మూసీ నిర్వాసితులకు 15 రోజుల్లోగా ఉపాధి

 మూసీ నిర్వాసితులకు 15 రోజుల్లోగా ఉపాధి
  • ఇప్పటికే 15 వేల దాకా డబుల్ బెడ్​రూం​ ఇండ్ల కేటాయింపు 
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్లను టై అప్ చేసి అర్హులకు పథకాలు 
  • స్టూడెంట్లకు అకడమిక్ ​ఇయర్ ​డిస్టర్బ్ కాకుండా తరలింపు ప్రక్రియ
  • ఎన్జీవోల సహకారంతో స్కూళ్ల మ్యాపింగ్.. స్టూడెంట్లకు అడ్మిషన్స్​
  • అత్యంత పారదర్శకంగా తరలింపు.. పునరావాస ప్రక్రియ పూర్తిచేస్తం
  • మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌‌మెంట్ కార్పొరేషన్ ఎండీ దాన కిశోర్ వెల్లడి
  • మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిపై ఎన్జీవోలతో సమావేశం

హైదరాబాద్ ​సిటీ, వెలుగు: మూసీ ప్రక్షాళనలో నిర్వాసిత కుటుంబాలకు డబుల్ బెడ్​రూం ఇండ్లను కేటాయించడంతో సహా అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుందని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ  దాన కిశోర్ తెలిపారు. వారికి జీవనోపాధి కల్పనకు 15 రోజుల్లో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు.  ఈ కార్యక్రమం ఏకపక్షంగా కాకుండా శంకరన్ స్ఫూర్తితో ఎన్జీవోలు, నిర్వాసిత కుటుంబాలతో చర్చించి.. వారి తరలింపు, పునరావాస కార్యక్రమాలను చేపడుతున్నట్టు తెలిపారు. శుక్రవారం మాసబ్ ట్యాంక్ లోని ఎన్​ఐయూఎం కాన్ఫరెన్స్ హాల్ లో మూసీ పౌర సంస్థల (ఎన్జీవో)  ప్రతినిధులతో మూసీ సుందరీకరణ, అభివృద్ధి, నిర్వాసితులకు పునరావాసం మొదలైన అంశాల పై సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. 

మూసీ ప్రక్షాళనకు సంబంధించి ఎన్జీవో ప్రతినిధుల సలహాలు, సూచనలు స్వీకరించారు. ఈ సందర్భంగా దాన కిశోర్​ మాట్లాడుతూ, హైదరాబాద్ భవిష్యత్తును కాపాడాలంటే మూసీ రివర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పునరుద్ధరించాల్సిందేనని అన్నారు. లేకపోతే ప్రమాదం పొంచి ఉన్నదని పర్యావరణ వేత్తలుహెచ్చరిస్తున్నారని చెప్పారు. మేధా పాట్కర్  సహా అనేకమంది సామాజిక కార్యకర్తలు ‘సేవ్ మూసీ’ పేరుతో  ప్రచార కార్యక్రమాలను నిర్వహించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ఎన్జీవో ప్రతినిధులకు గుర్తుచేశారు. లండన్​లోని థేమ్స్, సౌత్ కొరియాలోని సియోల్  నదుల్లా మూసీ నది రివర్ ఫ్రంట్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పారు. 

