ఎవరు అడ్డొచ్చినా మూసీ రివర్ ప్రాజెక్ట్ ఆగదు: సీఎం రేవంత్

ఎవరు అడ్డొచ్చినా మూసీ రివర్ ప్రాజెక్ట్ ఆగదు: సీఎం రేవంత్

హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపడుతోన్న మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్‎పై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగం పొందిన 1473 మంది ఇంజినీర్లకు ఇవాళ (అక్టోబర్ 6) హైదరాబాద్ శిల్పకళావేదికలో సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగ నియామకపత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూసీ నదిని ప్రక్షాళన చేయాలనుకుంటున్నామని.. ఎవరు అడ్డువచ్చిన మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ ఆగదని తేల్చి చెప్పారు. మురికిలో కూరుకుపోయిన మూసీ రివర్‎ను ఎందుకు అభివద్ధి చేసుకోవద్దని ప్రతిపక్షాలను ప్రశ్నించారు. మూసీ బాధితులంతా మురికిలోనే బతకాలా.. వాళ్ల జీవితాలు బాగుపడొద్దా అని నిలదీశారు. 33 టీములతో మూసీ ఏరియాలో అధికారులు సర్వే చేశారని.. నిర్వాసితులను ఒప్పించే ఖాళీ  చేయిస్తున్నామని తెలిపారు.

 విలువైన మూసీ ప్రక్షాళన ప్రాజెక్ట్కు సలహాలు ఇవ్వకుండా ఇంకా విమర్శలు చేస్తున్నారా అని ప్రతిపక్షాలపై ఫైర్ అయ్యారు. 20 ఏండ్లుగా రాజకీయాల్లో ఉన్నానని.. పేదోడి బాధ గురించి నాకు తెలియదా అని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం రూ.7 లక్షల కోట్లు అప్పు చేసింది.. మరో రూ.10 వేల కోట్లు అప్పు చేసి మూసీ బాధితులను ఆదుకోలేమా అన్నారు. తప్పకుండా మూసీ  నిర్వాసితులకు మంచి చోట ఆశ్రయిం కల్పిస్తామని హామీ ఇచ్చారు. మీరు చేసిన అవినీతిని ఆపితే పేదలను ఆదుకోవచ్చని బీఆర్ఎస్‎కు చురకలంటించారు. 

ALSO READ | కాళేశ్వరం కేసీఆరే కట్టిండు..ఆయన కళ్ల ముందే కూలింది: సీఎం రేవంత్

ఎంపీ ఈటల రాజేందర్ చొక్కా మార్చాడు కానీ ఇంకా పాత అంగీ వాసన పోలేదని.. బీఆర్ఎస్ అడుగు జాడల్లోనే ఇంకా ఆయన నడుస్తున్నారని విమర్శించారు. ప్రజలు  నిరాశ్రయులు అవుతారని ప్రాజెక్టులు కట్టకుండా ఉంటారా..? గత ప్రభుత్వం నిర్మించిన మల్లన్న సాగర్, కొండపోచమ్మ, గంధమల్ల రిజర్వాయర్లలో ఎవరి భూములు పోలేదా అని ప్రతిపక్షాలను ప్రశ్నించారు. మల్లన్న సాగర్ కింద రైతులను కొట్టి, బలవంతంగా ఖాళీ  చేయించారన్నారు. మూసీ నిర్వాసితులను రెచ్చగొడుతోన్న కేసీఆర్ కుటుంబం వాళ్ల కోసం ఏమైనా చేసిందా అని ప్రశ్నించారు. పేదలను రెచ్చగొట్టకుండా.. మూసీ నిర్వాసితులను ఎలా ఆదుకుందామో సలహాలు ఇవ్వండని సూచించారు.