ రిజిస్టర్‌ను సరిగ్గా మెయింటేన్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు
వానాకాలం సీజన్‌లో రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం. జిల్లా వ్యాప్తంగా 3.76 లక్షల ఎకరాల్లో పంటల సాగు జరగనున్నట్లు అంచనా వేశాం. అవసరమైన ఎరువులు తెప్పించేలా ప్రపోజల్స్ పంపించాం. నకిలీ విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.
- బి.వినోద్‌కుమార్,
అగ్రికల్చర్ ఆఫీసర్, జనగామ