స్థల వివాదాలతో ముందుకుసాగని ఎస్పీ ఆఫీస్, స్టేడియం పనులు
- ఇప్పటికీ షురూ కాని వర్స్క్
- స్టేడియం నిర్మాణానికి రెండుసార్లు భూమిపూజ
- నిధులు, స్థలాల కేటాయింపుపై స్పష్టత ఇవ్వని సర్కార్
నారాయణపేట, వెలుగు : నారాయణపేట జిల్లాలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి నెలలు గడుస్తున్నా ముందుకు పడడం లేదు. జిల్లా కేంద్రంలో చేపట్టిన డెవలప్మెంట్ వర్క్స్‌కు మంత్రి కేటీఆర్ భూమిపూజ చేసినా వివిధ కారణాలతో పనులు ప్రారంభం కాకపోవడంపై జిల్లా ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్థలాల ఎంపికలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఈ పరిస్థితి నెలకొంది. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఈ పనులు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
వివాదాస్పద స్థలాల ఎంపిక..
రెండో విడతలో నారాయణపేట, ములుగు జిల్లాలు ఏర్పాటు కాగా, వాటికి ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదు. పూర్తి స్థాయిలో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు కాలేదు. జిల్లా ఏర్పడిన మూడేండ్ల తరువాత కలెక్టరేట్, ఎస్పీ ఆఫీస్ కాంప్లెక్స్‌ల కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అధికారులు ప్రభుత్వ భూములు గుర్తించి కేటాయించాల్సి ఉండగా, వివాదాస్పద భూములు గుర్తించడంతో ఎస్పీ ఆఫీస్ నిర్మాణం శంకుస్థాపతోనే ఆగింది. పట్టణంలోని గ్రౌండ్‌ను మినీ స్టేడియంగా మారుస్తామని 2017లో మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. వ్యయం పెరగడంతో మరోచోట స్టేడియం నిర్మాణం కోసం రెండోసారి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయగా, ఆ స్థలం కూడా వివాదంలో ఉండడంతో నిర్మాణం ఆగిపోయింది. దేశంలో రెండో గోల్డ్‌సోక్ నిర్మించేందుకు రూ.20 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించి, కేటీఆర్శంకుస్థాపన చేయగా ఇప్పటి వరకు స్థలం కూడా గుర్తించలేదు. దీని నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి.
రూ. 6 కోట్లతో స్టేడియం..
జిల్లా కేంద్రంలోని గ్రౌండ్‌లోని 5 ఎకరాల్లో స్టేడియం నిర్మాణం కోసం 2017లో రూ.2 కోట్లు మంజూరు కాగా, కేటీఆర్ శంకుస్థాపన చేశారు. నిధులు సరిపోవని మరో రూ.2 కోట్లు మంజూరు చేశారు. ఇక్కడ అన్ని క్రీడలకు ట్రాక్‌లు సరిపోవని మరోచోట స్టేడియం నిర్మిస్తామని 2022 మేలో రెండోసారి శంకుస్థాపన చేశారు. స్థలం మాత్రం చూడలేదు. మైనార్టీ కాలనీలో ఇచ్చిన ప్లాట్లను తీసుకొని స్టేడియం కట్టాలని ప్లాన్ చేయగా, పట్టాదారులు కోర్టుకెళ్లగా వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో స్టేడియం పనులు పెండింగ్ పడ్డాయి.
గోల్డ్ సోక్ నిర్మాణం అంతే..
నారాయణపేట స్వచ్ఛమైన బంగారానికి పెట్టింది పేరు. ఇక్కడ బంగారం వ్యాపారులు, కార్మికులు ఎక్కువగా ఉండడంతో తమిళనాడులోని సేలంలో మాదిరిగా దేశంలో రెండో గోల్డ్ సోక్ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం రూ.20 కోట్లు మంజూరు చేయగా, కేటీఆర్ 2022 మేలో శంకుస్థాపన చేశారు. కనీసం స్థలం కూడా చూడకుండా, భూమిపూజ చేయగా, దాని నిర్మాణంపై ఇప్పటికీ ఊసే లేకుండా పోయింది.
కోర్టు తీర్పుతో పెండింగ్..
ఎస్పీ ఆఫీస్ కోసం ఊట్కూర్ మండలం వల్లంపల్లి శివారులో 16 ఎకరాల భూమిని అధికారులు కేటాయించారు. ఈ ఏడాది మార్చిలోమంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అయితే ఇందులో సగం భూమిని 2005లోనే అప్పటి ప్రభుత్వం పేదలకు ఇంటి స్థలాల కోసం కేటాయించింది. ఇండ్లు కట్టుకోలేదని పేర్కొంటూ ఈ స్థలాన్ని ఎస్పీ ఆఫీస్ కోసం కేటాయించారు. లబ్ధిదారులు కోర్టుకు వెళ్లగా, వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. రూ.37 కోట్లతో టెండర్ పిలిచినప్పటికీ, స్థల వివాదంతో పనులు షురూ కాలేదు.
20 ఎకరాలు కేటాయించారు..
ఎస్పీ ఆఫీస్ నిర్మాణం కోసం గతంలో కేటాయించిన స్థలం వివాదం కారణంగా పనులు ప్రారంభించలేదు. ప్రస్తుతం కలెక్టర్ 104 సర్వే నెంబర్లో 20 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఈ నెలలో పనులు ప్రారంభిస్తాం.
- ఎన్ వెంకటేశ్వర్లు, ఎస్పీ