ఇయ్యాల గోల్కొండలో తొలి బోనం

ఇయ్యాల గోల్కొండలో తొలి బోనం
  •     అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్న నెల రోజుల జాతర 

నెలరోజుల ఆషాఢ బోనాల జాతర ఆదివారం గోల్కొండ కోటలో షురూ కానుంది. కోటలోని ఎల్లమ్మ తల్లికి తొలి బోనం సమర్పించనున్నారు. 

మెహిదీపట్నం, వెలుగు: నెలరోజుల ఆషాఢ బోనాల జాతర ఆదివారం గోల్కొండ కోటలో షురూ కానుంది. కోటలోని శ్రీ జగదాంబికా మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించనున్నారు. నెలరోజుల పాటు ప్రతి ఆది, గురువారాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆదివారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో లంగర్ హౌస్ చౌరస్తాలోని భారీ తొట్టెల ఊరేగింపుతోపాటు అమ్మవారి రథాన్ని  మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్​ పూజలు చేసి ప్రారంభిస్తారు. అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. అక్కడి నుంచి భారీ తొట్టెల ఊరేగింపు వేలాదిమంది భక్తులతో గోల్కొండ కోటలోని ఆలయం వరకు చేరుకుంటుంది. 

భారీ ఏర్పాట్లు

గోల్కొండ కోట బోనాల ఉత్సవాల కోసం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి తెలిపారు. శనివారం ఉదయం గోల్కొండ కోటలో ఏర్పాట్లను పరిశీలించారు. గోల్కొండ కోట శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల దృష్ట్యా అమ్మవారికి తొమ్మిది పూజలు ప్రతి ఆది, గురువారాల్లో నిర్వహిస్తారు. ఈ క్రమంలో ప్రతి ఆది, గురువారాల్లో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపు కొనసాగుతుందని వాహనదారులు గమనించాలని ట్రాఫిక్​ అడిషనల్​ కమిషనర్​ విశ్వ ప్రకాశ్​ కోరారు.