దుర్గంధభరితంగా మోరంచపల్లి.. ఊరు విడిచి వెళ్లిపోతున్న గ్రామస్థులు

  • గ్రామంలో ఎటుచూసినా పారిశుద్ధ్య లోపం
  • అంటు రోగాలు ప్రబలే ప్రమాదం

జయశంకర్‌ భూపాలపల్లి, వెలుగు : భూపాలపల్లి జిల్లా మోరంచపల్లిలో ఎటు చూసినా పారిశుద్ధ్య లోపమే కన్పిస్తోంది. ఎక్కడికక్కడ చెత్త, బురద పేరుకుపోవడంతో విషజ్వరాలు, అంటు రోగాలు ప్రబలే ప్రమాదం ఏర్పడింది. వానలు తగ్గి 2 రోజులు అయినప్పటికీ గ్రామంలోని ఏ వీధిలో చూసినా బురదే కనిపిస్తోంది. ఇంటితో పాట ఆరుబయట ఉన్న వస్తువులన్నీ పాడయ్యాయి. పారిశుద్ధ్య సిబ్బంది రంగంలోకి దిగి క్లీనింగ్‌ పనులు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఊరంతా బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లుతున్నారు. 

ఈగలు, దోమల బెడద

మోరంచవాగు ఉధృతికి జల దిగ్భంధంలో చిక్కుకున్న మోరంచపల్లిలోని ఏ ఇంట్లో చూసినా మోకాలి లోతు బురద పేరుకుపోయింది. దీంతో ఎటు చూసినా దోమలు, ఈగలే కనిపిస్తున్నాయి. వాటర్‌ సమస్య కారణంగా ఇండ్లను క్లీన్‌ చేసుకోవడం గ్రామస్తులకు సాధ్యం కాలేదు. వంట పాత్రలు, గ్యాస్‌, సిలిండర్‌తో పాటు నిత్యావసర వస్తువులను మాత్రమే క్లీన్‌ చేసుకున్నారు. 

విషజ్వరాలు, అంటురోగాల ముప్పు

పారిశుద్ధ్య లోపం కారణంగా గ్రామంలో విషజ్వరాలు, అంటురోగాలు ప్రబలే ప్రమాదం కనిపిస్తోంది. హెల్త్‌, పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో గ్రామంలో శానిటేషన్‌ పనులు చేస్తున్నారు. పక్క గ్రామాలకు చెందిన సిబ్బందితో ఇండ్లలో పాడైపోయిన వస్తువులను సేకరించడం, వీధులను క్లీన్‌ చేయడం వంటి పనులు చేస్తున్నారు. డాక్టర్‌‌ రోహిణి, డాక్టర్‌‌ శారద ఆధ్వర్యంలో నలుగురు ఏఎన్‌ఎంలు, నలుగురు ఆశా వర్కర్లు టీమ్‌గా ఏర్పడి ఇంటింటికీ తిరిగారు. వాంతులు, విరేచనాలు కాకుండా, జ్వరం రాకుండా ట్యాబ్లెట్లు ఇవ్వడంతో పాటు, వేడి చేసిన నీటిని తాగాలని అవగాహన కల్పించారు. అలాగే ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు సైతం పంపిణీ చేశారు. కర్కపల్లి, గాంధీనగర్‌‌ రిహాబిలిటేషన్‌ సెంటర్లు ఏర్పాటుచేశారు. 

బంధువుల ఇండ్లకు గ్రామస్తులు

మోరంచపల్లెలో ప్రస్తుత పరిస్థితులు బాగా లేకపోవడంతో కొందరు గ్రామస్తులు తమ బంధువుల ఇండ్లకు వెళ్తున్నారు. బుధవారం రాత్రి వచ్చిన వరద భయం గ్రామస్తులను ఇంకా వెంటాడుతూనే ఉంది. ప్రమాదాన్ని తలచుకొని కొందరు డిప్రెషన్‌లోకి వెళ్లారు. 

బాధితులకు చేయూత

భూపాలపల్లి రూరల్, వెలుగు : భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి వరద బాధితులను ఆదుకునేందుకు సింగరేణి కార్మికులు ముందుకు వచ్చారు. సింగరేణి గుర్తింపు సంఘం టీబీజీకేఎస్‌‌ వైస్‌‌ ప్రెసిడెంట్‌‌ బడితల సమ్మయ్య, ఏఐటీయూసీ సెక్రటరీ మోటపలుకుల రమేశ్‌‌, ఐఎన్‌‌టీయూసీ బ్రాంచ్‌‌ వైస్‌‌ ప్రెసిడెంట్‌‌ జోగ బుచ్చయ్య, సీఐయూ బ్రాంచ్‌‌ సెక్రటరీ కంపేటి రాజయ్యతో పాటు పలువురు నాయకులు శనివారం మీటింగ్‌‌ నిర్వహించారు. ఈ సందర్భంగా భూపాలపల్లి ఏరియా సింగరేణిలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడి జీతం నుంచి రూ.1000 చొప్పున మోరంచపల్లి బాధితులకు ఇవ్వాలని తీర్మానం చేసి ఏరియా జీఎం బళ్లారి శ్రీనివాసరావుకు అందించారు.

బియ్యం, వంట సరుకులు పంపిణీ

మొగుళ్లపల్లి, వెలుగు : మోరంచపల్లి బాధితులకు భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం మేదరమెట్ల ప్రజలు చేయూతనందించారు. సర్పంచ్‌‌ కొనకంటి అరవింద్‌‌రెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తులు 12 క్వింటాళ్ల బియ్యం, వంట సరుకులను తీసుకెళ్లి మోరంచపల్లిలో పంపిణీ చేశారు. మేదరమెట్ల ప్రజలను ఆఫీసర్లు అభినందించారు.