ఆరు నియోజకవర్గాల్లో గెలుపోటములపై ప్రభావం
నల్గొండ, వెలుగు : వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రధాన రాజకీయ పార్టీలకు మూసీ నది ఎన్నికల అస్త్రంగా మారబోతోంది. కొన్నేళ్లుగా మూసీ నది ప్రక్షాళన కోసం ఎన్నో పోరాటాలు జరుగుతున్నా ఇప్పటివరకు పాలకులు పట్టించుకోలేదు. తెలంగాణ వచ్చాక మూసీ ప్రక్షాళన చేపడతామని సీఎం కేసీఆర్ అనేక సందర్భాల్లో చెప్పినా కార్యరూపం దాల్చలేదు. అయితే మునుగోడు ఉప ఎన్నికలప్పటి నుంచి మళ్లీ మూసీ నది అంశం తెరపైకి వచ్చింది. మూసీ కింద భువనగిరి పార్లమెంట్సెగ్మెంట్ పరిధిలోని ఆరు నియోజకవర్గాల్లో సుమారు రెండు లక్షల ఎకరాల ఆయకట్టు సాగవుతోంది. ప్రధానంగా వరి, పత్తి పంటలను రైతులు సాగు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా వికారాబాద్ ప్రాంతంలోని అనంతగిరి కొండల్లో మొదలయ్యే మూసీ హైదరాబాద్‌నుంచి యాదాద్రి, భువనగిరి మీదుగా ప్రవహించి నల్గొండ జిల్లాలోని వాడపల్లి వద్ద కృష్ణా నదిలో కలుస్తోంది. గంగా నది తరహాలోనే మూసీ ప్రక్షాళన చేపడితే ఉమ్మడి నల్గొండ జిల్లా సస్యశ్యామలంగా మారుతుందని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఇటీవల కాలంలో మళ్లీ గొంతెత్తుతున్నాయి. బీఆర్ఎస్పార్టీ సైతం మునుగోడు ఎన్నికల్లో మరోసారి మూసీ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. నదీ ప్రక్షాళన కాకుండా కేవలం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలు నిర్మిస్తామన్న పాత మాటలనే మళ్లీ వల్లె వేసింది. దీంతో కేంద్రంలోని బీజేపీ సర్కార్మూసీ ప్రక్షాళనపై ఫోకస్పెట్టాలని రాజకీయ పార్టీలు మళ్లీ పోరాటాలకు సిద్ధమవుతున్నాయి.
వ్యర్థాలతో కలుషితం
భువనగిరి పార్లమెంట్పరిధిలోని మునుగోడు, భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, నకిరేకల్నియోజకవర్గాలతోపాటు, రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో మూసీ ప్రవహిస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, భువనగిరి జిల్లాలోని రసాయన పరిశ్రమలు, ఇండస్ట్రీలు, యూనివర్సిటీలు, పెద్ద పెద్ద విద్యాసంస్థలు నుంచి విడుదలయ్యే వ్యర్థ్యాలన్నీ మూసీలో కలవడం వల్ల నీరంతా కలుషితమవుతోంది. పరిశ్రమలు, విద్యాసంస్థల నుంచి విడుదలయ్యే వ్యర్థాలను శుద్ధి చేసేందుకు ఎక్కడికక్కడ ఎస్టీపీలు నిర్మించాలని ఇంజినీరింగ్ నిపుణులు ఎప్పటి నుంచే పోరాటం చేస్తున్నారు. మూసీ పరివాహక ప్రాంతం ఎక్కువగా భువనగిరి జిల్లాలో ఉండటంతో ఈ ప్రాంత ప్రజలు, రై తులు నదీ ప్రక్షాళన కోసం ఎప్పటినుంచే పోరాటం చేస్తున్నారు. ఇటీవల బీజేపీ స్టేట్చీఫ్బండి సంజయ్చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్రలో కూడా మూసీ ఆయకట్టు రైతులు వారి గోడును వెళ్లబోసుకున్నారు. మరోవైపు ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం మూసీ ప్రక్షాళన చేయాలని ప్రధాని మోడీని పలుసార్లు కలిశారు. మరికొద్ది నెలల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలు కానుంది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండలో మూసీ సమస్యనే ప్రధాన ఎజెండాగా మారబోతున్నట్లు తెలుస్తోంది. దీని కోసం త్వరలో ఎంపీ కోమటిరెడ్డి పాదయాత్ర చేపట్టే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
ఆయకట్టుపై ఎవరి లెక్కలు వాళ్లవే..
మూసీ ఆయకట్టుపై ఎవరి లెక్కలు వాళ్లకే ఉన్నాయి. కేతేపల్లి మండలంలోని రత్నవరం వద్ద నిర్మించిన మూసీ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల కింద నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో 50 ఎకరాలు సాగవుతుందని అంచనా. కానీ భువనగిరి జిల్లాలో ఎంత ఆయకట్టు సాగవుతుందనే దానిపై ఎవరి దగ్గరా సరైన లెక్కల్లేవు. ఇటీవల రిటైర్డ్ఇంజినీర్స్ఫోరం జరిపిన సర్వేలో కాలువలు, బోరుబావుల కింద కలిపి సుమారు 65 వేల ఎకరాలు సాగవుతోందని అంచనా వేశారు. దీంతోపాటు అదనంగా చెరువుల కింద మరో లక్ష ఎకరాలు ఉండొచ్చని అంచనా. నదీ పరివాహక ప్రాంతంలో చెక్ డ్యాంలు, ఫిల్టర్బెడ్లు లేకపోవడంతో హైదరాబాద్‌నుంచి వచ్చే మూసీ వరద నీరంతా వృథాగా వాడపల్లిలోని కృష్ణా సంగమంలో కలిసిపోతోంది.
అసంపూర్తిగా కాల్వ పనులు
రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం బండరావిరాల వద్ద గల మూసీ కత్వ నుంచి పిలాయిపల్లి కాల్వ ప్రారంభమవుతుంది. బండరావిరాల నుంచి చిట్యాల మండలం ఉరుమడ్ల వరకు కాలువ పొడవు 66 కి.మీ. భూదాన్‌పోచంపల్లి, చౌటుప్పుల్, రామన్నపేట, చిట్యాల మండలాల్లోని సుమారు 22,500 ఎకరాలకు సాగునీరు అందించడం కాలువ ప్రధాన ఉద్దేశం. నాలుగు మండలాల్లోని 43 గ్రామాల పరిధిలోని చెరువులు, కుంటలకు నీరు అందించడం ద్వారా 22,500 ఎకరాల బీడుభూములు సాగవుతాయని పిలాయిపల్లి కాల్వను ప్రతిపాదించారు. దీంతోపాటే బున్యాదిగాని కాలువ, ధర్మారెడ్డిపల్లి కాలువల ఆధునీకీకరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.320 కోట్లు కేటాయించింది. సుమారు రూ.290 కోట్లకు పరిపాలన ఆమోదం కూడా లభించింది. కానీ సకాలంలో ఫండ్స్రిలీజ్చేయకపోవడం, భూసేకరణ తదితర సమస్యలతో కాంట్రాక్టర్లు మధ్యలోనే పనులు ఆపేశారు. దీంతో స్థానిక రైతులంతా ఏకమై కాల్వల్లోని అడ్డంకులను తొలగించుకుని చెరువులు, కుంటలు నింపుకొంటున్నారు. కానీ చివరి ఆయకట్టు వరకు నీళ్లు అందకపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు.