
చాలామందికి పర్యావరణం మీద శ్రద్ధ లేకపోవడంతో చెట్లు నరికి ఇళ్లు కట్టడం ప్రారంభించారు. దాంతో చెట్టుమీద నివసించే పక్షులు దిన దిన గండంగా భయపడుతూ జీవించేవి.
చిట్టి చిలుక భయపడిన విధంగానే తాను నివసించే చెట్టును కొట్టడానికి ఒకరోజు మనుషులు వచ్చారు. వాళ్లను చూస్తూ బాధగా అక్కడినుండి వెళ్లి వేరే చెట్టు వెతకసాగింది. కొంత దూరం వెళ్ళిన తరువాత ఒక చెట్టు చూసి తృప్తిపడింది. ఆ చెట్టుమీద అన్ని రకాల పక్షులు ఉండటం చూసింది.చిలుకలున్న కొమ్మపైన ఎగిరి కూర్చొంది.
అక్కడున్న చిలుకలు నవ్వుతూ పలకరించి ‘‘చిట్టి చిలుకా ఈ చెట్టుకు పక్షి నాయకుడు ఉన్నాడు. ఒక మాట ఆ నాయకుడితో చెప్పి, ఆయన చూపించిన చోట కూర్చో” అంది. పక్షి నాయకుడు పావురం దగ్గరకెళ్ళి ఈ చెట్టుమీద ఒక చోటు చూపించమని కోరింది. పక్షి నాయకుడు ఆలోచించి ఒక కొమ్మ చూపించి ‘‘నువ్వు ఆ కొమ్మపై నివసించు’’ అంది.
చిట్టి చిలుక ఆ కొమ్మ పైకి ఎగిరి కూర్చొంది. ఆ కొమ్మ పైనున్న కాకిని చూసి ఉలిక్కిపడింది.‘‘స్వాగతం చిట్టి చిలుకా’’ అంటూ చిరునవ్వుతో కాకి ఆహ్వానించింది.‘నేను అందమైన చిలుకను, నల్లటి కాకి ఉన్న కొమ్మపైన నేను కూర్చోవాలా? దీని గుణము కూడా ఆ నల్లటి రంగులాగే ఉంటుంది’ అని కోపంగా అనుకుంటూ.. పక్షి నాయకుడి దగ్గరకి వెళ్లి ‘‘నాకు వేరే కొమ్మపైన నివాసం ఏర్పాటు చెయ్యండి. ఆ నల్లటి కాకి పక్కన నేనుండను’’ అంది. ‘‘నువ్వు ఇప్పుడే వచ్చావు. వెంటనే వేరొక కొమ్మకు వెళ్ళమనడం న్యాయం కాదు’’ ‘‘చాలా రోజులుగా ఉన్న కాకిని వెళ్ళమని చెప్పవచ్చుగా’’ అంది చిట్టి చిలుక.
అప్పుడు పక్షి నాయకుడు ఒక్క క్షణం ఆలోచించి కాకిని పిలిచి ‘‘ఈ రోజు నుండి చిలుకలున్న కొమ్మపైన నువ్వు నివసించాలి’’ అని చెప్పిన తరువాత పావురం ఎగురుకుంటూ వెళ్ళింది. ‘అయ్యో నా వల్ల చిలుకలున్న కొమ్మపైన కాకి ఉండవలసి వచ్చింది. అన్నిచిలుకలకు నా మీద కోపం వస్తోంది’ మనసులో అనుకొంది చిట్టిచిలుక .
కాకి చిలుకలున్న కొమ్మపైకి వెళ్ళగానే ‘‘చిట్టి చిలుకా నీ ఋణం ఎన్నటికీ తీర్చుకోలేను. ఇక్కడున్న పక్షులన్నీ ఈ కాకిని తమ కొమ్మలో నివసించడానికి అడిగేవి. నీ వల్ల ఆ కాకి మా కొమ్మమీద నివసించడానికి అనుమతించింది. నీ పుణ్యమా అని మంచి మనసున్న కాకి మాతో పాటు ఉంటుంది” అంటూ చిలుకలు గట్టిగా చెప్పసాగాయి.
కాకి నలుపు రంగును చూసి గుణం తక్కువని పొరపాటు చేశాను. నల్లటి కాకిలో వెన్నెల వెలుగులాంటి మంచి మనసుందని తెలుసుకొంది చిట్టి చిలుక.
- ఓట్ర ప్రకాష్ రావు–