![Moral Story: కాపలాదారులు..!](https://static.v6velugu.com/uploads/2025/02/moral-story-of-guards_tqxHJk0lD4.jpg)
విజయపురిని వీరసేనుడు పాలించేవాడు. తను సేకరించిన విలువైన వస్తువులు భద్రపరచిన ప్రత్యేక మందిరం కోసం కాపలాదారులుగా కొత్తగా వచ్చిన రామయ్య, భీమయ్యలను నియమించాడు. ఒక రోజు పనివాళ్లు మందిరంలోని వస్తువులను శుభ్రపరిచి వెళ్ళాక, పనివాళ్ళకు అధికారిగా ఉన్న శివయ్య బంగారు తాబేలు బొమ్మ కళ్లలోని ఒక వజ్రం లేదని గమనించాడు.
రాజు గారు పొరుగు రాజ్యం వెళ్లడంతో ఆ విషయాన్ని మంత్రికి తెలియజేశాడు. మంత్రి, శివయ్య ముందరనే రామయ్య, భీమయ్యలను పిలిచి “మీకు పొలిమేరలో గస్తీ తిరిగే పనిని కేటాయిస్తున్నాను..ఈ క్షణమే అక్కడకు వెళ్లిపోండి” అన్నాడు. “అలాగే మంత్రిగారు” అని వారు వెళ్ళిపోయారు. వస్తువులు భద్రపరచిన గదికి తాళం వేసి ఆ తాళం చెవి తన వద్దనే ఉంచుకున్నాడు మంత్రి. నాలుగు రోజుల తరువాత పొరుగు రాజ్యం వెళ్ళిన రాజు గారు కోటకు చేరుకున్నారు. మంత్రి మారువేషంలో పొలిమేర వద్దకు చేరుకుని రామయ్య, భీమయ్యల చెవిలో ఏదో చెప్పి వెళ్లిపోయాడు.
కాసేపటికి రామయ్య కోటకు చేరుకున్నాడు. రాజు కొలువు తీరి ఉన్నాడు. “వందనం మహారాజా! నాలుగు రోజుల క్రితం మీ మందిరంలో ఉన్న తాబేలు బొమ్మకున్న కళ్లలో ఒక కంటికున్న వజ్రం మాయమయ్యిందని మంత్రి గారు నన్ను, భీమయ్యను పొలిమేరలో పని చేయమని చెప్పారు...వజ్రం గురించి నాకేమీ తెలియదు” అన్నాడు రామయ్య. రాజు మంత్రి వైపు చూశాడు.
“మహారాజా! గదిలో పని వాళ్లు వస్తువులు తుడిచి వెళ్ళాక వస్తువులను పరిశీలించిన శివయ్య వజ్రం పోయిన విషయం నాతో చెప్పాడు” అన్నాడు మంత్రి.
శివయ్యను వివరణ అడిగాడు రాజు. “మహారాజా! రామయ్య, భీమయ్యలలో ఎవరో ఒకరు ఆ వజ్రాన్ని కాజేశారు” అన్నాడు శివయ్య. “మహారాజా! నేనే దొంగతనం చేసి ఉంటే మీ ముందు ఇలా ఎందుకు నిలబడతాను?” అన్నాడు రామయ్య ధైర్యంగా. “నువ్వు అటు పక్కగా ఉండు... ఇంకొకరి సమస్య విచారించాక నీ విషయం తెలియజేస్తాను” అన్నాడు రాజు. ఒక గంట తరువాత భీమయ్య సభకు వచ్చాడు “మహారాజా! బుద్ధి గడ్డి తిని ఆ వజ్రాన్ని నేనే కాజేశాను.. నన్ను క్షమించండి..!” అని ఒక వజ్రాన్ని మంత్రి చేతిలో పెట్టాడు. “భీమయ్యను చెరసాలలో పెట్టండి” అని రాజు శాసించాడు.
“ఇంతటితో సభ ముగిస్తున్నాను” అన్నాడు రాజు. శివయ్య ఇంటికి బయలుదేరిన కాసేపటికి, మంత్రి కొంత మంది భటులను తీసుకుని శివయ్య ఇంటికి చేరుకున్నాడు. “పార్వతీ.. మన పంట పండింది... ఇక ఆ వజ్రం మనదే దొంగతనం మరొకరి మీద పడింది” అన్నాడు శివయ్య ఎంతో ఉత్సాహంగా.
“భలే పనిచేశారు ఎదుగూ బొదుగూ లేని జీవితం ఎప్పుడు సంపాదించుకుంటాము. ఈ వజ్రాన్ని మన పొరుగు రాజ్యంలో అమ్మి సొమ్ము చేసుకుందాము” అని మురిసిపోయింది శివయ్య ఇల్లాలు.
తలుపులు దబదబ మని చప్పుడయ్యాయి. శివయ్య వెళ్లి తలుపులు తెరిచాడు. మంత్రితో సహా భటులు ఇంట్లోకి చొరబడ్డారు. అనుకోని సంఘటనకు నోరు వెళ్లబెట్టారు శివయ్య అతని భార్య. మంత్రి శివయ్య చేతిలో ఉన్న వజ్రాన్ని తీసుకుని అతణ్ణి బంధించమని భటులకు చెప్పాడు. అందరూ కోటకు చేరుకున్నాక రాజుకు జరిగింది చెప్పాడు మంత్రి. “కొత్తగా చేరిన రామయ్య, భీమయ్యల మీద దొంగతనం నేరం మోపాలనుకున్నాను. కానీ.. చివరకు దొరికిపోయాను” అని ఒప్పుకున్నాడు శివయ్య. భీమయ్యకు నకిలీ వజ్రం ఇచ్చి దొంగతనం తనే చేశానని చెప్పి మంత్రి ఆడించిన నాటకం ఫలించింది. రాజు శివయ్యను అతని కుటుంబాన్ని కట్టుబట్టలతో రాజ్యం నుండి బహిష్కరించాడు. సులువుగా దొంగను పట్టుకున్న మంత్రిని ఘనంగా సన్మానించడంతో పాటు సహకరించిన రామయ్య, భీమయ్యలకు తలా ఐదు బంగారు నాణేలు ఇచ్చాడు.