T20 World Cup 2024: కోహ్లీ సెంచరీ చేసి ఫైనల్ గెలిపిస్తాడు: ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ జోస్యం

T20 World Cup 2024: కోహ్లీ సెంచరీ చేసి ఫైనల్ గెలిపిస్తాడు: ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ జోస్యం

టీ20 వరల్డ్ కప్ తుది సమరానికి భారత్, దక్షిణాఫ్రికా జట్లు సిద్ధమయ్యాయి. మరికొన్ని గంటల్లో గ్రాండ్ గా ఈ మెగా ఫైనల్ ప్రారంభం కానుంది. బార్బడోస్ లోని కెన్నింగ్ టన్ ఓవల్ ఈ మ్యాచ్ కు ఆతిధ్యమిస్తుంది. శనివారం (జూన్ 29) జరగనున్న ఫైనల్ తో ఈ టోర్నీకి ఎండ్ కార్డు పడుతుంది. సాయంత్రం 8 గంటలకు జరగనున్న ఈ మ్యాచ్ పై క్రికెట్ లవర్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. రెండు జట్లు కూడా ఓటమి తెలియకుండా ఫైనల్ కు చేరడంతో ఎవరు గెలుస్తారోననే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఈ మ్యాచ్ పై ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ తన ప్రిడిక్షన్ చెప్పుకొచ్చాడు. 

వరల్డ్ కప్ టైటిల్ ను భారత్ గెలుస్తుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోహ్లీ బ్యాటింగ్ పై నమ్మకముంచాడు. ఫైనల్లో సౌతాఫ్రికాపై సెంచరీ కొడతాడని ఆశభావం వ్యక్తం చేశాడు. ఈ టోర్నీలో కోహ్లీ ఓపెనర్ గా ఘోరంగా విఫలమయ్యాడు. 8 మ్యాచ్ ల్లో 75 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. ఫైనల్లోనూ కోహ్లీ ఓపెనింగ్ రావడం దాదాపుగా ఖాయమైంది. దీంతో కోహ్లీ ఫామ్ పై చాలామంది అనుమానం వ్యక్తం చేసినా పనేసర్ నమ్మకముంచాడు. చాలామంది ఎక్స్ పర్స్ టీమిండియానే టైటిల్ గెలుస్తుందని జోస్యం చెప్పారు .

ఈ మ్యాచ్ లో రోహిత్ సేన ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. మరోవైపు తొలిసారి ఫైనల్ కు వచ్చిన సౌతాఫ్రికా వరల్డ్ కప్ టైటిల్ గెలవాలని గట్టి పట్టుదలతో ఉంది. 2013 లో మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో వరల్డ్ కప్ గెలిచిన తర్వాత భారత్ కు ఐసీసీ ట్రోఫీ లేదు.1998 లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత దక్షిణాఫ్రికాకు ఐసీసీ ట్రోఫీ గెలవలేదు. 10 ఏళ్లుగా ఐసీసీ టోర్నీల్లో ఈ రెండు జట్లు అద్భుతంగా ఆడుతున్నా ట్రోఫీ గెలవలేకపోతున్నాయి. చోకర్స్ గా ముద్ర పడ్డ ఈ రెండు జట్లలో నేడు ఒక జట్టు నేడు టైటిల్ గెలవనుంది.