
హైదరాబాద్, వెలుగు: దక్షిణ కొరియాలోని సియోల్ నగరంలో చియోంగ్ గయే చేయన్ ( హన్ ) నదికి అక్కడి ప్రభుత్వం పునరుజ్జీవం కల్పించినట్లుగానే హైదరాబాద్‌లోని మూసీ నది ప్రక్షాళన చేస్తామని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ తెలిపారు. వ్యాపార, విహార కేంద్రంగా మూసీకి కొత్త కళ తీసుకొస్తామని చెప్పారు. మూసీ నది పునరుజ్జీవ కార్యక్రమంలో భాగంగా 12మందితో కూడిన ప్రత్యేక పరిశీలన బృందం సియోల్ చేరుకున్నది.
హన్ నదీ పరీవాహక ప్రాంతాలను మంత్రులు, ఎంపీ చామల కిరణ్, ఎమ్మెల్యేలు మల్ రెడ్డి రంగారెడ్డి, కాలె యాదయ్య, మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా రెడ్డి తోపాటు మీడియా టీమ్ సభ్యులు పరిశీలించారు. గతంలో అత్యంత కాలుష్యంతో నిండి ఉన్న హన్ నది నూతన కళను సంతరించుకున్న తీరును సమగ్రంగా తెలుసుకున్నారు. ‘హన్‌నది పరీవాహక ప్రాంతంలో చాలామంది చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు. ప్రభుత్వం 2003 అక్టోబర్ 1న ఈ నది ప్రక్షాళనకు ప్రతిపాదించి, పనులకు శ్రీకారం చుట్టింది.
కానీ, నదివెంట వ్యాపారాలు చేసుకునే పేదలు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రభుత్వం వారి భవిష్యత్తుకు హామీ ఇచ్చి, అక్కడినుంచి ఖాళీ చేసేందుకు ఒప్పించింది. దీంతో 2005 అక్టోబర్ 1 నాటికి ప్రాజెక్ట్ పూర్తయ్యింది. దీనివల్ల కాలుష్యం నుంచి సిటీకి విముక్తి లభించడంతోపాటు వ్యాపార విస్తరణ ద్వారా నిర్వాసితుల జీవితాల్లో గణనీయమైన మార్పు వచ్చింది. ప్రస్తుతం హన్ నది చుట్టూ ప్రపంచమే విస్తుపోయేలా భారీ కట్టడాలు, సుందరీకరణతో పర్యాటకం పరుగులు తీస్తున్నది” అని అక్కడి అధికారులు తెలంగాణ బృందానికి వివరించారు.
మూసీ నదిని సుందరంగా తీర్చిదిద్దుతం: మంత్రి పొంగులేటి
సియోల్‌లోని హన్‌నది ప్రక్షాళన గురించి తెలుసుకున్నామని, అదే తరహాలో మూసీ నదిని కూడా సుందరంగా మారుస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. ప్రతిపక్షాలు చేసే నిరాధార ఆరోపణలు, అభూత కల్పనలకు భిన్నంగా మూసీ నిర్వాసితులు, ప్రజల ముంగిట్లో ప్రగతి ఫలాలను ఉంచుతామని చెప్పారు.
వేస్ట్ టు ఎనర్జీ టెక్నాలజీతో చెత్త రీసైక్లింగ్
సౌత్ కొరియాలోని సియోల్ నగర పాలక సంస్థ చెత్త రీసైక్లింగ్‌కు వేస్ట్ టు ఎనర్జీ టెక్నాలజీని వాడుతున్నది. పర్యావరణంపై ఏ మాత్రం దుష్ప్రభావం పడకుండా ఇక్కడ మోడ్రన్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. మరో పదేండ్లలో భూ ఉపరితలం నుంచి పూర్తిగా తొలగించి, భూగర్భంలో అతి పెద్ద ప్లాంట్‌ను నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. కార్పొరేట్ ఆఫీస్ తరహాలో ఉన్న మాపో రిసోర్స్ రికవరీ ప్లాంట్ పనితీరుపై తెలంగాణ మంత్రుల బృందం అధ్యయనం చేసింది. ఈ విధానాన్ని తెలంగాణలో అమలు చేసే అవకాశాన్ని పరిశీలించారు.
ఇక్కడ రోజుకు వెయ్యి టన్నులు రీ సైకిల్ చేస్తున్నారు. హైదరాబాద్, సియోల్ నగర నమూనాలు ఒకేలా ఉంటాయని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్ తెలిపారు. సియోల్‌లో సుమారు 10 వేల మెట్రిక్ టన్నుల చెత్తను సేకరించి, నగరంలోని 4 వైపులకు తరలిస్తున్నారని వివరించారు. అదే హైదరాబాద్‌లో దాదాపు 8 వేల మెట్రిక్ టన్నుల చెత్తను సేకరించి, ఒకే వైపునకు తీసుకెళ్తున్నామని అన్నారు.