వానాకాలం ప్లాన్​ రెడీ

  • జిల్లాలో 4.50 లక్షల ఎకరాల్లో పంటల సాగుకు అంచనా
  • వర్షాకాలంలో సాధారణానికి మించి సాగు చేసే అవకాశం

ఆసిఫాబాద్, వెలుగు: ఆసిఫాబాద్ ​జిల్లాలో వానాకాలం సీజన్ సాగు ప్రణాళిక ఖరారైంది. వచ్చే నెలలో రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలపడంతో రైతులు వర్షాకాలం పంటల సాగు కోసం సన్నద్ధమవుతున్నారు.ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారులు పంట సాగుపై అంచనాలు రూపొందించారు. ఈ వానాకాలం సీజన్​లో జిల్లాలో సాధారణానికి మించి  పంటలు సాగయ్యే అవకాశం ఉందని అధికారులు లెక్కలు వేశారు. 4 లక్ష 50 వేల ఎకరాల్లో రైతులు అన్ని రకాల పంటలు సాగుచేసే అవకాశం ఉందని అంచనా వేశారు.

7 లక్షల పత్తి విత్తనాల ప్యాకెట్లు, 85,816 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని గవర్నమెంట్​కు నివేదికలు పంపారు. ఈ నెలలో రోహిణి కార్తి ప్రవేశిస్తుండగా ఇప్పటి నుంచే రైతులు దుక్కులు దున్ని, ఎరువులు, విత్తనాలు సిద్ధం చేస్తున్నారు. ఈమేరకు అధికారులు పంటల సాగుపై గ్రామాల వారిగా పట్టికలు రూపొందించారు.

పత్తి సాగు అధికం

జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్​లో పంటల సాగుకు అంచనాలు వేసిన అధికారులు విత్తనాల కోసం గవర్నమెంట్​కు నివేదిక పంపారు. జిల్లాలో అరకొర సాగునీటి వసతి ఉండడం, ప్రాజెక్టులు పూర్తికాక, ఉన్న ప్రాజెక్టుల కాలువలు రిపేర్లకు నోచుకోకపోవడంతో వర్షాధార పంటలనే రైతులు ఆశ్రయిస్తున్నారు. దీంతో రైతులు అధికంగా వర్షాధార పంట అయిన పత్తి పైనే ఆధారపడుతున్నారు. ఈ సీజన్​లోనూ అధికంగా పత్తి సాగు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. మొత్తం పంటల్లో మూడో వంతు ఈ పంట సాగుచేసే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు.

నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దు

ఖరీఫ్ సీజన్ లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నం. రైతులు లైసెన్స్ ఉన్న ట్రేడర్ల దగ్గరే విత్తనాలు కొనుగోలు చేయాలి. నకిలీ విత్తనాలు కొని నష్టపోవద్దు. నాణ్యమైన విత్తనాలే కొనాలి. అగ్రికల్చర్ ఆఫీసర్ల సూచనలు, సలహాలు పాటించాలి. విత్తనాలు, ఎరువులు కొన్నప్పుడు తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలి.
- శ్రీనివాస్, డీఏఓ, ఆసిఫాబాద్