జీవనోపాధి కల్పన పై ప్రత్యేక దృష్టి

ప్రతి నిర్వాసిత కుటుంబం జీవనోపాధులపై సర్వే చేస్తున్నామని దాన కిశోర్​ తెలిపారు. స్వయం సహాయక సంఘాల (ఎస్​హెచ్​జీ) మహిళలపై ప్రధానంగా ఫోకస్ పెట్టినట్టు చెప్పారు. ఎస్​హెచ్​జీ మహిళలకు బ్యాంకుల ద్వారా వడ్డీలేని రుణాలు అందేలా చూస్తామని తెలిపారు. ఇష్టమైన వృత్తి చేపట్టేందుకు సహకారం అందిస్తామన్నారు. ఇప్పటికే మూసీ నిర్వాసిత కుటుంబాలకు 15 వేల డబుల్ బెడ్ రూం ఇండ్లను కేటాయిస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని అన్నారు. ఒకే ఇంట్లో రెండు కుటుంబాలు ఉంటే వారికి కూడా ఇల్లు కేటాయించే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. పట్టా ఉంటే చట్ట ప్రకారం రావాల్సిన అన్ని ప్రయోజనాలను అందిస్తామని తెలిపారు. త్వరలోనే  బఫర్ జోన్ లో నిర్మాణాల సర్వే, మార్కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రక్రియ అంతా ఆయా ప్రాంతాలకు చెందిన కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్ల సహాయంతో చేపడతామని దాన కిశోర్​ తెలిపారు.

 బఫర్ జోన్ లో పట్టాలు ఉన్న కుటుంబాలకు పునరావాస చట్టం ప్రకారం పునరావాసం కల్పించి, పరిహారం అందజేయనున్నట్టు తెలిపారు. అలాగే చట్ట ప్రకారం రావాల్సిన అన్ని ప్రయోజనాలను అందజేశాకే నిర్మాణాలను తొలగిస్తామని చెప్పారు. ఇప్పటికే రివర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్మాణాల సర్వే, మార్కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రక్రియ  చేపట్టామని తెలిపారు. నిర్వాసితులకు పునరావాసం కల్పించాకే రివర్ బెడ్ లోని నిర్మాణాలను తొలగించనున్నట్టు తెలిపారు. రివర్ బెడ్ లో కూడా కొందరికి పట్టాలు ఉన్నట్టు తమ దృష్టికి వచ్చిందని, అలాంటి వారు తమ పట్టాలను సంబంధిత జిల్లా కలెక్టర్ కు  ఇవ్వాలని చెప్పారు. పరిశీలించి అర్హులైతే పరిహారం అందజేస్తామని తెలిపారు. మూసీ ప్రవాహ వేగానికి కొట్టుకుపోయిన ఇండ్లు ఏవైనా ఉంటే క్షేత్రస్థాయి సర్వే నివేదిక ఆధారంగా బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని చెప్పారు. అలాగే, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్లను టై అప్ చేసి అర్హులకు రుణాలు, పథకాలు అందజేస్తామని తెలిపారు.  

ఎన్జీవో  ప్రతినిధులు సహకరించాలి

మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి , సుందరీకరణ కు  ఎన్జీవో లు తమవంతు సహకారం అందించాలని దాన కిశోర్​ కోరారు. హైదరాబాద్ భవిష్యత్తు కోసం ప్రభుత్వం చేపడుతున్న ఈ ప్రాజెక్టు అమలుకు నిర్వాసిత కుటుంబాలు సహకారం అందించేలా, ప్రభుత్వంతో కలిసి నడిచేలా క్షేత్రస్థాయికి వెళ్లి వారిని చైతన్యం చేయాలని అన్నారు. 

అకడమిక్ ​ఇయర్​కు ఆటంకం లేకుండా చూస్తం

నిర్వాసిత కుటుంబాల్లో విద్యార్థులు ఉంటే వారి విద్యా సంవత్సరానికి ఆటంకం లేకుండా తరలింపు ప్రక్రియ చేపడతామని దాన కిశోర్​ తెలిపారు. ఈ అంశం పై ఎన్జీవో  ప్రతినిధులతో కూడిన కమిటీతో సర్వే చేయించి, వారి నివేదిక ఆధారంగా పునరావాసానికి దగ్గరలో ఉన్న స్కూళ్లలో ప్రవేశాలు కల్పిస్తామని చెప్పారు. ఆసక్తి ఉన్న వారిని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల్లో కూడా చేర్పిస్తామని తెలిపారు. మూసీ పునరావాస ప్రక్రియ సజావుగా జరిగేందుకు ఉన్నతాధికారులతో హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.