మూసీ నది పునర్జీవనం కోసం 141 కోట్ల రూపాయలతో ఒప్పందం చేసుకున్నట్లు స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రపంచంలోని ఐదు బెస్ట్ కంపెనీలను డీపీఆర్ ( డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) సిద్ధం చేయమని చెప్పినట్లు వెల్లడించారాయన. మూసీపై ప్రతిపక్షాలు తప్పుడు మాటలు మాట్లాడుతున్నాయని.. తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నాయంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారాయన. మూసీ కోసం లక్షా 50 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారంటూ మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి.
మూసీ నది పునర్జీవనం విషయంలో.. పెట్టుబడుల ఆహ్వానం, రుణాల సేకరణ, వంటి అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి.. గ్రౌండ్ రియాల్టీని అంచనా వేయటానికి ఐదు కంపెనీలను ఎంపిక చేసినట్లు వెల్లడించారాయన. ఈ ఐదు కంపెనీలు గ్లోబల్ సమ్మిట్స్, సెమినార్లు వివిధ దేశాలు నిర్వహించి.. పారిశ్రామికవేత్తలను హైదరాబాద్ తీసుకురావటానికి.. పెట్టుబడులు పెట్టటానికి.. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా సహాయ సహకారాలు అందిస్తాయని వెల్లడించారాయన.
ALSO READ | మూసీ సుందరీకరణ కాదు.. పునర్జీవనం.. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల కోసం: సీఎం రేవంత్ రెడ్డి
ఈ ఐదు కంపెనీలు.. ప్రాజెక్టు రిపోర్ట్ పై నిరంతరం సలహాలు, సూచనలు ఇవ్వటానికి 18 నెలలు పని చేస్తాయని.. ఆ తర్వాత మూసీ నది పునర్జీవనం ప్రాజెక్టు కంప్లీట్ అయ్యే వరకు.. మరో ఐదు సంవత్సరాలు పని చేస్తాయన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్. మూసీ పునర్జీవం తర్వాత వచ్చే పెట్టుబడులు, నిధుల సేకరణ వంటి అన్ని అంశాలపై ప్రభుత్వానికి తమ సలహాలు, సూచనలు ఇవ్వటంతోపాటు.. పారిశ్రామికవేత్తలు.. ప్రభుత్వం మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తాయని వివరించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ ఐదు కంపెనీలకు టెండర్ అగ్రిమెంట్ కింద 141 కోట్ల రూపాయలతో ఒప్పందం చేసుకున్నట్లు వివరించారు. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు లక్షా 50 వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారాయన.