ఉధృతంగా మూసీ ప్రవాహం.. డేంజర్లో మూసారాం బాగ్ బ్రిడ్జ్...

హైదరాబాద్లోని మూసారాం బాగ్ బ్రిడ్జ్ ప్రమాదంలో ఉంది. ఈ బ్రిడ్జ్ ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి. భాగ్యనగరంలో భారీగా కురిసిన వర్షాలు..వరదలతో మూసీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరిగింది. దీంతో మూసారాం బాగ్ బ్రిడ్జ్ దగ్గర  మూసీ ఉప్పొంగి ప్రవహిస్తోంది. 

మూసారాం బాగ్ బ్రిడ్జ్  దగ్గర మూసీ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో...అధికారులు అలర్ట్ అయ్యారు. ముంపు కాలనీ వాసులను అప్రమత్తం చేశారు. వరద ఉధృతి పెరిగే అవకాశం ఉండటంతో అలర్ట్గా ఉండాలని సూచనలు చేశారు.  బ్రిడ్జి దగ్గర పరిస్థితిని  జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్, పోలీస్ అధికారులు,  స్థానిక కార్పొరేటర్, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పర్యవేక్షిస్తున్నారు. వరద ఉధృతి పెరిగితే బ్రిడ్జ్ ను మూసివేస్తామని స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ప్రకటించారు. మూసారాం బాగ్ బ్రిడ్జి పైన చెత్త చెదారం జీహెచ్ఎంసీ సిబ్బంది క్లీన్ చేస్తున్నారు. 

కొత్త బ్రిడ్జి ఇంకెప్పుడు..

మూసారాంబాగ్ బ్రిడ్జి స్థానంలో కొత్త వంతెన నిర్మిస్తామని గతేడాది జులై 29న మంత్రి శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ ప్రత్యేక చొరవతో ప్రభుత్వం ముసారాంబాగ్ వంతెన నిర్మాణం కోసం రూ.52 కోట్లను మంజూరు చేసిందని ఆయన వివరించారు.  ఈ బ్రిడ్జిల నిర్మాణ పనులను 10 రోజుల్లో ప్రారంభించి 9 నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకు రానున్నట్లు అప్పట్లో మంత్రి పేర్కొన్నారు.  మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించి ఏడాది అవుతున్నా..ఇప్పటి వరకు మూసారాంబాగ్ కొత్త వంతెన నిర్మాణానికి కనీసం శంకుస్థాపన కూడా చేయలేదు.