భద్రాద్రి జిల్లా తాళ్లపాయి శివారులో దుప్పి తోలు

ములకలపల్లి, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలోని తాళ్లపాయి శివారులోని జీడీ మామిడి తోటలో చెట్టుపై దుప్పి చర్మం కనిపించింది. గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం రాత్రి దుప్పిని చంపి మాంసం తీసుకొని చర్మాన్ని వదిలివెళ్లినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న ములకల పల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రవి కిరణ్, స్థానిక ఎస్సై రాజమౌళి, డీఆర్ఓ రాము, ఎఫ్ బీవో మహేశ్​ గురువారం సంఘటనా స్థలానికి వెళ్లి దుప్పి చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుప్పిని ఎక్కడ చంపారు? ఎవరు చంపారు అన్న దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

కొద్దిరోజులుగా ఈ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు వన్యప్రాణులను వేటాడేందుకు నాటు తుపాకులు పట్టుకొని తిరుగుతున్నారని గ్రామస్తులు తెలిపారు. ములకలపల్లి అటవీ ప్రాంతాల్లో దుప్పుల సంచారం ఎక్కువగా ఉంటుందని, పొలాల్లో ఆహారం కోసం వచ్చినప్పుడు చంపి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు.