మూసీని ఆక్రమించింది రాష్ట్ర సర్కారే

హైదరాబాద్​ లో 2020 అక్టోబర్​12, 13, 14 తేదీల్లో కురిసిన వర్షం చరిత్రలో నిలిచిపోతుంది. 1908 వరదల తర్వాత 2000, ఆ తర్వాత 2006, 2016లో భారీ వరదలు వచ్చాయి. ఇప్పుడు వచ్చిన వరదలు వాటన్నింటినీ మించిపోయాయి. మొట్టమొదటిసారి హైదరాబాద్‌ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో వరద ప్రభావం కనిపించింది. ఓల్డ్​ సిటీలో పాత డ్రైనేజీ వ్యవస్థ బాగానే ఉన్నా, పెరిగిన జనాభాకు, ఇప్పటి వర్షాలకు తగిన సామర్థ్యం లేక అక్కడ నీటి ప్రవాహం పెరిగి, తీవ్ర నష్టాలకు కారణమైంది. శాటిలైట్ ​ఆధారిత ముందస్తు వాతావరణ సమాచారం ఉన్నప్పటికీ వరదలు వచ్చే సూచనలను సర్కారు పట్టించుకోలేదు. కొంతకాలంగా వర్షాలు పడి చెరువులన్నీ నిండాయి. హైదరాబాద్‌ నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌ సాగర్‌ నుంచి నీటిని ఇటీవల కాలంలో రెండు, మూడుసార్లు రిలీజ్​ చేశారు. ఇంకా వర్షం పడితే సమస్య పెద్దదవుతుందని తెలిసినా ప్రజలను, ప్రభుత్వ యంత్రాంగాన్ని సమాయత్తం చేయలేదు. వరంగల్‌, కరీంనగర్‌, ములుగు తదితర జిల్లాల్లో వరద బీభత్సం కొనసాగినప్పుడూ ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదు. 

నిన్న కాక మొన్న ముంబై భారీ వర్షాలకు అతలాకుతలమైంది. ఢిల్లీ, చెన్నై, బెంగళూరులో కుంభవృష్టి కురుస్తున్నా.. వాటిలో భయానక అనుభవాలు ఎదురైనా.. హైదరాబాద్‌ గురించి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ముంబై, కోల్​కతా, చెన్నై తీర ప్రాంత నగరాలు. హైదరాబాద్‌ సముద్రానికి 600 మీటర్ల ఎత్తున్న దక్కన్​ పీఠభూమిలో ఉంది. ఇక్కడ నీళ్లు దొరకడమే కష్టమని భావిస్తున్న తరుణంలో, వరదలు వచ్చాయి. వరదలు వచ్చే అవకాశం ఇతర నగరాల అనుభవం నుంచి అర్థమవుతున్నా పాలకులు పట్టించుకోలేదు. డ్రైనేజీ వ్యవస్థలో మార్పులకు కనీస ప్రయత్నాలు చేయలేదు.

వాతావరణ మార్పులే కారణం..

గత రెండు రోజుల్లో పడినంతగా ఇదివరకెన్నడూ హైదరాబాద్​లో వర్షపాతం నమోదవలేదు. ఇది క్లైమేట్ చేంజ్​ వల్లే జరిగింది. భూతాపం పెరగడానికి నగరాల్లోని వాయు కాలుష్యం ఒక ప్రధాన కారణం. పర్యావరణ విధ్వంసంతో వాతావరణ మార్పులు జరిగి వర్షపాత తీవ్రత పెరిగినప్పటికీ, హైదరాబాద్‌ ఎదుర్కొంటున్న సమస్య మానవ తప్పిదాల వల్ల వచ్చిందనే విషయం మరిచిపోవద్దు. వర్షం పడిన ప్రతీసారి హైదరాబాద్‌ లో ఏదో ఒక ప్రాంతం నీట మునగడం చూస్తూనే ఉన్నాం. అయితే వరదలను ఎదుర్కోవడంలో జీహెచ్ఎంసీ సంసిద్ధంగా లేదు. సమస్య చిన్నగా ఉన్నప్పుడే మేల్కొంటే ఇంతటి విపత్తు వచ్చేది కాదు. ప్రాణ, ఆస్తి నష్టం నివారించగలిగే పరిస్థితి ఉండేది.

ఆక్రమణలతో నీటి ప్రవాహానికి ఆటంకాలు

డ్రైనేజీ సిస్టంపై ఆకస్మిక ఒత్తిడి వల్ల కలిగే వరదలు.. నదీ వరదల కంటే భిన్నంగా ఉంటాయి. అనేక చోట్ల ఆక్రమణలు నీటి ప్రవాహాన్ని రెండు మీటర్ల వెడల్పునకు తగ్గించాయి. హైదరాబాద్‌ లోని చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోవడం(ఇంపౌండింగ్‌ కెపాసిటీ), నాలాలు, చెరువులు, కుంటలు, ఇతర నీటి వనరుల ఆక్రమణ వల్ల చిన్నపాటి వర్షం వచ్చినా వరదలు వస్తున్నాయి. హుస్సేన్‌ సాగర్‌, ఉస్మాన్​ సాగర్‌, హిమాయత్‌ సాగర్​తో పాటు ఎన్నో పెద్ద చెరువులు ప్రభుత్వ, ప్రైవేట్ ఆక్రమణలతో కుచించుకుపోతున్నాయి. నగరం మొత్తం సిమెంట్‌ కట్టడాలు, సిమెంట్‌ రోడ్ల వల్ల నీటి ప్రవాహ వేగం కూడా పెరిగింది. వర్షం పడిన క్షణాల్లోనే లోతట్టు ప్రాంతాలు జలమయమైపోతున్నాయి. బిల్డింగ్స్​ మధ్య దూరం లేకపోవడంతో వర్షం నీళ్లు చిన్న నాలాల్లో ఇమడలేక రోడ్డు మీద పారుతున్నాయి. నాలాల ఆక్రమణ, వాటిలో చెత్తాచెదారం పేరుకుపోవడంతో నీటి ప్రవాహానికి ఆటంకాలు ఎదురై నీళ్లు రోడ్ల మీదకు వస్తున్నాయి. 30 రోజుల్లో నాలాలపై ఆక్రమణలను యుద్ధ ప్రాతిపదికన తొలగిస్తామని జీహెచ్ఎంసీ, ప్రభుత్వం ప్రకటించినా మార్పులేదు.

జీహెచ్ఎంసీకి సరైన ప్లాన్​ లేదు

హైదరాబాద్‌ మహానగర అభివృద్ధి ప్రణాళిక పరిపూర్ణంగా లేదు. సమగ్ర, సుస్థిర, దీర్ఘకాలిక ప్రణాళిక లేదు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఉన్నా రాష్ట్ర ప్రభుత్వ జోక్యం పెరిగిపోయింది. భవనాలకు అనుమతులు ఇష్టానుసారం ఇవ్వడం వల్ల, సరళీకృతం చేయడం వల్ల ప్రణాళికాబద్ధ నిర్మాణం జరగలేదు. కొత్తగా కట్టిన ఫ్లై ఓవర్లు, మెట్రో రైల్‌ నిర్మాణంలో ఇంజనీరింగ్‌ సూత్రాలు పాటించకపోవడం వల్ల అనేక చోట్ల వరదలు, కొత్త రకం కుంటలు ఏర్పడి నగర జీవనం మీద, ప్రయాణం మీద దుష్ప్రభావం చూపాయి. జీహెచ్ఎంసీ అప్పుల పాలై సొంత నిర్ణయాలు తీసుకునే స్తోమత కోల్పోయింది. ప్రభుత్వం ప్రజలను సమాయత్త పరచలేదు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపించింది. వరదలు నగరమంతటా వ్యాపించినా ప్రభుత్వ వ్యవస్థలో చలనం ఆశించిన స్థాయిలో లేదు. వరదలతో నిర్వాసితులైన కుటుంబాలకు ప్రభుత్వ సాయం అందుతుందా? అనే అనుమానాలు ఉన్నాయి. మళ్లీ ఇట్లాంటి విపత్కర పరిస్థితి రాకుండా ప్రభుత్వం హైదరాబాద్‌ డ్రైనేజీ సిస్టంను మెరుగు పరచాలి. నీటి వనరులపై ఆక్రమణలను తొలగించడమే కాక, చెరువులను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాతావరణ మార్పుల వల్ల హైదరాబాద్‌ లో మళ్లీ కుంభవృష్టి వచ్చే అవకాశాలు లేకపోలేదు. అందువల్ల ప్రభుత్వం, మున్సిపల్​ కార్పొరేషన్​, జనం సంసిద్ధంగా ఉండడం చాలా అవసరం.

కుచించుకుపోయిన మూసీ

ప్రభుత్వమే నీటి వనరుల ఆక్రమణలకు నాంది పలికింది. నగరవ్యాప్తంగా ప్రభుత్వ సంస్థలు నీటి వనరులను ఆక్రమించుకున్నాయి. మూసీ నదిలో ఎంజీబీఎస్‌, మున్సిపల్‌ డంపింగ్​ యార్డ్, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్​బీ​ ఏర్పాటు చేసిన మురుగునీటి శుద్ధి కేంద్రం, మెట్రో రైల్​ కోసం మూసీ నది మధ్య నిర్మించిన స్టేషన్‌, అమీర్‌ పేట్​ లో మైత్రీవనం బిల్డింగ్‌, హుస్సేన్‌ సాగర్‌ చుట్టూ నెక్లెస్​ రోడ్డు, లుంబినీ పార్కు వీటికి కొన్ని ఉదాహరణలు. ఒకప్పుడు హైదరాబాద్‌ సరస్సులు, పార్కులకు పెట్టింది పేరు. 20–30 ఏండ్లలో అనేక చెరువులు, కుంటలు, చెరువు-–చెరువుకు మధ్య వారధిగా ఉన్న కాల్వలు ఆక్రమణలకు గురై ఇండ్లు, భవనాలుగా మారిపోయాయి. మూసీ కూడా అనేక చోట్ల ఆక్రమణలకు గురైంది. లంగర్‌ హౌస్‌ దగ్గర ఉన్న సంగెం నుంచి నాగోల్​ వరకు నది విస్తీర్ణం చాలా చోట్ల 70 శాతం తగ్గిపోయింది.  ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థలు కలిసి నదిని 6 మీటర్ల విస్తీర్ణానికి తగ్గించేశాయి. చాదర్‌ ఘాట్‌ వంతెన సమీపంలో కూడా ప్రైవేటు ఆక్రమణలు నది విస్తీర్ణంలో 50 శాతానికిపైగా ఉన్నాయి. అక్కడి నుంచి మూసారం బాగ్‌ వంతెన వరకు ఆక్రమణలు కొనసాగుతూనే ఉన్నాయి. సాఫీగా సాగే నీటి ప్రవాహం ఆక్రమణల వల్ల వరదగా మారుతోంది.

– దొంతి నర్సింహారెడ్డి, పర్యావరణవేత్త

For More News..

తెలంగాణ ప్రతిపాదనకు కర్నాటక నో!

ఖమ్మం అత్యాచార బాధితురాలు మృతి

ఎల్ఆర్ఎస్ గడువు పెంచిన ప్రభుత్వం