ఇంగ్లాండ్ తో 5 టెస్టుల సిరీస్ లో భాగంగా తొలి టెస్టులో టీమిండియా ఊహించని పరాజయాన్ని చవి చూసింది. హైదరాబాద్ లోని ఉప్పల్ వేదికగా జరిగిన ఈ టెస్టులో 231 పరుగుల ఛేజింగ్ లో 202 పరుగులకే కుప్పకూలింది. దీంతో 28 పరుగుల తేడాతో విజయాన్ని అందుకున్న ఇంగ్లాండ్ సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్ తర్వాత రోహిత్ ఏం చేయలేకపోయాడని ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ అన్నాడు. అంతేకాదు ఇంగ్లాండ్ 5-0 తేడాతో సిరీస్ క్లీన్ స్వీప్ చేస్తుందని జోస్యం చెప్పాడు.
హైదరాబాద్ లో ఇంగ్లాండ్ అద్భుత విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్ లో 190 పరుగుల ఆధిక్యం తర్వాత ఇంగ్లాండ్ జట్టు గెలుస్తుందని ఊహించలేదు. ఇంగ్లాండ్ ప్రపంచ కప్ గెలిచినట్లు అనిపిస్తుంది. 10 ఏళ్లలో భారత్ కు స్వదేశంలో ఇది కేవలం నాలుగో ఓటమి మాత్రమే. రెండో ఇన్నింగ్స్ లో ఓలీ పోప్ అద్భుతంగా ఆడాడు. భారత గడ్డపై ఒక విదేశీ ప్లేయర్ ఆడిన గొప్ప ఇన్నింగ్స్ ల్లో ఇదొకటి. టామ్ హార్ట్‌లీ బౌలింగ్ బాగా ఆకట్టుకుంది. పోప్, హార్ట్‌లీ ఇదే ఫామ్ ను కొనసాగిస్తే భారత్ ను ఇంగ్లాండ్ వైట్ వాష్ చేస్తుందని పనేసర్ పనేసర్ ANI తో అన్నారు.
స్వదేశంలో చివరిసారిగా టీమిండియా టెస్టు సిరీస్ ఇంగ్లాండ్ పైనే ఓడిపోయింది. 2012-13 లో 2-1 తేడాతో అలెస్టర్ కుక్ సారధ్యంలో ఇంగ్లాండ్ సిరీస్ గెలిచింది. ఈ సిరీస్ లో ఇంగ్లాండ్ స్పిన్నర్లు పనేసర్, స్వాన్ భారత బ్యాటర్లను తమ స్పిన్ తో కట్టి పడేశారు. ఆ తర్వాత 2016/17లో 0-4 తేడాతో 2020/21లో 1-3 భారత్ చేతిలో ఘోర పరాజయం పాలైంది. ఈ సిరీస్ లో భాగంగా రెండో టెస్ట్ ఫిబ్రవరి 2న వైజాగ్ వేదికగా జరుగుతుంది. గాయాలతో రాహుల్, జడేజా ఈ టెస్టులో ఆడటం లేదు. వీరి స్థానాల్లో సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్ టన్ సుందర్, సౌరబ్ కుమార్ లను ఎంపిక చేసింది.