భూమిపై సహజ ప్రకంపనల మాదిరిగానే చంద్రునిపై కూడా ప్రకంపనలు కలుగుతాయని రోవర్ తాజాగా జరిపిన పరిశోధనల్లో తేలింది. చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండర్ లోని భూకంప కార్యకలాపాలను గుర్తించే పరికరాలు, ప్రజ్ఞాన్ రోవర్, ఇతర పేలోడ్ ల కదలికల ఆధారంగా చంద్రుని ఉపరితలంపై ప్రకంపనలు రికార్డు చేశాయని ఇస్రో తెలిపింది.
చంద్రయాన్ 3 ల్యాండర్‌లోని లూనార్ సిస్మిక్ యాక్టివిటీ (ILSA) పేలోడ్ లో మైక్రో ఎలక్ట్రో మెకానికల్ సిస్టమ్స్ (MEMS) టెక్నాలజీ ఆధారిత పరికరం --రోవర్ , ఇతర పేలోడ్‌ల కదలికలను రికార్డ్ చేసిందని ఇస్రో ట్విట్టర్లో తెలిపింది.
ఇది ఇస్రో తెలిపిన వివరాల ప్రకారం.. ఆగష్టు 26, 2023న సహజంగా జరిగిన ఒక సంఘటనను రికార్డ్ చేసింది. ఈ సంఘటన గురించి ప్రస్తుతం పరిశోధిస్తున్నాం" అని ఇస్రో తెలిపింది. సహజ భూకంపాలు, ప్రభావాలు, కృత్రిమ సంఘటనల ద్వారా ఉత్పన్నమయ్యే ప్రకంపనలను కొలవడమే ILSA ప్రాథమిక లక్ష్యం.
అంతకుముందు విక్రమ్ ల్యాండర్లో ఉన్న మరో పరికరం ..చంద్రుని దక్షిణ ధృవ ప్రాంతంలో చంద్రుని ఉపరితలం సమీపంలో మొదటిసారి ప్లాస్మా కణాల కొలతలను పంపింది. సేకరించిన డేటా ప్రకారం.. చంద్రుని ఉపరితలంపై ప్లాస్మా చాలా తక్కువగా ఉందని ఇస్రో ప్రాథమిక అంచానాకు వచ్చింది.