సన్న వడ్లు మిల్లులకే పోతున్నయ్ ..మిల్లుల వద్ద బారులు తీరుతున్న ట్రాక్టర్లు

  • తేమ నిబంధనతో కొనుగోలు కేంద్రాలకు పోని రైతులు  
  • ప్రస్తుత పరిస్థితి చూస్తే సర్కార్  సన్న బియ్యానికి కష్టమే

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వానాకాలం పండిన సన్న రకం వడ్లలో చాలా వరకు మిల్లులకే పోతున్నాయి. ఇప్పటికే సన్న వడ్లకు సంబంధించి 60 శాతం పైగా పొలాల్లో కోతలు పూర్తయ్యాయి. సన్న వడ్లు వేసిన రైతులు వరిపొలాల్లో కోసిన పంట కోసినట్లే పచ్చి వడ్లు ట్రాక్టర్లకు ఎత్తి మిల్లులకు తరలిస్తున్నారు. సర్కారు బోనస్ ఇస్తున్నా ఇప్పటివరకు సన్న వడ్లు లక్ష టన్నులు దాటలేదు. వ్యాపారులు పొలాల్లోకి వచ్చి కొంటుండడంతో రైతులు అమ్మేందుకు మొగ్గు చూపుతున్నారు.

పచ్చి వడ్లనే  కోసిన పొలాల్లో తడి ఆరకముందే కొంటుండడం, మరోవైపు కొనుగోలు సెంటర్లలో 33 రకాల సన్న వడ్లే కొంటుండడంతో మిగతా సన్న రకాలను రైతులు తమ వద్దకే వస్తున్న వ్యాపారులకు అమ్ముకుంటున్నరు. రూ.2,200 నుంచి రూ.2,400, రూ.2,600 వరకు ధరలతో కల్లాల్లోనే అమ్మేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 7,750 కొనుగోలు కేంద్రాలు తెరిచినా ఇప్పటివరకు మొత్తం 4 లక్షల టన్నుల వడ్ల కొనుగోళ్లు జరిగాయి. అందులో సన్న వడ్లు కేవలం లక్షటన్నుల లోపు మాత్రమే ఉన్నాయి. మరోవైపు గ్రామాల్లోకి వెళ్లి కల్లాల వద్ద, మిల్లుల వద్ద పచ్చి సన్నవడ్లనే జోరుగా కొంటున్నరు. బియ్యం ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు ఎత్తేయడంతో మిల్లర్లు, వ్యాపారులు వీలైనన్ని సన్న వడ్లను కొనే పనిలో పడ్డారు. ఆయా జిల్లాల్లో పండించే తెలంగాణ సోనా, హెచ్ఎంటీ, జై శ్రీరాం, బీపీటీ వంటి డిమాండ్ ఉన్న సన్న వడ్లను పొలాల వద్దే కొని మిల్లులకు తరలిస్తున్నారు. 

మిల్లుల వద్ద ట్రాక్టర్ల బారులు 

సర్కారు ప్రకటించిన 33 సన్న రకాలు కాకుండా, మిగతా రకాలనూ మిల్లర్లు కొంటుండటంతో మిల్లుల వద్ద ట్రాక్టర్లు బారులు తీరుతున్నాయి. రాష్ట్రంలో ప్రధానంగా సూర్యాపేట, తుంగతుర్తి, నకిరేకల్ నుంచి నేరుగా మిర్యాలగూడ, హుజూర్ నగర్​ తదితర ప్రాంతాల్లోని మిల్లులకు వడ్ల లోడ్లు ఎక్కువయ్యాయి. రోజుకు రెండు వేల ట్రాక్టర్లు వస్తే ధర కొంత మెరుగ్గా ఉంటోంది. 

అంతకంటే ఎక్కువైతే మిల్లుల్లో కెపాసిటీని మించిపోయి కొనుగోలు ఆపేస్తున్నారు. ఇదే అదునుగా మిల్లరు అగ్గువకు రైతుల నుంచి కొంటున్నరు. ధాన్యం రాక పెరగడంతో సిండికేట్ గా మారి ధరలు మరింత తగ్గించేస్తున్నారు. అయితే, పచ్చి వడ్లు కావడంతో రెండు మూడు రోజులు అలాగే ఉంచితే ముక్కిపోతాయని రైతులు ఏదో ఒక ధరకు అమ్ముకోక తప్పడంలేదు.  

ఈసారి సన్నాలే ఎక్కువ 

రాష్ట్రవ్యాప్తంగా ఈసారి వానాకాలంలో రికార్డు స్థాయిలో 66.73 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ప్రభుత్వం సన్నాలకు క్వింటాల్​కు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించడంతో సన్నవడ్ల సాగు పెరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 1.46 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. 

ఇందులో ట్రేడర్లు, మిల్లర్లు, కొనుగోలు చేసే ధాన్యం, రైతులు తమ అవసరాలకు ఉంచుకునే నిల్వలు పక్కనపెడితే దాదాపు 91 లక్షల టన్నుల ధాన్యం  కొనుగోలు కేంద్రాలకు వస్తుందని.. ఇందులో 44 లక్షల టన్నుల దొడ్డు రకం, 47 లక్షల టన్నుల సన్న రకం ఉంటుందని సివిల్​సప్లైస్ శాఖ లెక్కలు వేసింది. కానీ బయట సన్న బియ్యానికి  మంచి డిమాండ్​ఉండడంతో సర్కారు సన్న వడ్లు కొంటే తమకు సన్న బియ్యం దక్కవని భావించిన మిల్లర్లు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు.